మండలాల్లో వీడని ‘పీఠ’ముడి
ABN , Publish Date - Nov 18 , 2026 | 01:13 AM
22 చోట్ల కూటమికి దక్కనున్న ఎంపీపీ పదవి మూడు మండలాల్లో మాత్రమే వైసీపీకి ఛాన్స్
అన్నమయ్య, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లాలో మండలాధ్యక్ష పదవులపై ఆసక్తి నెలకొంది. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు దాటినా ఈ విషయంల్లో స్పష్టత రాకపోవడంతో పోటీ ఏర్పడుతోంది. గురువారం ఎంపీపీ ఎన్నికల జరగనున్న క్రమంలో టీడీపీ సైతం ఇప్పటికీ పలుచోట్ల ఎంపీపీ అభ్యర్థలను తేల్చలేదు. మరోపక్క తమకూ ఎంపీపీ పదవులు కావాలని జనసేన, బీజెపీ కూడా పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఈక్రమంలో పలువురు ఆశావహులు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కొందరు వర్గాలుగా విడిపోయి ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల మీద ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో 321 ఎంపీటీసీలకు గాను 147 ఏకగ్రీవమయ్యాయి. 174 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 25 మండలాలకు గాను రెండు లేదా మూడు చోటు వైసీపీ ఈ పదవి దక్కించుకునేందుకు వీలుండగా మిగిలిన అన్ని మండలాల్లో కూటమి పక్షాలకు చెందిన వారే మండలాధ్యక్షులు కానున్నారు. ఎంపీపీల ఎన్నిక గురువారం జరగనుంది.
బయటపడని పేర్లు
కురబలకోటలో టీడీపీ తరపున సునీత ఒకరి పేరే వినపడుతుండగా కలకడ ఈ సారి తమకు ఎంపీపీ అవకాశమివ్లాని కమ్మసామాజికవర్గం నాయకులు ఎమ్మెల్యేను కోరుతున్నట్లు తెలిసింది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన కోనేని లావణ్యకు ఎంపీపీ కట్టబెట్టాలని అడుగుతున్నట్లు సమాచారం. పెద్దతిప్పసముద్రంలో మంజుల, లక్ష్మీదేవి, గౌతవి పోటీలో ఉ న్నారు. పుంగనూరులో రూప, చౌడేపల్లె ప్రదీ్‌పరాజు, సోమలలో మలమ్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండడంతో నేతలు ఎవరి పేరూ బయటపెట్టడం లేదు. రామసముద్రంలో విజయ్‌కుమార్‌గౌడ్(టీడీపీ), జయరాంరెడ్డి(వైసీపీ) ఎంపీపీ రేసులో ఉన్నారు. సంబేపల్లెలో కాంతమ్మ, రాయచోటిలో రంగారెడ్డి, చిన్నమండెంలో హరితమ్మ, గాలివీడులో నాగేశ్వరమ్మలు పోటీలో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లె, రామాపురంలలో ఇంకా ఎవరి పేర్లు బయటకు రాలేదు.
మెజారిటీ ఉన్నా రాజకీయాలు
బీ.కొత్తకోటలో ముందుగా ఎంపీపీగా ప్రకటించిన రామసుబ్బమ్మ ఓటమి పాలయ్యారు. ఇక్కడ 11 ఎంపీటీసీలుండగా..టీడీపీ 6, బీజెపీ ఒకటి గెల్చుకున్నా క్యాంపు రాజకీయాలు తప్పడంలేదు. ములకలచెరువు లో కట్టా దొరస్వామి నాయుడు తొలి నుంచి ఎంపీపీ పదవి కోసం అధిష్టానంతో మాట్లాడి ఒప్పించుకున్నారు. 11 ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నాడు. అయితే టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు పాలగిరి సిద్దప్ప ఏడుగురు ఎంపీటీసీలతో క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. పీలేరులో టీడీపీ మండల అధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, నారే నాగభూషణ్, అలియాస్ సతీ్‌షరెడ్డిలు పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఎమ్మెల్యేకు సన్నిహితులు కావడంతో ఇప్పటికీ ఎంపీపీ ఎవరో తేలలేదు.. కలకడలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ముందుగానే ఎంపీపీ అభ్యర్ధిగా మాధవి పేరు ప్రకటించినా ఆమె ఓటమి చెందారు. ఈమె మండల అద్యక్షులు ప్రభాకర్‌నాయుడు భార్య. దీంతో ప్రస్తుతం కదిరాయచెరువు ఎంపీటీసీ లక్ష్మ్మీ ప్రసన్నతో పాటు మరో ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వాల్మీకీపురానికి తులసి కుమారి, .గుర్రంకొండకు జగదీష్, కెవిపల్లెకు కృష్ణయ్య పేర్లను టీడీపీ నాయకులు ప్రకటించారు.
ఈ మండలాల్లో వైసీపీకి అవకాశం
ఇక వైసీపీ విషయానికి వస్తే సదుం ఎంపీపీ ఆ పార్టీ దక్కించుకోనుంది. తంబళ్ళపల్లె మండలాల్లో వైసీపీకి ఎక్కువ ఎంపీటీసీలు రావడంతో లీలావతి ఒకరే రేసులో ఉన్నారు. ఆమె ఎంపీపీ గెల్చుకుంటుందని భావిస్తున్నారు. పెద్దమండెంలో కూడా ఎక్కువ ఎంపీటీసీలు రావడంతో ఆ పార్టీ కి చెందిన హరినాయక్, పద్మావతి పోటీలో ఉన్నారు. కాగా బి.కొత్తకోటలో ఇరుపార్టీలకు సమానంగా స్థానాలు రావడంతో ఇక్కడి ఎంపీపీ పదవిపై ఆసక్తి నెలకొంది. నిమ్మనపల్లిలో 9ఎంపీటీసీలకు గాను వైసీపీకి5, టీడీపీకి 4 దక్కాయి. ఇక్కడ లోపాయికారీ ఒప్పందం ఫలితంగా టీడీపీకే ఎంపీపీ కూటమి దక్కుతుందని తెలిసింది.