ప్రొసీడింగ్స్ ఇస్తేనే ‘పంచాయతీ’ తీరేది!
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:26 AM
పంచాయతీల్లో ఇళ్లు కొనుక్కుంటున్నారా.... అయితే మీ పేరుతో ఆ ఇల్లు మ్యుటేషన్ (పేరు మార్పు) చేసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే..... కొత్త ఆర్థిక సంవత్సరం వస్తే తప్ప తాము డిమాండ్ నోటీసులు (ఇంటి పన్ను రసీదులు) జారీ చేయలేమని, అప్పుడు మాత్రమే మ్యుటేషన్ చేసుకునేందుకు అవకాశం ఉందని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు.
తిరుపతి(టీటీడీ), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో ఇళ్లు కొనుక్కుంటున్నారా.... అయితే మీ పేరుతో ఆ ఇల్లు మ్యుటేషన్ (పేరు మార్పు) చేసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే..... కొత్త ఆర్థిక సంవత్సరం వస్తే తప్ప తాము డిమాండ్ నోటీసులు (ఇంటి పన్ను రసీదులు) జారీ చేయలేమని, అప్పుడు మాత్రమే మ్యుటేషన్ చేసుకునేందుకు అవకాశం ఉందని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది మే తర్వాత గ్రామాల్లో ఇండ్లు కొనుగోలు చేసినవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇంటిపై రుణాలు తీసుకోవాలన్నా, ఇంటిని విక్రయించాలన్నా సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న విధంగా సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల్లోనే నగదును చెల్లించుకుని ఆటో మ్యుటేషన్ చేసుకునే పద్ధతిని ప్రవేశపెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తిరుపతి జిల్లా పరిధిలో నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అనేకమంది వీటిని కొనుగోలు చేసి తర్వాత వివిధ అవసరాల కోసం విక్రయిస్తున్నారు. అయితే పంచాయతీల్లో విక్రయించే ఇంటి విషయమై మ్యుటేషన్‌లో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. సాధారణంగా ప్రజలు ఇళ్లను కొనుగోలు చేసిన వెంటనే తమ పేరుతో మార్చుకోవాలని చూస్తుంటారు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత పంచాయతీలకు వెళ్లి మ్యుటేషన్ కోసం అడిగితే తాము ఇప్పుడు పేరు మార్చలేమని చెబుతున్నారు. సాధారణంగా ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభం అంటే ఏప్రిల్‌లో డిమాండ్ నోటీసులు జారీ చేస్తుంటామని, అందువల్ల మధ్యలో పేరు మార్పు ప్రొసీడింగ్స్ ఇవ్వడం సాధ్యం కాదంటున్నారు. డిమాండ్ నోటీసు ఇచ్చే సమయంలోనే మారుస్తామంటున్నారు.పలువురు పిల్లల చదువు, వివాహం, ఇతర అవసరాలకు ఇంటిని తనఖా పెట్టి రుణాలు తీసుకునేందుకు బ్యాంకులకు వెళితే అక్కడ వారి పేరుతో ఇంటి పన్ను కట్టిన రసీదులు, పంచాయతీ జారీ చేసిన ప్రొసీడింగ్స్ వంటి ధ్రువపత్రాలు అడుగుతున్నారు. అయితే రిజిస్ర్టేషన్ జరిగినా ఇల్లు మాత్రం విక్రయదారుల పేరుపైనే ఉండడంతో బ్యాంకు అధికారులు రుణాలను తిరస్కరిస్తున్నారు. ప్రొసీడింగ్స్ లేకపోతే ఇవ్వలేమని చెబుతున్నారు.
కార్పొరేషన్ల పరిధిలో...
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత ఆటో మ్యుటేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇల్లు కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడే సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలోనే ఇంటిని తన పేరుతో మ్యుటేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నిర్దేశించిన నగదును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయంలోనే ఒక ప్రొసీడింగ్ జారీ చేస్తారు. ఇందులో పేరు మారాల్సిన ఇంటి నంబరు, ఎవరు విక్రయించారు, ఎవరి పేరుతో మారుస్తున్నారు అనే పూర్తి వివరాలతో ప్రొసీడింగ్ ఉంటుంది. అలాగే ఆస్తి, నీటి పన్ను వంటివి అన్నీ కూడా కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతో మారిపోతాయి. అలాగే వ్యవసాయ భూముల విక్రయాలు చేసిన సమయంలోనూ ఇదే తరహాలో ఆటో మ్యుటేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది.
అధికారులు దృష్టిసారిస్తే.....
పంచాయతీశాఖ ఉన్నతాధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఒక్కసారి రిజిస్ర్టేషన్ జరిగిన వెంటనే మ్యుటేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇల్లు విక్రయం జరిగి రిజిస్ర్టేషన్ జరిగిన తర్వాత పంచాయతీల్లో ఆ పత్రాలు సమర్పించిన తర్వాత కొనుగోలు చేసిన వ్యక్తి పేరుతో ప్రొసీడింగ్స్ జారీ చేస్తే సరిపోతుంది. దీనివల్ల లబ్ధిదారు కొనుగోలు చేసిన ఆస్తిని విక్రయించడంతోపాటు అవసరమైతే రుణాలు పొందేందుకు, తమ కుటుంబ సభ్యుల పేరుతోనే దాన దస్తావేజులు రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం ఉంది.