మదనపల్లె వైపు కృష్ణమ్మ గలగలలు
ABN , Publish Date - Sep 13 , 2026 | 12:34 AM
అనుకున్నట్లే కృష్ణా జలాలు పడమటి ప్రాంతానికి పయనమయ్యాయి.
మదనపల్లె, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అనుకున్నట్లే కృష్ణా జలాలు పడమటి ప్రాంతానికి పయనమయ్యాయి. కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు శనివారం సాయంత్రం కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, అనంతపురం హంద్రీ-నీవా ఎస్‌ఈ సి.ఆర్.రాజ్‌గోపాల్ నీటిని విడుదల చేశారు. సత్యసాయి జిల్లా బొంతలపల్లె, పీటీఎం మండలం సరిహద్దులో జిల్లాలోకి నీరు ప్రవేశించనున్నాయి. చెర్లోపల్లె రిజర్వాయర్ గరిష్ఠ నీటి సామర్థ్యం 1.60 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.05 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. శనివారం 200 క్యూసెక్కులు విడుదల చేయగా జిల్లా సరిహద్దుకు 75 కి.మి. రాగానే, అక్కడి చెర్లోపల్లె నుంచి నీటి ప్రవాహాన్ని 400 క్యూసెక్కులకు పెంచి సరిహద్దుకు 350 క్యూసెక్కులు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్‌ఈ రాజ్‌గోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 15 కి.మి దూరం ప్రయాణిస్తే 350 క్యూసెక్కులు పెంచిన తర్వాత 25 కి.మి. ప్రవహిస్తూ 17వ తేదీ నాటికి మదనపల్లెకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటగా చిప్పిలిలోని సమ్మర్‌స్టోరేజీ(ఎ్‌సఎ్‌సట్యాంకు), గుట్టకిందపల్లె ఎస్‌ఎస్ ట్యాంకుకు, మదనపల్లె సమీపంలోని అమ్మచెరువుకు నింపనున్నారు. తర్వాత పుంగనూరులోని ఎస్‌ఎ్‌స ట్యాంకుకు అక్కడి నుంచి కుప్పానికి తీసుకెళ్లనున్నారు. కరువు ప్రభావం నేపథ్యంలో కృష్ణా జలాలను తాగునీటి అవసరాలకే వినియోగించేలా చెరువులకు నింపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ రామసుబ్బయ్య, డీఈ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఏఈ ఎం.హరికుమార్, పాండురంగయ్య, కైలాష్, కుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.