2021 స్థానిక ఎన్నికల ఘటనలే.. నేటి గొడవలకు మూలం
ABN , Publish Date - Oct 20 , 2026 | 01:43 AM
‘2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలు చేశారు.. నామినేషన్ పత్రాలు చించేశారు.. అక్రమంగా కేసులు పెట్టారు.. ఈ సంఘటనలే ప్రస్తుత హింసాత్మక పరిణామాలకు మూలం. నామినేషన్ల మొదటి రోజు పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీల్లో అనుకోని ఘటనలు జరిగాయి. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎలాంటి గొడవలూ లేవు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం.. అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతితో ఆయన జరిపిన సంభాషణ ఇలా..
మొదటి రోజు అనుకోని ఘర్షణలు
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది
ఎలక్షన్ ప్రశాంతంగా నిర్వహిస్తాం
ఆంధ్రజ్యోతితో డీఐజీ కోయ ప్రవీణ్
అన్నమయ్య, అక్టోబర్ 19(ఆంధ్రజ్యోతి): ‘2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ నేతలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలు చేశారు.. నామినేషన్ పత్రాలు చించేశారు.. అక్రమంగా కేసులు పెట్టారు.. ఈ సంఘటనలే ప్రస్తుత హింసాత్మక పరిణామాలకు మూలం. నామినేషన్ల మొదటి రోజు పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటీల్లో అనుకోని ఘటనలు జరిగాయి. అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎలాంటి గొడవలూ లేవు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం.. అని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతితో ఆయన జరిపిన సంభాషణ ఇలా..
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో హింసాత్మక ఘటనలు జరిగాయి.. ముందస్తుగా ఊహించలేకపోయారా?
డీఐజీ: భద్రతపరంగా ముందస్తు చర్యలు తీసుకున్నాం. పుంగనూరు, రాయచోటిలో ఘటనలు పూర్తిగా అనుకోకుండా జరిగినవే. జిల్లాలోని బలగాలలో సగం పుంగనూరుకు తరలించాం. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పోలీసులు చెప్పినట్లు వినకుండా దూకుడుగా వెళ్లడం వల్లే ఇక్కడ హింసాత్మక ఘటన జరిగింది. నామినేషన్ కేంద్రం వద్దకు మిథున్‌రెడ్డి వస్తే గొడవలు జరిగే అవకాశముందని సమాచారం ఉంది. ఈ విషయాన్ని ఎంపీకి తెలియజేశాం. అయినా ఆయన కాన్వాయ్‌లాగా వచ్చారు. వచ్చేటపుడు మధ్యలో కారుతో టీడీపీ మద్దతుదారులను ఢీకొట్టి గాయపరిచారు. నామినేషన్ కేంద్రంలోకి కాన్వాయ్‌తో వెళ్లారు. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, ప్రైవేటు వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి వెళ్లడంతో ప్రశ్నించిన టీడీపీ వర్గీయులపై ఎంపీ అనుచరులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఎంపీ కాన్వాయ్‌లోని ఒక కారు అతివేగంగా చక్కర్లు కొట్టి, టీడీపీ మద్దతుదారులపై ఎక్కించి గాయపరిచారు. కాన్వాయ్ వాహనాలలో తెచ్చిన ఇనుప సుత్తితో సదుం మండలానికి చెందిన సాయి ప్రసాద్‌రెడ్డి, తేజేశ్వర్ వారిపై దాడి చేశారు. రాయచోటి ఘటనలూ అనుకోకుండా జరిగినవే. రాయచోటిలో వైసీపీ వాళ్లు పంజాబ్ నుంచి ఆయుధాలతో బౌన్సర్లను తెచ్చుకున్నారు. ఆయుధాలకు సంబంధించి సరైన లైసెన్స్ పత్రాలు లేవు. నిందితుల మీద ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశాం.
పుంగనూరు, పులివెందులలో కాల్పులు జరిపే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు?
