తిరుపతి జిల్లాలోనే అత్యధికంగా భూసేకరణ
ABN , Publish Date - May 21 , 2026 | 02:11 AM
తిరుపతి జిల్లాలో వేర్వేరు ప్రాజెక్టుల కోసం పది వేల ఎకరాలకుపైగా భూములు సేకరిస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే అత్యధికమని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు.
దుగరాజపట్నానికి 3 వేలు, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు 300
ఏడు రైల్వే ప్రాజెక్టుల కోసం మరో వెయ్యి ఎకరాలు
కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేర్వేరు ప్రాజెక్టుల కోసం పది వేల ఎకరాలకుపైగా భూములు సేకరిస్తున్నామని, ఇది రాష్ట్రంలోనే అత్యధికమని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. బుధవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. 2,500 ఎకరాలతో శ్రీసిటీ సెజ్‌ను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికోసం ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ వేగంగా చేపడుతున్నామని చెప్పారు. అలాగే నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కు, మేనకూరు సెజ్‌ల విస్తరణ కోసం 2వేల ఎకరాలు సేకరిస్తున్నామన్నారు. వాకాడు మండలంలో దుగరాజపట్నం వద్ద ఓడరేవుతోపాటు షిప్ బిల్డింగ్ పరిశ్రమ ఏర్పాటు కోసం 3వేల ఎకరాల భూమి అవసరమవుతోందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భూసేకరణ మొదలు పెట్టామన్నారు. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ పరిశ్రమ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో సత్యవేడు మండలం వానెల్లూరు, రాళ్లకుప్పం గ్రామాల పరిధిలో 300ఎకరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. మరోవైపు జిల్లాతో ముడిపడిన ఏడు రైల్వే ప్రాజెక్టుల కోసం సుమారు వెయ్యి ఎకరాలు సమీకరించాల్సి ఉందన్నారు. ఇక జాతీయ రహదారులకు సంబంధించి రేణిగుంట - కడప, భాకరాపేట - తిరుపతి, పూతలపట్టు - నాయుడుపేట పెండింగ్ పనులు, తిరుపతి - చెన్నై ప్రాజెక్టులకు 400 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.
ఆగస్టు నుంచి ఎల్జీ ఎలకా్ట్రనిక్స్‌లో ఉత్పత్తి
శ్రీసిటీలో ఎల్జీ ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమ శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోందని, ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుందని కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, ఏసీ కంప్రెషర్లు, హీట్ ఎక్ఛేంజర్లు తదితర ఎలకా్ట్రనిక్స్ వస్తువులు ఈ పరిశ్రమలో తయారవుతాయన్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీసిటీలో 500 ఎకరాల భూమిని గతేడాది కేటాయించిందని ఆయన గుర్తు చేశారు.