Share News

ముగిసిన ‘కంచర్ల’ హవా

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:43 AM

కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ హవా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత, నియోజకవర్గంలో అప్రతిహత అధికారం చలాయించిన కంచర్లను నియోజకర్గ బాధ్యతలనుంచి తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ముగిసిన ‘కంచర్ల’ హవా

కుప్పం నియోజకర్గ బాధ్యతలనుంచి ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ తొలగింపు

అనంతపురానికి చెందిన శ్రీకాంత్‌కు బాధ్యతలు

కీలక నేతలకు చురకలు

అక్రమ మైనింగ్‌, ఇసుక దందాపై ఉక్కుపాదం

టీడీపీ శ్రేణుల సమావేశంలో అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు

కుప్పం నియోకవర్గానికి మీరు మంచి సేవలు చేశారు. అయితే నియోజకవర్గ బాధ్యతలు ఎమ్మెల్యేగా నేనే చూసుకోవాలనుకుంటున్నాను. ఇక మీరు వద్దు. మీకు రాష్ట్రస్థాయిలో బాధ్యతలు అప్పగిస్తా.

- కుప్పం టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్‌, కడా రాజకీయ సలహా మండలి చైర్మన్‌ అయిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు.

నాకు మీరే నాయకులు. మీరు ఏ బాధ్యతలు అప్పగించినా సంతోషంగా చేస్తాను. ఇన్నాళ్లూ నాకు సహకరించిన కుప్పం టీడీపీ శ్రేణులకు ధన్యవాదాలు.

- చంద్రబాబుకు కంచర్ల శ్రీకాంత్‌ ఇచ్చిన సమాధానమిది.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

కుప్పంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్‌ హవా ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత, నియోజకవర్గంలో అప్రతిహత అధికారం చలాయించిన కంచర్లను నియోజకర్గ బాధ్యతలనుంచి తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. నియోకవర్గంలో కీలక స్థానాల్లో ఉన్న మిగిలిన నేతలపైనా వేటుపడే అవకాశం ఉందన్న హింట్‌ ఇచ్చారు. ఉండవల్లిలోని తన స్వగృహంలో కుప్పం నియోజకవర్గ మున్సిపల్‌, మండల టీడీపీ అధ్యక్షులు, క్లస్టర్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలతో ఆదివారం ఉదయం చంద్రబాబు సుదీర్ఘంగా జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం గురించి విశ్వసనీయ పార్టీ వర్గాలనుంచి సేకరించిన వివరాలివీ.

చంద్రబాబుతో సమావేశానికి నియోజకవర్గ కీలకనేతలైన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌ సురేశ్‌బాబు, కేడర్‌ హాజరయ్యారు. సాధారణమైన క్షేమసమాచారాలు, పలకరింపులు అయ్యాక చంద్రబాబు అసలు విషయానికి వచ్చారు. నేరుగా కంచర్ల శ్రీకాంత్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘మీరు కుప్పం నియోజకవర్గానికి చాలా సేవలు చేశారు. అయితే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నేనే ఇకమీదట స్వయంగా అక్కడి పార్టీ, అధికారిక వ్యవహారాలు చూసుకోవాలనుకుంటున్నాను. మీ సేవలు అక్కడ ఇక చాలు. మీరేమీ బాధపడవద్దు. మీకు స్టేట్‌లో బాధ్యతలు ఇస్తాను’ అని స్పష్టంగా చెప్పేశారు. అంతేకాదు, మీరు ఇక ఇక్కడినుంచి వెళ్లవచ్చు. నేను నియోజకవర్గ కేడర్‌తో మాట్లాడుకుంటాను’ అని సున్నితంగా వీడ్కోలు పలికారు. అధినేత నిర్ణయాన్ని ఏమాత్రం ఊహించకపోవడంతో అక్కడున్న పార్టీ కేడర్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. స్వయంగా కంచర్ల కూడా ఒకింత విస్మయానికి లోనయ్యారు. వెంటనే తేరుకుని పైకిలేచి చంద్రబాబుకు నమస్కారం చేశారు. ‘మీరే నాకు దైవం. మీరేం చెబితే అది చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను.’ అన్నారు. అలాగే పార్టీ కేడర్‌ను ఉద్దేశించి, ‘ఇంతకాలం నాకు సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పి సమావేశం నుంచి కంచర్ల వెలుపలకు వెళ్లిపోయారు.

