Share News

నెరవేరినే సొంతింటి కల

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:21 AM

సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత 2,832 మందికి సొంతింటి కల నెరవేరింది

నెరవేరినే సొంతింటి కల
లబ్ధిదారురాలికి ఇంటి తాళం ఇస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌ తదితరులు

చిత్తూరు అర్బన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత 2,832 మందికి సొంతింటి కల నెరవేరింది. చిత్తూరు సమీపం పూణేపల్లె సమీపంలోని టిడ్కో ఇళ్లను సోమవారం లబ్ధిదారులకు అప్పగించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్లను ప్రారంభించగా.. ఇక్కడ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ తదితరులతో కలిసి కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు అందజేశారు. సొంతింటికి చేరిన పలువురు లబ్ధిదారులు పాలు పొంగించారు. పూజలు చేశారు. ఇన్నాళ్లకు సొంతింటికి చేరడంతో ఆనందం వ్యక్తంచేశారు. అంతకుముందు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. వీధులను తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన గృహ సముదాయాన్ని మోడల్‌ కాలనీగా తీర్చిదిద్దడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాలా ఏళ్ల కిందట ఈ ప్రాజెక్టు ప్రారంభమైందని, ఇప్పుడు లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. 35.49 ఎకరాల్లో రూ.184.08 కోట్లతో గృహ నిర్మాణాలను చేపట్టామన్నారు. మౌలిక సమస్యలు తలెత్తకుండా చూడాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కాలనీ అభివృద్ధిపై నెలకోసారి సమీక్షిస్తామన్నారు. ఏవైనా సమస్యలొస్తే పీజీఆర్‌ఎ్‌సలో లేదా కమిషనర్‌ దృష్టికి తీసుకురావాలన్నారు. కాస్త పెండింగులో ఉన్న రోడ్డు విస్తరణ, మురుగునీటి కాల్వలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. నగరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో టిడ్కో గృహాలను నిర్మించినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ తెలిపారు. తాగునీరు. డ్రైనేజీ, శానిటేషన్‌తో పాటు మెడికల్‌స్టోర్‌, ప్రొవిజన్‌స్టోర్‌ సదుపాయం కల్పించేలా చూస్తామన్నారు. పూణేపల్లె నుంచి కలెక్టరేట్‌ వరకు ఆర్టీసీ సర్వీసు నడిచేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందుకు పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. కూలి పనులు చేసుకునే తమకు కూటమి ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కమిషనర్‌ నరసింహ ప్రసాద్‌, చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌, జనసేన నాయకురాలు కవిత, మాజీ మేయర్‌ అముద, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 01:21 AM