Share News

వైసీపీ కోసం చేసిన పాపం... వెంటాడుతున్న శాపం

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:30 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెహర్బానీ కోసం ఆయా శాఖల అధికారులు పెచ్చుమీరిన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. వారిలో రెవెన్యూ, పోలీసు శాఖలు కీలకం. విజయపురం మండలంలో 2020 కాలంలో పనిచేసిన తహసీల్దారు స్థానిక వైసీపీ నాయకుల పేరు మీద వందల ఎకరాలు నమోదు చేసేశారు. అప్పట్లో కిందిస్థాయి ఉద్యోగుల్లో ముగ్గురిని సస్పెండు చేయగా.. అప్పటి తహసీల్దార్‌ జె.రాముతో పాటు మరో ఇద్దరు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు.

వైసీపీ కోసం చేసిన పాపం... వెంటాడుతున్న శాపం

2020లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి అధికార పార్టీ నేతల పరం

అప్పటి విజయపురం.. ఇప్పుడు పుంగనూరు తహసీల్దారుపై కొనసాగుతున్న విచారణ

నగరి ఆర్డీవోను ప్రజెంటింగ్‌ అధికారిగా నియమిస్తూ తాజా ఉత్తర్వులు

చిత్తూరు, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో నాయకుల మెహర్బానీ కోసం ఆయా శాఖల అధికారులు పెచ్చుమీరిన అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. వారిలో రెవెన్యూ, పోలీసు శాఖలు కీలకం. విజయపురం మండలంలో 2020 కాలంలో పనిచేసిన తహసీల్దారు స్థానిక వైసీపీ నాయకుల పేరు మీద వందల ఎకరాలు నమోదు చేసేశారు. అప్పట్లో కిందిస్థాయి ఉద్యోగుల్లో ముగ్గురిని సస్పెండు చేయగా.. అప్పటి తహసీల్దార్‌ జె.రాముతో పాటు మరో ఇద్దరు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో ప్రభుత్వ శాఖ తరఫున విచారణాధికారికి వాదనలు, ఆధారాలు సమర్పించే ప్రజెంటింగ్‌ అధికారిగా నగరి ఆర్డీవోను నియమించింది.

అప్పుడేం జరిగిందంటే..

విజయపురం మండలంలోని పాతార్కాడు, పన్నూరు, కోసలనగరం, విజయపురం, జగన్నాథపురం, క్షూరికాపురం పంచాయతీల్లో పెద్దఎత్తున భూఅక్రమాలు జరిగాయి. ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నవాటికి.. 20 ఏళ్ల కిందటే డీకేటీ పట్టాలు పంపిణీ చేసినట్లు రికార్డులు సృష్టించారు. ఈ గ్రామాల్లో అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీ నేతలకున్న పలుకుబడిని బట్టి 2 నుంచి 4.5 ఎకరాల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇలా సుమారు 150 మంది పేరిట 800 ఎకరాల్ని నమోదు చేయించారు. వాటిలో కొన్ని..

విజయపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 173లో 2019 ఏప్రిల్‌ 22 నాటికి 760.38 ఎకరాల కొండ ఉంది. అది 2020 ఆగస్టు 19 నాటికి 636.58 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే 123.80 ఎకరాల ప్రభుత్వ భూమి ఆన్‌లైన్‌లో కనిపించకుండాపోయింది. ఈ భూమి హఠాత్తుగా కొందరు వైసీపీ నాయకుల పేరుతో ఆన్‌లైన్‌లోకి ఎక్కింది.

క్షూరికాపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 420 నుంచి 450 వరకు కొత్తగా పలు సబ్‌ డివిజన్లు తయారయ్యాయి. ఇవన్నీ కొందరి పేరుతో డీకేటీ పట్టాలుగా మారిపోయాయి.

కోసలనగరం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 131లో 11.6 ఎకరాల శ్మశాన స్థలాన్ని ఆరుగురు వైసీపీ నాయకులకు పట్టాలిచ్చేశారు. 129-5 సర్వే నంబరులోని శ్మశాన స్థలాన్ని ముగ్గురికి పంచేశారు.

కోసలనగరంలోని సర్వే నంబరు 137-1, 2, 3లో ఇద్దరికి, సర్వే నంబరు 268-9లో ఇద్దరికి డీకేటీ భూములు పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేశారు.

పాతార్కాడు రెవెన్యూ గ్రామంలోని 96, 106-1, 108-1, 2, 110.13, 114-1, 2, 115-1, 2 సర్వే నంబర్లలో 61-95 ఎకరాల డీకేటీ భూమిని పలుకుబడి ఉన్న నేతల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేసేశారు.

అక్రమాల్ని బయటపెట్టిన ఆంధ్రజ్యోతి

‘వైసీపీ నేతల భూబాగోతం’ శీర్షికన 2020 ఆగస్టు 25వ తేదీన ఈ భూఅక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టింది. అప్పటి నగరి ఎమ్మెల్యే రోజా తప్పుడు కథనాలంటూ ఖండించారు. అయితే, అప్పటి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజశేఖర్‌ విచారించి నిజాలను నిగ్గుతేల్చి నివేదిక ఇచ్చారు. దీనిపై సర్వేయర్‌, వీఆర్వో వంటి ముగ్గురు అధికారుల్ని అప్పటి జేసీ మార్కొండేయులు సస్పెండు చేశారు. మొత్తం భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ జె.రాము మీద చర్యలు తీసుకోవాలని జేసీ మార్కొండేయులు, కలెక్టర్‌ భరత్‌గుప్తాకు సిఫార్సు కూడా చేశారు. రాజకీయ ఒత్తిడితో రాము మీద అధికారులు చర్యలు తీసుకోకుండా వదిలేశారు.

కేసులో తాజా పరిణామాలు

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జె.రాము, అప్పటి ఆర్‌ఐ (రిటైర్డ్‌) సి.శ్రీనివాసరెడ్డి, మరో వ్యక్తికి సంబంధించిన శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే ఆరోపణల నోటీసులు జారీ అయ్యాయి. దీనికి జె.రాము 2023 మే 5న, ఆర్‌ఐ సి.శ్రీనివాసరెడ్డి 2026 మే 6న తమ వివరణలను రాతపూర్వకంగా సమర్పించారు. వారి వివరణ పరిశీలించిన అనంతరం సమగ్ర విచారణ అవసరమని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ జూన్‌ 4న ప్రభుత్వానికి నివేదిక అందించారు. కలెక్టర్‌ నివేదిక ఆధారంగా డిసిప్లినరీ అథారిటీ తరఫున కేసును బలంగా వినిపించే బాధ్యతను నగరి ఆర్డీవోకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

గతంలో కంపల్సరీ రిటైర్‌మెంట్‌

తహసీల్దార్‌ జె.రాము విజయపురం కంటే ముందు కేవీపల్లె మండలంలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి భూఅక్రమాలకే పాల్పడ్డారు. ఆ కేసు రుజువు కావడంతో 2021లో ప్రభుత్వం ఆయన మీద కంపల్సరీ రిటైర్‌మెంట్‌ చర్యలు తీసుకుంది. సుమారు రెండేళ్ల పాటు ఆయన రిటైర్‌మెంట్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత అప్పీల్‌ చేసుకుని కేసు కొట్టేసుకుని వచ్చారు. ప్రస్తుతం పుంగనూరు తహసీల్దారుగా రాము విధులు నిర్వర్తిస్తున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 01:30 AM