మహానాడు సందడి
ABN , Publish Date - May 28 , 2026 | 01:31 AM
ఎటు చూసినా పసుపు జెండాల రెపరెపలు
తిరుపతి సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఏటా జరుపుకునే మహానాడు వేడుకలు జిల్లా వ్యాప్తంగా బుధవారం పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ కేంద్రాలు, క్లస్టర్ సముదాయాలు పసుపు జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో కళకళలాడాయి.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 10 నుంచి 12 క్లస్టర్లలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సమావేశాలు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ స్ర్కీన్ల ద్వారా వర్చువల్‌గా వీక్షించారు. నేతల ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. తిరుపతి నగరంతో పాటు శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన 70 క్లస్టర్లలో మహానాడు సంబరం ఘనంగా జరిగింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పనబాక లక్ష్మి, దివాకర రెడ్డి, తిరుపతి నియోజకవర్గ ఇంచార్జి సుగుణమ్మ, పరిశీలకురాలు పర్వీన్‌తాజ్ పలు క్లస్టర్లను సందర్శించారు. క్లస్టర్ ఇంచార్జిలు ఆర్సీ మునికృష్ణ, జేబీ శ్రీనివాస్, శ్రీధర్ వర్మ, పుష్పావతి, మునిశేఖర్ రాయల్ తదితరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలను పరిశీలించారు. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన మహానాడుకు ఎమ్మెల్యే నాని పలుచోట్ల హాజరుకాగా, ఆయన భార్య పులివర్తి సుధారెడ్డి పాకాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో జరిగిన కార్యక్రమాలను ఇంచార్జి ముక్కా రూపానందరెడ్డి పర్యవేక్షించారు. పెనగలూరు, చిట్వేల్, ఓబులవారిపల్లె మండలాల్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్థ చైర్మన్ కేకే చౌదరి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్, మాచినేని విశ్వేశ్వర నాయుడు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు .రైల్వే కోడూరులో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో వినాయకుడి గుడి నుంచి ఆర్యవైశ్య కళ్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూళ్లూరుపేట, తడలో జరిగిన మహానాడులో ఆమె పాల్గొన్నారు. సత్యవేడులో నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమాలను కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి, పరిశీలకుడు మలిశెట్టి వెంకటేశ్వర్లు, వేనాటి సతీష్ తదితరులు పర్యవేక్షించారు. వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పరిశీలకుడు కేకే చౌదరి ఇతర నాయకులతో కలసి పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వ్యాప్తంగా మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. ఏర్పేడు మండలం ఇసుకతాగేలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితారెడ్డి పాల్గొన్నారు.