Share News

పేదల ఊటీ కాలిపోతోంది

ABN , Publish Date - Mar 26 , 2026 | 02:06 AM

పేదల ఊటీగా పేరుగాంచిన పలమనేరులో క్రమేపీ చల్లదనం దూరమవుతోంది. సమీన అడవులు అంతరిస్తుండమే ఇందుకు కారణం.

పేదల ఊటీ కాలిపోతోంది

క్రమేపీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

పలమనేరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పేదల ఊటీగా పేరుగాంచిన పలమనేరులో క్రమేపీ చల్లదనం దూరమవుతోంది. సమీన అడవులు అంతరిస్తుండమే ఇందుకు కారణం. వేసవి రాగానే ఇక్కడి అటవీప్రాంతంలో మంటలు చెలరేగడం సాధారణమై పచ్చదనం హరించుకుపోతోంది. పలమనేరు సముద్ర మట్టానికి సుమారు 2244 అడుగుల ఎత్తులో వుంది. సమీపంలో మూడు వైపులా అటవీప్రాంతముంది. దీంతో వేసవిలో కూడా చల్లనివాతావరణంతో ఎండల నుంచి రక్షణ లభించేది. శీతాకాలంలో ఇక్కడ చలి ఊటీని తలపించేది.

పదేళ్లుగా ఏవీ రక్షణ చర్యలు

దశాబ్దకాలంగా ఇక్కడి అటవీప్రాంతం పలుచబడుతోంది. ఆకతాయిల చర్యలతో ఏటా తగ్గిపోతోంది. అటవీశాఖ కూడా నిర్లక్ష్యం చూపుతోందనే విమర్శలున్నాయి. గతంలో వేసవి రాగానే అటవీశాఖ అధికారులు పర్యావరణంలో అడవుల పాత్ర గురించి అవగాహన కల్పించేవారు. అడవులకు నిప్పు పెడితే ఎదురయ్యే అనర్థాలను వివరించేవారు. అడవుల్లో ఫైర్‌ రోడ్స్‌ ఏర్పాటు చేసేవారు. ఎవరైనా నిప్పు పెట్టినా ఆ ఫైర్‌రోడ్‌ వరకే మంటలు పరిమితమయ్యేవి. ఇటీవల అలాంటి కార్యక్రమాలేవీ నిర్వహించడంలేదు. క్షేత్రస్థాయి సిబ్బంది సైతం పలమనేరులో ఉంటున్నారు. దీంతో అడవుల్లో ఏం జరుగుతున్నా తెలియడంలేదు. ఇక్కడి అటవీ ప్రాంతం గుండానే హైవే, అంతర్రాష్ట్ర రహదారులున్నాయి. ఈ మార్గాల్లో వెళ్లే ద్విచక్రవాహన చోదకులు సిగరెట్‌ కాల్చి పడేయడం, కొందరు పశువుల కాపర్లు అడవులకు నిప్పుపెట్టడం లాంటి చర్యలతో మంటలు రేగి అడవులు కాలిపోతున్నాయి. పచ్చనిచెట్లు కనుమరుగవుతున్నాయి.

రహదారుల నిర్మాణంతో చెట్ల నరికివేత

ఇటీవల జాతీయ రహదారుల శాఖ ఆరు లేన్ల రహదారి నిర్మాణంలో ఇక్కడి చెట్లను తొలగించారు. బెంగళూరు-చెన్నె హైవే విస్తరణలో వేలాది చెట్లు నరికేశారు. పలమనేరుకు ఇరువైపులా జాతీయరహదారిపై వేసిన సిమెంట్‌ రోడ్డు వల్లకూడా రేడియేషన్‌ పెరిగింది. దీంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు ప్రభావితమయ్యాయి. వేసవిలో మున్నెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అటవీ పరిరక్షణకు చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Mar 26 , 2026 | 02:06 AM