టీచర్ల సర్దుబాటుకు రంగం సిద్ధం
ABN , Publish Date - May 15 , 2026 | 12:55 AM
టీచర్ల సర్దుబాటులో భాగంగా సీనియారిటీ జాబితా తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో పోస్టుల సర్దుబాటుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధారంగా 13,951 మంది టీచర్లు సీనియారిటీ జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
నేడు తుది సీనియారిటీ జాబితా
చిత్తూరు సెంట్రల్, మే 14(ఆంధ్రజ్యోతి): టీచర్ల సర్దుబాటులో భాగంగా సీనియారిటీ జాబితా తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో పోస్టుల సర్దుబాటుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధారంగా 13,951 మంది టీచర్లు సీనియారిటీ జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే సాధారణ సీనియారిటీ జాబితాలను సబ్జెక్టుల వారీగా విడుదల చేసి, వాటి నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 86, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి 24 అభ్యంతరాలు రాగా వాటిని విద్యాశాఖ సిబ్బంది సరిచేశారు. ఈ క్రమంలో శుక్రవారం తుది సీనియారిటీ జాబితాను విడుదల చేయనున్నారు. వీరిలో ఎస్జీటీలు 6951 మంది ఉండగా, హెచ్‌ఎం, స్కూల్ అసిస్టెంట్లు 7 వేల మంది ఉన్నారు. ఈనెల 30లోగా సబ్జెక్టుల వారిగా సీనియారిటీ, రేషనలైజేషన్ జాబితా రూపొందించి పంపాలని రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేశారు. సీనియారిటీ జాబితాలతో పాటు పోస్టుల సర్దుబాటుపై ఏకకాలంలో కసరత్తు చేస్తున్నారు. ఐటీ సెల్ సిబ్బంది కేడర్ల వారీగా టీచర్ల వివరాలతో పాటు అభ్యంతరాలను పరిశీలిస్తూ, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్ల వారీగా జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అదే సమయంలో రేషనలైజేషన్ నిబంధనల మేరకు ఏయే పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు? ఎంత మంది టీచర్లు పనిచేస్తున్నారు? మిగిలిన టీచర్ల పోస్టులను శుక్రవారం నాటికి పిల్లల ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా ఏ స్కూల్లో సర్దుబాటు చేయాలనే దానిపై లెక్కలు కడుతున్నారు. శుక్రవారం నాటికి అడ్మిషన్లు పూర్తి చేయాలని, అప్పటి వరకు వచ్చే ఎన్‌రోల్‌మెంట్ మేరకు పిల్లలకు తల్లికి వందనం మంజూరు చేయడంతో పాటు రేషనలైజేషన్ పరిగణనలోకి తీసుకోనున్నారు.
జూన్ 12లోగా రేషనలైజేషన్ పూర్తి!
ఏటా మే నెలలో టీచర్ల బదిలీలు చేపడతారు. ఈసారి ఉపాధ్యాయుల విభజన నేపధ్యంలో వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు చేపట్టే అవకాశం లేదని అంటున్నారు. కొంత ఆలస్యమైనా, టీచర్లను పోస్టుల వారీగా విభజించి బదిలీ చేయాలనే యోచనలో ఉన్నారు. అందుకే ఉన్న పోస్టులు.. గతేడాది బదిలీల్లో అమలు చేసిన జీవోల మేరకు రేషనలైజేషన్ (సర్దుబాటు) చేయాలని రాష్ట్ర యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. రేషనలైజేషన్ చేసి టీచర్లను ఈ సారి సర్దుబాటు చేయనున్నారు. నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి పంపితే జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం నాటికి టీచర్ల రేషనలైజేషన్ పూర్తి చేయడానికి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ సిద్ధమైంది.