Share News

ఠారెత్తించిన ఎండలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 01:46 AM

జిల్లావ్యాప్తంగా మంగళవారం ఎండలు భగ్గుమన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో మే నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భావించినప్పటికీ అంతకంటే చాలా ముందుగానే భానుడు జిల్లాను ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం అత్యధికంగా వరదయ్యపాలెంలో 44.4 డిగ్రీలు, సత్యవేడులో 44.2 డిగ్రీలు చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఠారెత్తించిన ఎండలు

వరదయ్యపాలెం, సత్యవేడుల్లో

44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

31 మండలాల్లో 40కి పైనే....

తిరుపతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా మంగళవారం ఎండలు భగ్గుమన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో మే నెలలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని భావించినప్పటికీ అంతకంటే చాలా ముందుగానే భానుడు జిల్లాను ఠారెత్తిస్తున్నాడు. మంగళవారం అత్యధికంగా వరదయ్యపాలెంలో 44.4 డిగ్రీలు, సత్యవేడులో 44.2 డిగ్రీలు చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తం 36 మండలాలకు గానూ 31 మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మండలాల వారీగా చూస్తే పెనగలూరులో 43.4, రేణిగుంటలో 42.9, వెంకటగిరి, తొట్టంబేడు మండలాల్లో 42.7 చొప్పున, ఆర్సీపురంలో 42.4, దొరవారిసత్రంలో 42.3, ఏర్పేడు, శ్రీకాళహస్తి, డక్కిలి మండలాల్లో 42.2 చొప్పున, బాలాయపల్లిలో 42, తిరుపతి రూరల్‌లో 41.9, పిచ్చాటూరులో 41.8, నాయుడుపేటలో 41.6, కోడూరు, చిట్వేలి, ఓబులవారిపల్లి మండలాల్లో 41.4 చొప్పున, పెళ్ళకూరులో 41.2, వడమాలపేట, చంద్రగిరి మండలాల్లో 41.1 వంతున, ఓజిలిలో 40.9, సూళ్ళూరుపేట, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో 40.8 వంతున, పుల్లంపేటలో 40.7, తడ, పుత్తూరు, నారాయణవనం, నాగలాపురం, కేవీబీపురం మండలాల్లో 40.5 చొప్పున, తిరుపతి అర్బన్‌లో 40.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐదు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లోనూ ఎండవేడిమి, ఉక్కపోతతో జనం సతమతమయ్యారు. తిరుపతి నగరం సహా దాదాపు అన్ని పట్టణాలూ, మండల కేంద్రాల్లోని రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి

నేడూ, రేపూ కూడా ఇదే పరిస్థితి

బుధ, గురువారాల్లో సైతం జిల్లావ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తించనున్నాయి. వాతావరణ పరిశోధనా కేంద్రం జారీ చేసిన బులెటిన్‌ ప్రకారం రెండు రోజులూ జిల్లాలోని 35 మండలాల్లో పగటి ఉష్ణోగత్రలు 40 డిగ్రీలు దాటి నమోదు కానున్నాయి. ఈ రెండు రోజులూ పాకాల మండలంలో మాత్రమే 40 డిగ్రీలకు లోపు ఉష్ణోగ్రత వుంటుందని, మిగిలిన మండలాల్లో 40 నుంచీ 42 డిగ్రీలు దాటి ఎండ వేడిమి నెలకొంటుందని బులెటిన్‌ తెలిపింది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా జిల్లాలో ప్రజలు వేసవి తాపాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది.

వడదెబ్బతో రైతు మృతి

డక్కిలి: డక్కిలి మండలం తిమ్మాయపాళెం గ్రామానికి చెందిన రైతు బొడ్డు రమణయ్య (62) వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.రోజువారీ పొలంపనులు చూసుకొని మధ్యాహ్నం ఎండలో ఇంటికి చేరుకొన్నాక అస్వస్థతకు గురై రమణయ్య కుప్పకూలి పోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

Updated Date - Apr 22 , 2026 | 01:46 AM