Share News

శేషవాహనంపై శివుడి రాజసం

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:21 AM

శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రాత్రి శేషవాహనంపై పరమశివుడు పురవిహారం చేశారు. పక్కనే జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై సాగారు.. ఉదయం స్వామి వారు హంస వాహనం, జ్ఞానప్రసూనాంబ శుక వాహనంపై ఊరేగారు.

శేషవాహనంపై శివుడి రాజసం

యాళివాహనంపై జగదాంబ చిద్విలాసం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ మహాశివరాత్రి ఉత్సవాల్లో శనివారం రాత్రి శేషవాహనంపై పరమశివుడు పురవిహారం చేశారు. పక్కనే జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై సాగారు.. ఉదయం స్వామి వారు హంస వాహనం, జ్ఞానప్రసూనాంబ శుక వాహనంపై ఊరేగారు.ముందు మూషికవాహనంపై వినాయకస్వామి, చప్పరాలపై శ్రీవళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, భక్తకన్నప్ప పరివారం సాగింది.పురవిహారంచేస్తున్న ఆదిదంపతులను దర్శించుకోవడానికి భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు.కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.ఆలయ చైర్మన్‌ కొట్టే సాయి,ఈవో బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

నేడు నందిసేవ

శివరాత్రి ఉత్సవాల్లో ఆదివారం రాత్రి నందిసేవ నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి బంగారు నందిపై... జ్ఞానప్రసూనాంబ దేవి బంగారు సింహవాహనంపై అధిష్ఠింపజేసి పురవిహారం చేయనున్నారు.నందిసేవకు భక్తులు వేలసంఖ్యలో తరలిరానుండడంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక ఉదయం స్వామివారు ఇంద్ర విమానంలో, జ్ఞానప్రసూనాంబదేవి చప్పరంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు

శ్రీకాళహస్తీశ్వరుడికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం పట్టువస్త్రాలను సమర్పించారు.అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల వద్ద పట్టువస్త్రాలను మంత్రి ఆలయ చైర్మన్‌ కొట్టే సాయికి, ఈవో బాపిరెడ్డికి అందజేశారు. వాటినిస్వామి అమ్మవార్లకు ధరింపజేసి పూజలు నిర్వహించారు.

Updated Date - Feb 15 , 2026 | 01:21 AM