Share News

భూ రికార్డుల్లో మళ్లీ అవే తప్పులు

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:06 AM

: వైసీపీ పాలనలో చేపట్టిన భూముల రీసర్వే పాపం రైతులను శాపంలా వెంటాడుతోంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వంతోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే మళ్లీ అవే గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో అధికారులకు సమగ్ర అవగాహన కల్పించకుండానే జగనన్న భూరక్ష పేరుతో రీసర్వే చేపట్టారు. గ్రామాల్లో సభలు నిర్వహించకుండా ఆఘమేఘాలపై సర్వే పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో భూముల రికార్డులు తారుమారు కావడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల రికార్డులను సవరించి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందింది. 2024 అక్టోబరు నుంచి దశలవారీగా భూ సమస్యలపై ఆయా గ్రామాల్లో అధికారుల బృందాలు సభలు నిర్వహించి బాధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. కానీ అవి జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌లో సరిదిద్దాల్సి రావడంతో ఏడాదిన్నరగా రైతులు ఎదురుచూడాల్సి వచ్చింది. కొత్త పాసుపుస్తకాలు రాజముద్రతో సిద్ధం చేసి శుక్రవారం నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టారు. కానీ ఉన్న నాలుకకు మందు వేస్తే కొండ నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.

భూ రికార్డుల్లో మళ్లీ అవే తప్పులు
ఫొటోమారిన రైతు పట్టాదారు పాసుపుస్తకం

- రైతులను వెంటాడుతున్న వైసీపీ రీసర్వే పాపం

- ప్రభుత్వం మారినా తప్పని గందరగోళం

శ్రీకాళహస్తి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో చేపట్టిన భూముల రీసర్వే పాపం రైతులను శాపంలా వెంటాడుతోంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వంతోనైనా సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తే మళ్లీ అవే గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి.

మూడేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో అధికారులకు సమగ్ర అవగాహన కల్పించకుండానే జగనన్న భూరక్ష పేరుతో రీసర్వే చేపట్టారు. గ్రామాల్లో సభలు నిర్వహించకుండా ఆఘమేఘాలపై సర్వే పూర్తి చేశారు. ఆన్‌లైన్‌లో భూముల రికార్డులు తారుమారు కావడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంతలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడం జరిగాయి. రీసర్వే జరిగిన గ్రామాల్లో భూముల రికార్డులను సవరించి ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందింది. 2024 అక్టోబరు నుంచి దశలవారీగా భూ సమస్యలపై ఆయా గ్రామాల్లో అధికారుల బృందాలు సభలు నిర్వహించి బాధిత రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. కానీ అవి జాయింట్‌ కలెక్టర్‌ లాగిన్‌లో సరిదిద్దాల్సి రావడంతో ఏడాదిన్నరగా రైతులు ఎదురుచూడాల్సి వచ్చింది. కొత్త పాసుపుస్తకాలు రాజముద్రతో సిద్ధం చేసి శుక్రవారం నుంచి పంపిణీకి శ్రీకారం చుట్టారు. కానీ ఉన్న నాలుకకు మందు వేస్తే కొండ నాలుక ఊడిందన్న చందంగా పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.

అరకొర పంపిణీలోనూ తప్పులే..

ఏ గ్రామంలోనూ పాసుపుస్తకాలను పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. ఉదాహరణకు తొట్టంబేడు మండలంలోని 12 గ్రామాల్లో రీసర్వే జరిగింది. ఇందులో 5 పంచాయతీల్లో పాసుపుస్తకాల పంపిణీకి అధికారులు కార్యాచరణ ప్రకటించారు. దొంగలమడూరులో 160 పాసుపుస్తకాలు అధికారులకు చేతికి రాగా 46 మాత్రం పంపిణీ చేశారు. గుమ్మడిగుంటలో 239కిగాను 59, మామిడిగుంటలో 392కు గాను 34, రాంబట్లపల్లిలో 253కు గాను 295, సిద్ధిగుంటలో 173కు 102 పంపిణీకి సిద్ధం చేశారు. మొత్తం ఐదు గ్రామాల్లో కలిపి 1,217కు 436మాత్రం పంపిణీ చేయనున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పాసుపుస్తకం అందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలమడూరులో శుక్రవారం 46 పాసుపుస్తకాలు పంపిణీ చేయగా 8మంది రైతులకు మళ్లీ రికార్డులు తప్పుగా నమోదయ్యాయి.

నేతలకు తలపోటు

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు గ్రామాలకు వెళ్లే కూటమి నేతలకు తలపోటు తప్పడంలేదు. ఒక్కో గ్రామంలో వందలాది పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉన్నా తప్పుల్లేకుండా 10 నుంచి 20 శాతం పుస్తకాలు మాత్రమే అధికారులు సిద్ధం చేశారు. పుస్తకాలు రాని రైతులు వేదికల వద్ద గగ్గోలు పెడుతున్నారు. పైగా ఇచ్చిన పుస్తకాల్లోనూ తప్పులు ఉండటంతో నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు.

32సెంట్లకు గాను 7సెంట్లు

దొంగలమడూరులో నాకు 32సెంట్లు పొలం ఉంది. గతంలో ఇది 22 సెంట్లుగా నమోదైంది. రెండు మూడుసార్లు గ్రామసభల్లో భూ విస్తీర్ణం దిద్దాలని వినతిపత్రం సమర్పించాను. శుక్రవారం మళ్లీ తప్పుగా నమోదు అయిన కొత్తపాసుపుస్తకం చేతికి ఇచ్చారు. ఇందులో 32సెంట్లకు గాను ఏడు సెంట్లు భూమి మాత్రమే ఉంది.

- బుజ్జమ్మ, దొంగలమడూరు, తొట్టంబేడు మండలం

మళ్లీ రీసర్వే చేయండి

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ రీసర్వే దొంగలమడూరులో 90శాతం తప్పులు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ సర్వే జరిపించాలని అధికారులకు, పాలకులకు విజ్ఞప్తి చేశాం. అయినా పాత రీసర్వే ప్రకారమే పాసుపుస్తకాలను ముద్రించారు. నాకు 22 సెంట్లు ఉండగా 21 సెంట్లుగా నమోదైంది.

- రవి, దొంగలమడూరు, తొట్టంబేడు మండలం

గుర్తు తెలియని వ్యక్తి ఫొటోతో పాసుపుస్తకం

తొట్టంబేడు మండలం దొంగలమడూరుకు చెందిన నక్కల కాటయ్యకు సెటిల్‌మెంట్‌ భూమి ఉంది. శుక్రవారం మంజూరు చేసిన పాసుపుస్తకంలో గుర్తుతెలియని వ్యక్తి ఫొటోతో ముద్రించిన పాసు పుస్తకం ఇవ్వడంతో ఖంగుతిన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 03:06 AM