Share News

ప్రజా వైద్యుడు ఇకలేరు

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:15 AM

రోగులను చిరునవ్వుతో పలకరిస్తారు. వారికి ధైర్యం చెబుతారు.

ప్రజా వైద్యుడు ఇకలేరు

తిరుపతి సెంట్రల్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రోగులను చిరునవ్వుతో పలకరిస్తారు. వారికి ధైర్యం చెబుతారు. అత్యవసర విభాగానికొచ్చే రోగుల పరిస్థితిని బట్టి.. ఆయా విభాగాలను సమన్వయం చేసుకుని మెరుగైన వైద్యం అందేలా చూస్తారు. ఇలా, మానవీయంగా స్పందిస్తూ, సేవాభావంతో వ్యవహరిస్తూ, ప్రజావైద్యుడిగా పేరొందిన డాక్టర్‌ మునస్వామి ఇక లేరు. తిరుపతిలోని స్విమ్స్‌లో నాలుగు దశాబ్దాలుగా నిస్వార్థ సేవలందించిన ఆయన తన స్వగ్రామమైన తడ మండలంలోని మాంబట్టుకు ఆదివారం ఉదయం వెళుతుండగా కారు వెనుక టైరు పేలి.. చెట్టుకు ఢీకొన్న ప్రమాదంలో అసువులు బాశారు. ఆయన మరణం అటు వైద్య వర్గాలను, ఇటు సన్నిహితులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వైద్యవృత్తిని ఉద్యోగంగా కాకుండా స్విమ్స్‌ అత్యవసర విభాగంలో సేవగా భావించిన ఆయన.. వేలాది రోగులకు ఆరోగ్యాన్ని అందించారు. సాదాసీదా జీవనం, అంకితభావం, రోగులపట్ల అపారమైన మమకారం ఆయనను ప్రత్యేక వ్యక్తిగా నిలబెట్టాయి. సెలవులైనా, పండగలైనా, డ్యూటీ వేళలతో నిమిత్తం లేకుండా రోగులకు అందుబాటులో ఉండేవారు. యువ డాక్టర్లకు స్ఫూర్తిగా నిలిచారాయన.

క్యాజువాల్టీ ఐకాన్‌

స్విమ్స్‌ క్యాజువాలిటీ విభాగంలో 24 గంటల అత్యవసరసేవలో సీనియర్‌ వైద్యుడిగా డాక్టర్‌ మునస్వామి ఎన్నో క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నారని సహచర వైద్యులు పేర్కొంటున్నారు. రోగుల కుటుంబ సభ్యులతో మానవీయంగా మాట్లాడడం, భయాందోళనలో ఉన్న వారిలో ధైర్యం నింపడం, చికిత్స ప్రక్రియపై స్పష్టత ఇవ్వడం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. పేద రోగులూ సకాలంలో చికిత్స పొందేలా శ్రద్ధ తీసుకునే వారని వైద్యసిబ్బంది చెబుతున్నారు. జూనియర్‌ వైద్యులకు అత్యవసర వైద్య నిర్వహణలో శిక్షణ ఇవ్వడంలోనూ ఆయన ముందుండే వారు.

పలువురి దిగ్ర్భాంతి.. సంతాపం

డాక్టర్‌ మునస్వామి మృతిపై స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్వీ కుమార్‌, సహచర సీనియర్‌ వైద్యుడు శివశంకర్‌తో పాటు ఇతర వైద్య, వైద్యేతర సిబ్బంది తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆయన సేవలను గుర్తుచేస్తూ స్విమ్స్‌కు తీరని లోటని పేర్కొన్నారు. మునస్వామి మరణ వార్త తమను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహయాదవ్‌ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 12:15 AM