డీఐజీ: పుంగనూరులో టీడీపీ నాయకులను ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌లోని కారుతో ఢీకొట్టి.. పైకి ఎక్కించిన విషయం తెలుసుకున్న ఆ పార్టీ మద్దతుదారులు భారీగా నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడున్న ఎంపీ కాన్వాయ్‌లోని కార్లను ఎత్తి పడేశారు. ఆర్‌వో గదిలో ఉన్న ఎంపీపై దాడి చేశారు. అడ్డుకున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఎంపీని ఆర్‌వో గదిలో ఉంచి, తాళాలు వేసి రక్షించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మదనపల్లె డీఎస్పీ ప్రసాద్ గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. తర్వాత ఎస్పీ ధీరజ్ స్వయంగా వచ్చి గుమికూడిన వారిపై లాఠీఛార్జ్ చేసి చెదరకొట్టారు. ఎంపీని అక్కడి నుంచి తీసుకెళ్లి సురక్షితంగా బయట వదిలిపెట్టారు. పులివెందులలోనూ పుంగనూరు తరహాలో చేయాలని అక్కడి వైసీపీ వాళ్లు చూశారు. వాహనాన్నే ఆయుధంగా చేసుకుని అడ్డం వచ్చిన వాళ్లను ఢీకొట్టుకుంటూ, బారికేడ్లను గుద్దుకుంటూ ముందుకు వెళ్లారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కారు బ్యానెట్, టైర్ల మీద కాల్పులు జరిపారు. బాష్పవాయువును ప్రయోగించి అక్కడున్న వాళ్లను చెదరగొట్టారు.
ఎంతమందిపై కేసులు నమోదు చేశారో చెప్పగలరా?
డీఐజీ: పుంగనూరు, రాయచోటి, పులివెందులలో జరిగిన ఘటనలపై కేసులు నమోదు చేశాం. ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌తో టీడీపీ వాళ్లను ఢీకొట్టడం.. మనుషులపైకి కారును ఎక్కించి గాయపర్చడం.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం వంటి ఫిర్యాదులపై ఐదు కేసులు నమోదు చేశాం. ప్రాథమికంగా 70 మందికి పైగా నిందితులను గుర్తించాం. పూర్తి స్థాయిలో విచారిస్తున్నాం. రాయచోటిలో జరిగిన ఘటనలపైనా మూడు కేసులు నమోదు చేశాం. పులివెందులలోనూ మూడు కేసులు నమోదు చేశాం.
కడప, రాజంపేటలో ఘర్షణలకు కారణాలు ఏమిటంటారు?
డీఐజీ: పుంగనూరు ఘటన తర్వాత క్యాడర్ కూడా అదుపు తప్పి సంఘటనలు జరిగాయి. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన ఘటనల వీడియోలు ఇప్పుడు సోషియల్ మీడియాలో తిరుగుతున్నాయి. దీనివల్ల చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఎటువంటి కేసులూ నమోదు కాలేదు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు మమ్మల్ని సంపద్రించిన వాళ్లను దగ్గరుండీ తీసుకెళ్లి నామినేషన్ వేయించాం. ఎక్కడా ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడగలిగాం.
ప్రశాంత ఎన్నికలకు తీసుకుంటున్న చర్యల గురించి చెప్పగలరా?
డీఐజీ: నామినేషన్లు ముగిసే సమయానికి ఎన్ని నామినేషన్లు పడ్డాయి? ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి? ఉపసంహరణ తర్వాత పూర్తి అంచనా వస్తుంది. దీన్ని బట్టి ఎన్నికల నిర్వహణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటన వల్ల ఇక్కడి పరిస్థితిపై అంచనా ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు, ఎన్నికలకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవగాహన ఉంది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షాలను ఇబ్బందిపెట్టిన చోట గొడవలు జరిగే అవకాశముంది. అక్కడ ముందస్తుగా చర్యలు తీసుకుంటాం.