కమనీయం వినాయక కల్యాణం
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:38 AM
కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి వరసిద్ధి వినాయకస్వామి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కాణిపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి వరసిద్ధి వినాయకస్వామి కల్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్దితో,పెళ్లి పెద్దగా బ్రహ్మ వ్యవహరించి వినాయకస్వామికి వివాహం జరిపిస్తారని భక్తుల నమ్మకం. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూల విరాట్‌కు అభిషేకంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, తిరువణంపల్లెలకు చెందిన వణిగ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం వీరు కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చిన పాలతో సిద్ధి, బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవర్లకు పాలాభిషేకం చేశారు. రాత్రి అలంకార మండపంలోని ప్రత్యేక కల్యాణ మండప వేదికపై వధూవరులైన ఉత్సవర్లను నూతన వస్త్రాలతో అలంకరించారు. సంప్రదాయబద్ధంగా మండపంలోకి తీసుకొచ్చి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణం జరిపించారు. పూల మాలల మార్పిడి, తలంబ్రాలు పోశారు.