Share News

శ్రీకాళహస్తి ఆస్పతిలో బద్దలైన అవినీతి పుట్ట

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:56 AM

రూ.28లక్షలు స్వాహా చేసిన అధికారులు, సిబ్బంది ఇద్దరు కిందిస్థాయి సిబ్బందిపై కేసు నమోదు

శ్రీకాళహస్తి ఆస్పతిలో బద్దలైన అవినీతి పుట్ట
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి

శ్రీకాళహస్తి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఎట్టకేలకు అవినీతి పుట్ట బద్దలైంది. ఆస్పత్రికి అత్యవసర మందులు, స్టేషనరీ కోనుగోళ్ల కోసం కేటాయించే నిధులు, బాలింతలకు కాన్పు తరువాత ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు, ఎన్టీఆర్‌ వైద్యసేవ ఇన్సెంటివ్స్‌, ఆభా స్కీమ్‌, హెచ్‌డీఎ్‌స నగదులో చాలాకాలంగా అధికారులు, కార్యాలయ సిబ్బంది కుమ్మక్కై పెద్దఎత్తున నిధులు స్వాహా చేస్తున్నట్లు అభియోగాలు ఉన్నాయి. కొందరు అధికారులు పథకం ప్రకారం కింది స్థాయి సిబ్బంది సాయంతో దోచుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటిపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రహస్య నిఘా పెట్టారు. కాగా, నాలుగేళ్లుగా ఆస్పత్రి కార్యాలయంలో లక్ష్మీప్రసూన జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వైసీపీ పాలనలో 2022వ సంవత్సరం తొట్టంబేడు మండలం చేమూరుకు చెందిన చందు అనే యువకుడు పోస్టుమార్టం అసిస్టెంట్‌గా విధుల్లో చేరాడు. అయితే ఇతను ఈ పోస్టులో చేరినప్పటి నుంచి ఆస్పత్రి ముఖ్య అధికారులతో చనువుగా ఉంటూ ఒక్క పోస్టుమార్టానికి కూడా హాజరు కాకుండా కార్యాలయంలోనే కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరూ అధికారులతో కుమ్మక్కై నిధుల స్వాహాకు తెరలేపారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ వైద్యసేవ ఇన్సెంటివ్‌ నగదు, ఆభా స్కీమ్‌ నగదు, హెడ్‌డీఎస్‌ నగదులో అవకతవకలకు పాల్పడినట్లు ఆధారాలు వెలుగు చూశాయి.రూ.28లక్షల స్వాహా జరిగినట్లు ప్రాథమికంగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు గుర్తించారు. దీంతో సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ మంగళవారం డీఎస్పీ నరసింహమూర్తిని కలిసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో ఆస్పత్రి నిధుల గోల్‌మాల్‌పై మొదట జూనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మీప్రసూన, పోస్టుమార్టం అసిస్టెంట్‌ చందుపై కేసు నమోదుచేశారు. సుమారు రూ.కోటి వరకు కూడా అవినీతి జరిగి ఉండవచ్చని ఉన్నతాఽధికారులు భావిస్తున్నారు. లోతుగా దర్యాప్తు చేస్తే ముఖ్య అధికారులే పట్టుబడతారని సమాచారం. మరోవైపు ఆస్పత్రి, సదరం క్యాంపు నిర్వహణ, సిబ్బందికి నైట్‌ డ్యూటీల కేటాయింపుపైనా విచారణకు ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది.

Updated Date - Sep 16 , 2026 | 01:56 AM