భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:33 AM
తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.
- టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల, జూన్9(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమలలోని పద్మావతి అతిథిగృహంలో ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన ముడి దినుసుల సరఫరాలో రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఇటీవల నిర్వహించిన అభిప్రాయ సేకరణలో దాదాపు 98 శాతానికి పైగా భక్తులు గతంతో పోలిస్తే అన్నప్రసాదం రుచి, నాణ్యత గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారని అదనపు ఈవో తెలిపారు. అలాగే సోమవారం రాత్రి రైస్ మిల్లర్లు స్వయంగా అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోగా, అధిక శాతం మంది భక్తులు అన్నప్రసాద నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడించారు. అభిప్రాయ సేకరణలో కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని సూచించారని తెలిపారు. ఈ సూచనను సానుకూలంగా పరిగణించి అందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.టీటీడీకి అవసరమైన వివిధ రకాల పప్పు దినుసులను కూడా దాల్ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసే అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహార పదార్థాలు అందించే దిశగా విధివిధానాలను రూపొందిస్తున్నామన్నాని అదనపు ఈవో అన్నారు. వేర్ హౌజ్ డిప్యూటీఈవో పద్మావతి, ప్రొక్యూర్‌మెంట్ విభాగాధిపతి ఉమాశంకర్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు.