న్యాయ ఫలాలు అట్టడుగు వర్గాలకు దక్కాలి
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:49 AM
అటార్నీ జనరల్ వెంకటరమణి ఆకాంక్ష
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): న్యాయ ఫలాలు అట్టడుగు వర్గాలకు దక్కాలని అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్.వెంకటరమణి ఆకాంక్షించారు. ఎస్వీయూ లా విభాగం చేపట్టిన న్యాయోత్సవ్-2కె26ను శ్రీనివాసా ఆడిటోరియంలో శనివారం ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. న్యాయ వ్యవస్థతోనే సామాజికాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలు విజ్ఞాన సృష్టి కేంద్రాలని చెప్పారు. లా స్టూడెంట్స్ నీరసంగా ఉండకూడదని, సృజన అవసరమన్నారు. పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సంక్లిష్టతలను అర్థం చేసుకోవాలని కోరారు. కృత్రిమ మేధస్సులో మనం చూడని అంశాలను చూస్తున్నామన్నారు. అవి మీ మనస్సులను హైజాక్ చేస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జి అవధానం హరిహరనాథశర్మ మాట్లాడుతూ.. స్టూడెంట్స్ ఆఫ్ లా, లా స్టూడెంట్స్ పదాల మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వీసీ డి.సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ.. న్యాయశాస్త్ర విద్యాధ్యయనంలోని పలు అంశాలను ప్రస్తావించారు. ఎస్వీయూ వీసీ నరసింగరావు మాట్లాడుతూ.. అటార్నీ జనరల్ విశ్వవిద్యాలయానికి రావడం ఓ మైలురాయి అన్నారు. రెక్టార్ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఎస్వీయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య సుధారాణి ప్రసంగించారు. సమన్వయకర్తగా డీన్ భాస్కర్ రెడ్డి, లా విభాగ ప్రొఫెసర్ ఆదినారాయణ, ఐదేళ్ల లా కోర్సు అధ్యాపకులు అంజన్ సింగ్, మంజుల, భవ్య, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, అమరేశ్వరి, వెంకట్రమణ, వర్సిటీ కల్చరల్ కో-ఆర్డినేటర్ వివేక్ పత్తిపాటి, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, అటార్నీ జనరల్ రాక సందర్భంగా శ్రీనివాసా ఆడిటోరియం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా సభా ప్రాంగణం వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేశారు.