దాతల స్పందనే ఆమెకు ఊపిరి
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:06 AM
పేదింటి బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువు చదివింది. ఇప్పుడు తీవ్రవ్యాధితో పోరాడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కరసనపల్లె గ్రామంలోని వెంకటరమణ,లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా వెంకటరమణ పిల్లలను చదివించారు.
పేద విద్యావంతురాలికి అరుదైన వ్యాధి
ఊపిరితిత్తుల మార్పిడి అవసరమన్న వైద్యులు
ఆదుకోవాలని అభ్యర్థిస్తున్న తల్లిదండ్రులు
మదనపల్లె, జూలై 21(ఆంధ్రజ్యోతి): పేదింటి బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువు చదివింది. ఇప్పుడు తీవ్రవ్యాధితో పోరాడుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం కరసనపల్లె గ్రామంలోని వెంకటరమణ,లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా వెంకటరమణ పిల్లలను చదివించారు. వీరిలో చిన్నమ్మాయి రమ్యశ్రీ బెంగళూరులో చార్టెర్డ్ అకౌంటెన్సీ చివరి సంవత్సరం చదువుతోంది. ఈ తరుణంలో ఇటీవల ఆమె అనారోగ్యం పాలైంది. పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా వ్యాధి దారికి రాలేదు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్య పరీక్షలు చేయించారు. రెండు ఊపిరి తిత్తులూ దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. లింఫాంజియో లియో మయోమా టోసి్‌స(ల్యామ్) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోందని నిర్ధారించారు. అత్యవసరంగా ఊపిరితిత్తుల మార్పిడికి శస్త్రచికిత్స చేయాలన్నారు. ఇందుకోసం రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఖర్చు అవుతుందన్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆ పేద కుటుంబం తమకున్న ఎకరా భూమి, ఇంటిని అమ్మేసి రూ.15 లక్షలకుపైగా ఖర్చు చేసింది. ప్రస్తుతం రమ్యశ్రీ వెంటిలేటర్‌పై ఉంది. రోజువారి రూ.2వేలకుపైగా ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయార్ద్ర హృదయులు స్పందించి బిడ్డ ప్రాణాలు కాపాడాలని రమ్యశ్రీ కుటుంబీకులు కోరుతున్నారు. శామకూరి రమ్యశ్రీకి చెందిన పెద్దపంజాణి యూనియన్ బ్యాంకు ఖాతా నంబరు(230210100110030)కు లేదా 9640450872/ 7569298992 ఫోన్ నంబర్ల ద్వారా ఆర్థిక సాయం పంపి ఆదుకోవాలని వారు అభ్యర్థిస్తున్నారు.