Share News

పుర పోరు.... ఎవరిదో జోరు!

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:37 AM

తిరుపతి నగర కార్పొరేషన్‌తో పాటు పుత్తూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలకు నిర్వహిస్తున్న ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నేడు ఈ ఐదు చోట్లా పోలింగ్‌ జరగనుంది. ఆదివారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకూ ఓట్లు వేయడానికి గడువున్నప్పటికీ ఆ సమయానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో ఎంతమంది ఓటర్లుంటే అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేదాకా గడువు పొడిగిస్తారు.

పుర పోరు.... ఎవరిదో జోరు!
తిరుపతిలో పోలింగు సిబ్బందికి సూచనలిస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి సహా ఐదు చోట్ల పోలింగ్‌కు విస్తృత ఏర్పాట్లు

తిరుపతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర కార్పొరేషన్‌తో పాటు పుత్తూరు, వెంకటగిరి, సూళ్ళూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలకు నిర్వహిస్తున్న ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నేడు ఈ ఐదు చోట్లా పోలింగ్‌ జరగనుంది. ఆదివారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకూ ఓట్లు వేయడానికి గడువున్నప్పటికీ ఆ సమయానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో ఎంతమంది ఓటర్లుంటే అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేదాకా గడువు పొడిగిస్తారు. కాగా పోలింగ్‌ నిర్వహణకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. మొత్తం 4.47 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దీనికోసం ఐదు మున్సిపల్‌ స్థానిక సంస్థల్లో 559 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద ముందు జాగ్రత్త చర్యగా వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల నిర్వహణకు 3525 మంది సిబ్బందిని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతా చర్యలు చేపట్టేందుకు పోలింగ్‌ సిబ్బంది 2400 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు ఓటర్లకు పిలుపిచ్చారు. అదే సమయంలో ఎలాంటి ఉల్లంఘనలను, ప్రశాంతతను చెడగొట్టే చర్యలను సహించేది లేదని హెచ్చరించారు.

మేయర్‌, ఛైర్మన్ల స్థానాల్లో 31 మంది....

197 వార్డులకు 551 మంది పోటీ

తిరుపతి మేయర్‌ స్థానానికి పదిమంది అభ్యర్థులు పోటీలో వున్నారు. అలాగే పుత్తూరులో ఛైర్మన్‌ స్థానానికి ముగ్గురు, నాయుడుపేటలో ఛైర్మన్‌ స్థానానికి 8 మంది, సూళ్ళూరుపేటలో ఆరుగురు, వెంకటగిరిలో ముగ్గురు చొప్పున మొత్తం 31మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే తిరుపతిలో 66 డివిజన్లకు గానూ 2 ఏకగ్రీవం కాగా మిగతా 64 స్థానాలకు 214 మంది బరిలో వున్నారు. పుత్తూరులోని 36 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం కాగా మిగిలిన 35 స్థానాలకు 89 మంది పోటీలో వున్నారు. వెంకటగిరిలో 36 వార్డులకు 78 మంది, నాయుడుపేటలో 32 వార్డులకు 92 మంది, సూళ్ళూరుపేటలో 2 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 30 వార్డులకు 78 మంది చొప్పున ఎన్నికలు జరుగుతున్న మొత్తం 197 వార్డుల్లో 551 మంది అభ్యర్థులు బరిలో వున్నారు.

4.47 లక్షలమంది ఓటర్లకు 559 పోలింగ్‌ కేంద్రాలు

తిరుపతి, పుత్తూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట మున్సిపాలిటీల్లో 4.47 లక్షల మంది ఓటర్లు వున్నారు. స్థానిక సంస్థల వారీగా చూస్తే తిరుపతి నగర కార్పొరేషన్‌లో 1,47 లక్షల మంది మహిళలు, 1.43 లక్షల మంది పురుషులు, ఇతరులు 29 మంది చొప్పున మొత్తం 2.90 లక్షల మంది ఓటర్లు వున్నారు. పుత్తూరులో 20 వేల మంది మహిళలు, 19 వేలమంది పురుషులు, ఇతరులు ముగ్గురు చొప్పున మొత్తం 40210 మంది ఓటర్లు వున్నారు. వెంకటగిరిలో 21 వేల మంది మహిళలు, 23 వేలమంది పురుషులు, ఇతరులు ఇద్దరు చొప్పున మొత్తం 44139 మంది ఓటర్లు వున్నారు. నాయుడుపేటలో 19 వేల మందిమహిళలు, 17 వేలమంది పురుషులు, ఇతరులు నలుగురు చొప్పున మొత్తం 37100 మంది ఓటర్లు వున్నారు. అలాగే సూళ్ళూరుపేటలో 18 వేల మంది మహిళలు, 17 వేల మంది పురుషులు, ఇతరులు ఐదుగురు కలిపి మొత్తం 35519 మంది ఓటర్లు వున్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌

నేటి పోలింగ్‌ను పురస్కరించుకుని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఐదుచోట్లా కలిపి 559 పోలింగ్‌ కేంద్రాలుండగా అందులో 222 కేంద్రాలు మాత్రమే సాధారణ కేటగిరీ కింద వున్నాయి. మిగిలిన 337 కేంద్రాలూ అవాంఛనీయ ఘటనలు జరగడానికి ఆస్కారం వున్నవే. వీటిలో 95 కేంద్రాలు అత్యంత సున్నితమైనవి కాగా 46 కేంద్రాలు క్లిష్టమైనవి. మరో 196 కేంద్రాలు సమస్యాత్మకంగా వున్నాయి. వీటిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో మున్సిపల్‌ ఎన్నికల్లో ఎప్పుడూ వినియోగించని రీతిలో ఈసారి అత్యంత సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసే వెబ్‌ కెమెరాలు ఇంటర్నెట్‌ ద్వారా వీడియో ప్రత్యక్ష ప్రసారాన్ని చేస్తాయి. వీటిని నేరుగా కలెక్టర్‌, ఎస్పీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చూసే అవకాశముంది. తద్వారా ఆయాచోట్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి అవకాశాలు తగ్గిపోనున్నాయి.

Updated Date - Nov 01 , 2026 | 01:37 AM