కోడెగిత్తల పౌరుషం
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:28 PM
కోడె గిత్తలు పౌరుషం చూపాయి. తమను పట్టుకోవడానికి వచ్చిన వారి నుంచి తప్పించుకుని పరుగు తీశాయి.
కోడె గిత్తలు పౌరుషం చూపాయి. తమను పట్టుకోవడానికి వచ్చిన వారి నుంచి తప్పించుకుని పరుగు తీశాయి. ఈ క్రమంలో మూడు ఎద్దులు చెరువులో పడి మృతిచెందడం బాధాకరం. వెదురుకుప్పం మండలం పాతగుంటలో ఆదివారం జల్లికట్టు నిర్వహించారు. వీధిలో అల్లి ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారంతో పలుగ్రామాల నుంచి రైతులు తమ కోడెగిత్తలతో పాతగుంటకు చేరుకున్నారు. జల్లికట్టు చూసేందుకూ జనం తరలివచ్చారు. ఇక, రైతులు తమ కోడెగిత్తల కొమ్ములకు బహుమతుల పట్టీలను కట్టిలో అల్లి వైపు వదిలారు. అల్లిలో నిలబడ్డ యువకులు వీటిని నిలువరించి పట్టీలు దక్కించుకున్నారు. కొన్ని గిత్తలు యువకుల చేతికి చిక్కకుండా పరుగులు తీశాయి. జల్లికట్టు సందర్భంగా ఇద్దరు వ్యక్తులు గాయపడగా, 108 అంబులెన్స్‌లో తరలించారని తెలిసింది. జల్లికట్టు నిర్వహణతో ఆ గ్రామంలో జనసందడి ఏర్పడింది.
ఎద్దుల మృత్యు ఘోష
పాతగుంట జల్లికట్టు అల్లిలో పరుగులు పెట్టిన కోడెగిత్తలో మూడు.. చెరువుల్లో పడి మృత్యువాత పడ్డాయి. సాధారణంగా అల్లివైపు వదిలిన గిత్తల్లో కొన్నింటిని యువకులు నిలువరించి పట్టీలు దక్కించుకుని వదిలేస్తారు. కొన్ని గిత్తలైతే పౌరుషంగా యువకుల చేతికి చిక్కకుండా అల్లి దాటి పరుగులు తీస్తాయి. ఇలా పరుగు తీసిన గిత్తల్లో ఒకటి పాతగుంట సమీపంలోని చెరువులో పడి చనిపోయింది. మారేపల్లి సమీపంలోని మద్దెమానుమడుగు ప్రాజెక్టులో పడి మరో రెండు గిత్తలు చనిపోయాయి. వీటిని వెలికి తీశారు. ఇందులో ఓ గిత్త వెదురుకుప్పం మండలం దామరకుప్పానికి చెందిన రైతుదని తెలిపారు. మిగతా రెండింటి యజమానుల వివరాలు తెలియడం లేదు. మరో గిత్త ఆచూకీ లేదని సమాచారం. ఈ బాధాకర ఘటనకు బాధ్యత వహించేదెవరు మరి.
- వెదురుకుప్పం, ఆంధ్రజ్యోతి