Share News

కొండలు మండుతున్నాయ్‌!

ABN , Publish Date - Apr 09 , 2026 | 01:58 AM

మదనపల్లెకు ఐకాన్‌గా పేరుగాంచిన బసినికొండ మండుతోంది. పట్టణం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటించారు. కొండపై ఉన్న ఎండిన గడ్డి, చెట్లు కాలి బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడటంతో సమీప నివాసస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మంటల్లో చాలా జీవరాశులతోపాటు పచ్చని చెట్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు.

కొండలు మండుతున్నాయ్‌!
బసినికొండలో ఎగసిపడుతున్న మంటలు

మదనపల్లె/తంబళ్లపల్లె/కురబలకోట, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మదనపల్లెకు ఐకాన్‌గా పేరుగాంచిన బసినికొండ మండుతోంది. పట్టణం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో బుధవారం మధ్యాహ్నం నిప్పంటించారు. కొండపై ఉన్న ఎండిన గడ్డి, చెట్లు కాలి బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడటంతో సమీప నివాసస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ మంటల్లో చాలా జీవరాశులతోపాటు పచ్చని చెట్లు కూడా కాలి బూడిదయ్యాయి. ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు.

మల్లయ్యకొండలో వందల ఎకరాల్లో అడవి దగ్ధం

తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ అటవీ సముదాయం మంటల్లో కాలిపోతోంది. మంగళవారం సాయంత్రం ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బోధ, గడ్డి ఏపుగా పెరిగి ఉండటంతో మంటలు పెద్దయెత్తున చెలరేగి వందల ఎకరాల్లో అడవి దగ్ధమైంది. విలువైన ఔషధమొక్కలు, వన్యప్రాణులు, వృక్ష సంపదతోపాటు బోద, గడ్డి వంటి పశుగ్రాసం కాలి బూడిదైంది. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగసి పడుతుండటంతో అటవీ శాఖ సిబ్బందికి మంటలు ఆర్పడం కష్టతరంగా మారింది. కాగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పలుమార్లు సంభవించిన అగ్ని ప్రమాదాలతో సాధు, ఇనుము, మల్లయ్యకొండల్లో వందల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయింది.

ముదివేడు అటవీ ప్రాంతం దగ్ధం

కురబలకోట మండలం ముదివేడు అటవీ ప్రాంతానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించడంతో పూర్తిగా కాలిపోయింది. చెట్లు పూర్తిగా కాలిపోయాయి. జంతువులు, పక్షులు మృత్యువాతపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక, అటవీ ఖాఖాధికారులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు.

Updated Date - Apr 09 , 2026 | 01:58 AM