ఒంటరి ఏనుగు హల్‌చల్
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:07 AM
ఒంటరి ఏనుగు దాడులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
కల్లూరు, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలంలో ఒంటరి ఏనుగు దాడులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగలంతా అడవిలో తిష్ట వేస్తున్న ఒంటరి ఏనుగు చీకటిపడే సమయానికి పొలాల్లోకి చేరుకుంటోంది. పంటలను ధ్వంసం చేస్తూ నానా బీభత్సం సృష్టిస్తోంది. వారం రోజులుగా ప్రతిరోజూ పంటలను ధ్వంసం చేస్తూ రైతులకు అపారనష్టం కలిగిస్తోంది. ఈ క్రమంలో దేవళంపేట పంచాయతీ తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి రాత్రి సుమారు 9 గంటల సమయానికి దిగుమూర్తివారిపల్లి వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది. దిగుమూర్తివారిపల్లిలోని రైతులు నాగరాజు, నరసింహులు, శివయ్య, నారాయణ, చిన్నబ్బ, చెంగల్రాయులుకు చెందిన మామిడి, రాగి, జొన్న పంటలను గురువారం రాత్రి ధ్వంసం చేసింది. పశుగ్రాసాన్ని తినేసింది. ఏనుగు జాడను గమనిస్తూనే ట్రాకర్స్ ఒంటరి ఏనుగు సమీపానికి చేరుకొని టపాకాయలు పేల్చారు. అయితే ఏనుగు ఏమాత్రం బెదరకుండా అక్కడే పంటలను ధ్వంసం చేసింది. రాత్రంగా ట్రాకర్స్‌ను ముప్పుతిప్పలు పెట్టించింది. చివరికి శుక్రవారం వేకువజామున అడవిలోకి వెళ్లిపోయింది. ఒంటరి ఏనుగు దాడిలో ధ్వంసమైన పంటలను శుక్రవారం ఉదయం సిబ్బంది పరిశీలించారు.