‘విండో’ సీఈవోల మెడపై డిగ్రీ కత్తి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:30 PM
సహకార సంఘాల్లో పాతికేళ్లకు మించి పని చేస్తున్న వారికి ఇప్పుడు కఠిన ‘పరీక్ష’ ఎదురైంది
ఈ వయసులో డిగ్రీ పరీక్ష ఎట్టా?
సహకార సంఘాల్లో పాతికేళ్లకు మించి పని చేస్తున్న వారికి ఇప్పుడు కఠిన ‘పరీక్ష’ ఎదురైంది. డిగ్రీ పాసై ఉంటేనే సీఈవోలుగా ఉంటారని సహకార శాఖ స్పష్టంచేసింది. లేదంటే వేరొకరిని సీఈవోగా నియమిస్తామంటూ తాఖీదు పంపింది. ఐదేళ్ల గ్రేస్ (మినహాయింపు) పీరియడ్ ఇచ్చిన సహకార శాఖ ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి డిగ్రీ అర్హత తప్పనిసరిగా ఉండాలంటూ పేర్కొంది. ఏప్రిల్ నుంచి హెచ్‌ఆర్ పాలసీ అమలు, పదోన్నతులకు తెరతీస్తూ షెడ్యూల్ తయారవుతోంది.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిఽధిలో 75 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి (సింగిల్ విండోలు) సంఘాలు పనిచేస్తున్నాయి. వీటిలో సుమారు 200 మంది చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లు(సీఈవో), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్కు(ఏఈవో)లుగా పిలిచే స్టాఫ్ అసిస్టెంట్లు, సబ్‌స్టాఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అప్పట్లో 8వ తరగతి లేదా ఎస్‌ఎ్‌సఎల్‌సీ చదివిన వారంతా సింగిల్ విండోల్లో చేరారు. ఎక్కువ ఉద్యోగ అనుభవం కలిగిన వారే ఉన్నారు. వీరంతా ఆయా విండోల పరిధిలో రైతులకు కావాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం, అవసరమైన ఎరువులు, క్రిమిసంహారక మందులు సీడీసీఎంఎస్ ద్వారా తెప్పించి క్రయ విక్రయాలు చేయడం, జిప్సం అమ్మకాలు,ధాన్యం కొనుగోలు, బంగారంపై రుణాలు, ఇతరత్రా ప్రభుత్వ పథకాల అమల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సీఈవోలుగా ఉన్న వారిలో చాలా మంది 5-10 ఏళ్లలోపు పదవీ విరమణ చేసేవారే ఉన్నారు. ఇతర ప్రభుత్వశాఖల్లోలా తమకూ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచాలని పోరాటం చేస్తున్నారు.
హెచ్‌ఆర్ పాలసీ అమలుకు ప్రణాళిక
దీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న సహకార సంఘాల డిమాండ్ల మేరకు అందరికీ హెచ్‌ఆర్ పాలసీ అమలుకు గత ప్రభుత్వం సిద్ధమైంది. 2020 డిసెంబరు 4న ఖాళీల భర్తీలు, పదోన్నతులు, హెచ్‌ఆర్ పాలసీ అమలుకు ప్రణాళికను రూపొందించింది. కొన్ని పోస్టులకు డిగ్రీ అర్హత తప్పనిసరి చేసింది. హెచ్‌ఆర్ పాలసీ అమలుకు జిల్లా స్థాయు ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ (డీఎల్‌ఈసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా డీసీసీబీ చైర్మన్, కన్వీనరుగా డీసీవో, సభ్యులుగా డీసీసీబీ సీఈవో, నాబార్డు డీడీఎంలను నియమించింది. ఐదేళ్ల గ్రేస్ పీరియడ్‌ను ఇస్తూ 2025లోగా విధులు నిర్వహిస్తూనే డిగ్రీ అర్హత సాధించేందుకు అవకాశం ఇచ్చింది. ఈ గడువు 2025డిసెంబరు నెలతో ముగిసింది. అప్పుడప్పుడు ఈ కమిటీ సమావేశం అవుతున్నా హెచ్‌ఆర్ పాలసీ అమలుకు శ్రద్ధ చూపలేదు. ఈ నెల ప్రారంభంలో సహకార ఉన్నతాధికారులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. గత ఐదేళ్ల కాలంలో పట్టించుకోకుండా తాజాగా కొత్త మార్గదర్శకాలు ఇస్తూ డిగ్రీ అర్హత కలిగిన విండో ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలంటూ పంపారు. ప్రస్తుతం పనిచేస్తున్న సింగిల్‌విండో సీఈవోల్లో 15 మందికి మాత్రమే డిగ్రీఅర్హత ఉంది. మరో 10 పోస్టులు పదవీ విరమణ, సస్పెన్షన్లతో ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారు 50 మంది వరకు ఉన్నారు. డిగ్రీలేని సీఈవోల స్థానంలో సబ్‌స్టా్‌ఫలోని విద్యావంతులను నియమించనున్నారు.
మొదలైన కదలిక
ఆర్థిక సంవత్సరాంతం కావడంతో రుణ వసూళ్లు వందశాతం చేసి ఎన్‌పీఏ తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్న డీసీసీబీ ఏప్రిల్ నుంచి హె చ్‌ఆర్ పాలసీ అమలు ప్రక్రియను ప్రారంభించేందుకు కదిలింది. ఉమ్మడి జిల్లాలో జిల్లాల వారీగా చిత్తూరులో 37, తిరుపతిలో 23, అన్నమయ్య జిల్లాలో 15 పనిచేస్తున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న సీఈవో, స్టాఫ్ అసిస్టెంట్లలో డిగ్రీ విద్యార్హత కలిగిన వారి వివరాల సేకరణ ప్రారంభమైంది. వీరికి ఆయా జిల్లాల పరిధిలోనే పదోన్నతులు, నియామకాలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. హెచ్‌ఆర్‌పాలసీ అమల్లో భాగంగా ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు అందే అవకాశాలు ఉన్నాయి.
ఏప్రిల్ నుంచి హెచ్‌ఆర్ పాలసీలపై శ్రద్ధ
సహకార శాఖ ఉన్నతాధికారుల నుంచి నూతన మార్గదర్శకాలు ఇటీవల అందాయి. డిగ్రీ అర్హత కలిగి సింగిల్‌విండోల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరిస్తున్నాం. వచ్చే నెల నుంచి హెచ్‌ఆర్ పాలసీ అమలుపై దృష్టి పెడుతున్నాం. మూడు జిల్లాల్లో ఎక్కడివారికక్కడికే పదోన్నతులు ఇవ్వనున్నాం.
- శంకర్‌బాబు, సీఈవో, డీసీసీబీ, చిత్తూరు