Share News

చిగురించిన మెట్ట రైతుల ఆశలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:43 PM

డక్కిలి మండలంలోని ఆల్తూరుపాడు జలాశయాన్ని రూ.679.20కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చింది

చిగురించిన మెట్ట రైతుల ఆశలు
ఆల్తూరుపాడు జలాశయం ప్రస్తుత పరిస్థితి

డక్కిలి మండలంలోని ఆల్తూరుపాడు జలాశయాన్ని రూ.679.20కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను ఇచ్చింది. దీంతో ఈ ప్రాంత మెట్ట రైతుల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే టెండర్లు కూడా నిర్వహించనుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- డక్కిలి, ఆంధ్రజ్యోతి

సోమశిల-స్వర్ణముఖి కాలువ నిర్మాణంలో అటవీ అడ్డంకులు తలెత్తాయి. దీనివల్ల నిర్మాణం ముందుకు సాగకపోవడంతో కాలువ అలైన్‌మెంటును 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మార్పుచేశారు. ఇందులో భాగంగా ఆల్తూరుపాడు చెరువును రిజర్వాయరుగా మారుస్తూ.. అక్కడినుంచి కాలువద్వారా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలకు తాగునీటి వసతి కల్పించాలన్న ఉద్దేశంతో రూ.475 కోట్లతో ఆల్తూరుపాడు జలాశయం మంజూరు చేయడం జరిగింది. ఇదే మండలంలోని లింగసముద్రం వద్ద తెలుగుగంగ కాలువకు ఎత్తిపోతల పఽథకం నిర్మించి, అక్కడి నుంచి పైపులైను ద్వారా ఆల్తూరుపాడు జలాశయానికి నీటిని పంపిస్తారు.

పనులను రద్దు చేసిన వైసీపీ

ఈ జలాశయానికి సంబంధించిన నిర్మాణ పనులను 2018లో ఎమ్మెల్యేగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆల్తూరుపాడు జలాశయం పనులను రద్దు చేసి, రీటెండర్‌కు వెళ్లింది. అప్పట్లో 26 శాతం లెస్‌కు దక్కించుకున్న కడపకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. అయినా వైసీపీ నేతలు జలాశయం నిర్మాణానికి అవసరమైన 50 లక్షల క్యూబిక్‌ టన్నుల మట్టిని ఎత్తనీయకుండా అడ్డుకోవడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఇలా ఏడాది వరకు పనులు ఆగిపోవడం.. మళ్లీ మొదలు పెట్టమని అధికారులు ఒత్తిడి చేయడంతో కాంట్రాక్టర్‌ తనవల్ల కాదని చేతులెత్తేశారు. ఈ క్రమంలో వెంకటగిరి పర్యటనకు ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన జగన్మోహన్‌రెడ్డి.. జలాశయ నిర్మాణానికి రూ.500 కోట్లు విడుదల చేసి, పనులు పునః ప్రారంభిస్తామని చెప్పి వెళ్లారు. తర్వాత జలాశయం గురించి పట్టించుకోలేదు.

ఫలించిన కురుగొండ్ల కృషి

తాము అధికారంలోకి వస్తే ఆల్తూరుపాడు జలాశయ నిర్మాణం పూర్తి చేస్తామని వెంకటగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హమీని సీఎం నిలబెట్టుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే తొలి నుంచీ జలాశయం నిర్మాణం కోసం శ్రమిస్తూ వచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల కృషి కూడా ఫలించిందని రైతులతోపాటు కూటమి నేతలు పేర్కొన్నారు.

పూర్తికావస్తున్న పైపులైను నిర్మాణ పనులు

జలాశయానికి సంబంధించిన ఎత్తిపోతల పథకం, జలాశయం వరకు పైపులైను నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. జలాశయం నిర్మాణం పూర్తయితే కొండ కింద గ్రామాల్లో మెట్ట భూములు డెల్టాగా మారనున్నాయి. ఉపాధి అవకాశాలూ మెరుగు పడనున్నాయి.

Updated Date - Apr 12 , 2026 | 11:43 PM