పోలేరమ్మ జాతర సంబరం
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:03 AM
వెంకటగిరి గ్రామశక్తిగా పేరుగాంచిన పోలేరమ్మ జాతర సంబరాలతో పట్టణం హోరెత్తిపోయింది.బుధవారం ఉదయమే పోలేరమ్మ పుట్టింటి వారుగా భావించే కుమ్మర్లు వెంకటగిరి చెరువు నుంచి తీసుకు వచ్చిన మట్టితో ప్రతిమను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.పుట్టింటి వద్ద అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఉంచేందుకు వేపమండలతో పందిరిని సిద్ధం చేశారు.
వెంకటగిరి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వెంకటగిరి గ్రామశక్తిగా పేరుగాంచిన పోలేరమ్మ జాతర సంబరాలతో పట్టణం హోరెత్తిపోయింది.బుధవారం ఉదయమే పోలేరమ్మ పుట్టింటి వారుగా భావించే కుమ్మర్లు వెంకటగిరి చెరువు నుంచి తీసుకు వచ్చిన మట్టితో ప్రతిమను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు.పుట్టింటి వద్ద అమ్మవారిని భక్తుల దర్శనార్థం ఉంచేందుకు వేపమండలతో పందిరిని సిద్ధం చేశారు.జీనిగల వారి వీధిలో అత్తవారిల్లుగా భావించే చాకలింటి వద్ద, పోలేరమ్మ దేవస్థానం వద్ద అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు.అమ్మవారిని విరూపం చేసేందుకు తీసుకువెళ్ళే మార్గమైన కైవల్యానదిలో అనుకూలంగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. విరూప మండపం వద్ద తొక్కిసలాట జరక్కుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నింటినీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యవేక్షించారు.కుమ్మరింట బంకమట్టిని పసుపుతో కలిసి అమ్మవారి ప్రతిమను తయారు చేశాక సాయంత్రం అలంకారం లేకుండా తెల్లగుడ్డతో ముసుగు కప్పి కట్టెల పల్లకిలో జీనిగలవారి వీధిలోని చాకలింటికి తీసుకెళ్లి కొలువుదీర్చారు.కాంపాళెం వద్ద అమ్మవారి అక్కచెల్లెళ్లుగా భావించే గాలిగంగలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పొట్టేలును బలి ఇచ్చారు.తరువాత గాలిగంగలను చాకలి మండపం వద్ద అమ్మవారి ముందుకు తీసుకురావడంతో చాకలివారు నాటుకోడి మెడను నోటితో కొరికి ఆ రక్తంతో అమ్మవారికి దిష్టి చుక్క పెట్టారు. అమ్మవారికి కళ్ళు ఏర్పాటు చేసి అలంకారం పూర్తిచేశారు. అనంతరం విద్యుద్దీపాలంకరణ, పూలతో అలంకరించిన సప్పరంపై అమ్మవారిని ఉంచి దివిటీల వెలుగుల్లో ఆసాదుల తప్పెట్లు, యువత చిందులు, కేరింతల నడుమ ఊరేగింపుగా గురువారం తెల్లవారుజాము సమయానికి అమ్మవారి దేవస్థానం వద్ద వేపాకులతో సిద్ధం చేసిన మండపం వద్దకు తీసుకొచ్చారు. ఆచార సాంప్రదాయాల ప్రకారం బద్దె గొర్రెను బలి ఇచ్చి భక్తుల దర్శనార్ధం అమ్మవారు కొలువుదీరడంతో రాత్రి జాతర ముగిసింది.అదే సమయానికి పట్టణంలో ఘటం కుండలతో అమ్మవారి స్వరూపంగా తిరుగుతున్న దున్నపోతును బలి ఇచ్చి ఆ రక్తంతో ఘటం కుండల్లో ఉన్న అన్నంతో కలిపి ఊరి పొలిమేరల్లో చల్లారు.ఇలా చేయడం వల్ల ఊరికి పట్టిన చీడపీడలు తొలగి పోతాయన్నది ఇక్కడి ప్రజల నమ్మకం.అమ్మవారి దర్శనార్ధం భక్తులు బారులుతీరి మొక్కులు చెల్లించుకున్నారు.చిన్నారులు వేప మండలు, పసుపు కుంకుమలతో అలంకరించిన వెయ్యికళ్ల దుత్తల్లో పిండితో చేసిన దీపాలను వెలిగించి వాటిని నెత్తిపై పెట్టుకొని నాలుగు రోడ్ల కూడళ్ళలో బద్దలు కొట్టారు. ఇలా చేయడం వలన అమ్మవారు వెయ్యికళ్ల తమను చల్లగా చూస్తుందని ప్రజలు భావిస్తారు.