మృత్యు ఘోష
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:34 AM
తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఒక హోటల్ భవన నిర్మాణ స్థలంలో భారీ క్రేన్ కిందపడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు
క్రేన్ కిందపడి ముగ్గురు మరణం
13 అంతస్తుల నాందీ హోటల్ నిర్మాణ స్థలంలో ఘోర ప్రమాదం
తీవ్రగాయాలపాలై ప్రాణాలతో బయటపడిన మరో ముగ్గురు
తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.ఒక హోటల్ భవన నిర్మాణ స్థలంలో భారీ క్రేన్ కిందపడి ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయాలపాలై ప్రాణాలతో బయట పడ్డారు. 35 అడుగుల లోతున తవ్విన నిర్మాణ స్థలం పక్కనే భారీ క్రేన్‌ను ఏర్పాటు చేసి చెట్టును తొలగించే ప్రయత్నం చేయడం ఈ ఘోర ప్రమాదానికి దారితీసింది. తిరుపతి డీబీఆర్ రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్స్‌కు పక్కనే ఉన్న 88 సెంట్ల స్థలంలో వారి అనుబంధ సంస్థ నాందీ గ్రూప్ 13 అంతస్తుల హోటల్ భవన నిర్మాణ పనులు చేపట్టింది. ఇందుకోసం ఆ స్థలంలో సుమారు 35 అడుగుల లోతున తవ్వకాలు చేపట్టారు. ఈ నిర్మాణ స్థలానికి మరోవైపు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉంది. పాఠశాల ప్రహరీ గోడను ఆనుకుని శ్రీ కన్వెన్షన్స్ ప్రాంగణంలో ఉన్న పెద్ద రావిచెట్టును తొలగించేందుకు మంగళవారం భారీ క్రేన్‌ను తీసుకొచ్చారు.మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటల సమయంలో చెట్టు చుట్టూ ఇనుప తీగలతో క్రేన్‌కు కట్టి పెకలించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. నిర్మాణ స్థలంలో 35 అడుగుల లోతున తవ్వకాలు చేపట్టిన ప్రాంతానికి అంచునే వందల టన్నుల బరువైన భారీ క్రేన్ ఉండటంతో దాని బరువును భూమి తట్టుకోలేకపోయింది. దీంతో క్రేన్ ఒక్కసారిగా ఒకవైపునకు ఒరిగి కూలిపోయింది.ఈ ఘటనలో అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న ముగ్గురు క్రేన్ కింద నలిగిపోయి మృతిచెందారు. మరో ముగ్గురు గుంటలోకి పడిపోవడంతో క్రేన్ కింద చిక్కుకోకుండా ప్రాణాలతో బయటపడ్డారు.చనిపోయినవారిలో శ్రీ కన్వెన్షన్స్ సివిల్ ఇంజనీర్, శ్రీకాళహస్తికి చెందిన సందీప్‌రెడ్డి (34), శ్రీ కన్వెన్షన్స్‌లో తోటమాలిగా పనిచేస్తున్న కరకంబాడికి చెందిన చెంగయ్య (40), ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతానికి చెందిన కూలీ రామారావు (41) వున్నారు. అదే ప్రాంతంలో పనులను పర్యవేక్షిస్తున్న బీహార్‌కు చెందిన క్రేన్ ఆపరేటర్లు షేక్ ఫర్హాన్ (24), షేక్ నౌసాన్ (23) తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన కూలీ మురుగయ్య (34) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భూమి కుంగిన సమయంలో వీరు ముగ్గురు గుంటలోకి పడిపోవడంతో క్రేన్ కింద చిక్కుకోకుండా ప్రాణాలు దక్కించుకున్నారు.
రంగంలోకి పోలీసులు.. రుయాస్పత్రికి క్షతగాత్రులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, ఈస్ట్ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురినీ చికిత్స నిమిత్తం రుయాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి తరలించారు. ఈ క్రమంలో క్రేన్ కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. వందల టన్నుల బరువున్న భారీ క్రేన్ కావడంతో మరో మూడు చిన్న క్రేన్లు, ఓ పొక్లయినరును తీసుకువచ్చి క్రేన్‌ను పైకి ఎత్తి మృతదేహాలను వెలికి తీశారు. క్రేన్ కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని బయటకు తీసే దృశ్యాలు అందరినీ కలచివేశాయి.
భద్రతా చర్యలపై దర్యాప్తు
మృతుడు సందీప్‌రెడ్డి భార్య కీర్తన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణ స్థలంలో 35 అడుగుల లోతున తవ్వకాలు చేపట్టిన నేపథ్యంలో క్రేన్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతంలో భూమి స్థిరత్వాన్ని పరిశీలించారా ? భారీ క్రేన్‌ను అక్కడ నిలిపేందుకు ఏమేరకు భద్రతా చర్యలు తీసుకున్నారు... చెట్టును తొలగించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించారా అనే అంశాలపై, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
కన్నీరు... మున్నీరు
ప్రమాద స్థలంలో మృతుల పరిస్థితిని చూసి తోటి పనివారు, కూలీలు, సమాచారం అందగానే మార్చురీ వద్దకు చేరుకున్న మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి వరకు ఉత్సాహంగా తమతో కలిసి పనిచేస్తున్న వారు విగత జీవులుగా మారటాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదనకు గురయ్యారు. మృతుల్లో ఒకడైన ఒడిశాకు చెందిన కూలీ రామారావు తన భార్య కొర్లమ్మతో కలిసి పదేళ్లుగా జిల్లాలోనే నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నారు. తమ పిల్లలను స్వస్థలాల్లోనే ఉంచి చదివించుకుంటున్నారు. రామారావు మృతిచెందడంతో తన పిల్లలను ఎలా పోషించాలని కొర్లమ్మ విలపించారు. అలాగే సివిల్ ఇంజనీర్ సందీప్‌రెడ్డికి ఏడాది క్రితమే వివాహమైంది. భార్య కీర్తన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలిసి సాయంత్రానికి తిరుపతికి చేరుకున్న ఆమె విగతజీవిగా కనిపించిన భర్తను చూసి భోరున విలపించారు. ఇక కరకంబాడికి చెందిన శ్రీ కన్వెన్షన్ తోటమాలి చెంగయ్య భార్యాపిల్లలు ఎండిన కళ్లతో నిరామయంగా కనిపించారు.