కీలక నేతలకు చురకలు

ఆ తర్వాత చంద్రబాబు సమావేశాన్ని కొనసాగిస్తూ.. ఇద్దరు ముగ్గురు కీలక నేతల పనితీరును, వ్యవహారశైలిని తప్పుపడుతూ చురకలు అంటించారు. ఒక కీలక నేత సమీప బంధువైన కంగుంది పంచాయతీ యూనిట్‌ ఇన్‌చార్జి ఒకరు సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై సదరు నేతను చంద్రబాబు నిలదీశారు. ఏదో కుటుంబ బాధ్యతలుండడంవల్ల హాజరు కాలేకపోయారని ఆయనుంచి సమాధానం రావడంతో ఆ టాపిక్‌ అంతటితో ముగిసింది. తర్వాత నేతల పనితీరుపై జరిగిన సర్వేలో అదే యూనిట్‌ ఇన్‌చార్జికి అతి తక్కువ పాయింట్లు వచ్చాయి. దీంతో మళ్లీ సదరు కీలక నేతను తప్పుపట్టారు చంద్రబాబు. నీ సొంత పంచాయతీలో, సమీప బంధువైన యూనిట్‌ ఇన్‌చార్జి పనితీరు ఘోరంగా ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? అని నిలదీశారు. ‘స్టేట్‌ పదవుల్లో ఉండి అధికారం చలాయించడం కాదు, ఇంట్లో కూడా పరిస్థితులు చక్కదిద్దుకోవాలి’ అని మందలించారు. పనితీరు బాగాలేకపోతే ఎవరినైనా సరే మార్చి కొత్తవారిని నియమించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘మీరు మీ మనుషులను బిల్డ్‌ చేసుకోవడం తప్ప పార్టీకి ఏం ఉపయోగపడుతున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. తీరు మార్చుకోవాలి. లేదంటే నేను చేయాల్సింది చేయక తప్పదు’ అని ఓ కీలక నేతను హెచ్చరించారు. సమావేశానికి హాజరు కానీ ఓ కీలక నామినేటెడ్‌ పదవిలో ఉన్న నేత పనితీరును కూడా అధినేత తప్పుపట్టారు. సర్వేలో తక్కువ పాయింట్లు రావడాన్ని పేర్కొన్నారు. ‘ఎవరి సొంత పనులు, సంపాదనల్లో వారుంటే ఎలా? ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ఏమి కావాలో పట్టించుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

అక్రమాలకు పాల్పడితే సస్పెన్షన్‌ తప్పదు

అక్రమ మైనింగ్‌, ఇసుక, బియ్యం అక్రమ రవాణాలకు పాల్పడిన వారెంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టంచేశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను స్వయంగా కుప్పంలో పర్యటించి అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు చేసి ఆపించారు. మళ్లీ మీరు మొదలు పెడితే సహించేది లేదు. అక్రమ ఇసుక, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలకు సంబంధించి మీలో చాలామందిపై ఫిర్యాదులున్నాయి. రుజువైతే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అటువంటి వారు ఎంతటివారైనా పార్టీనుంచి వెంటనే సస్పెండు చేసి, కేసులు నమోదు చేయించి, జైలులో పెట్టిస్తాను’ అని ఆయన పార్టీ శ్రేణులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

అనంతపురం శ్రీకాంత్‌కు కుప్పం బాధ్యతలు

అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ అనే వ్యక్తికి కుప్పం పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ‘శ్రీకాంత్‌ యువకుడు. అధికారికంగా నా పీఏగా ఆయనే కుప్పం కార్యకలాపాలు చూసుకుంటారు. ఆయన సూచనలు, సలహాల ప్రకారమే మీరు వెళ్లాలి’ అని ఆదేశించారు.

ఆగస్టుకల్లా ‘స్థానిక’ ఎన్నికలు

జూలై, ఆగస్టు నెలకల్లా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అందుకు మీరు సిద్ధంగా ఉండాలి. మొత్తం పంచాయతీలను, మండలాలను మనం గెలుచుకుని తీరాలి. అది జరగాలంటే మీ పనితీరు కచ్చితంగా మార్చుకోవాలి. నేను జరిపించిన సర్వేలో మీరు సంపాదించుకున్న పాయింట్లు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. గత.. ప్రస్తుత సమావేశాలకు మధ్య పనితీరు మరింత దిగజారింది. ఇది చాలా దారుణమైన విషయం. నిరంతరం ప్రజల్లో ఉండాలి. వారి కష్టసుఖాలను పట్టించుకోవాలి. అదే సమయంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. పార్టీకోసం పనిచేయని, అక్రమాలు, అవినీతి మార్గాల్లో ఉన్న నాయకులు నాకు అక్కర లేదు. అటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా పార్టీనుంచి తొలగిస్తాను. పనిచేసేవారిని గుర్తించి కీలక పదవులు అప్పగిస్తాను. ఇకమీదటైనా పనితీరు మార్చుకోండి’ అని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పారు.

Updated Date - Jun 08 , 2026 | 12:43 AM