సంబరం ముగిసింది.. స్ఫూర్తి రగిలింది!
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:31 AM
ఐదు రోజుల క్రీడా సంబరం ముగిసింది. మైదానాలు మళ్లీ నిశ్శబ్దంగా మారాయి. కానీ అక్కడ కనిపించిన పోరాట స్ఫూర్తి, విజయ కాంక్ష, పట్టుదల మాత్రం విద్యార్థులకు స్ఫూర్తిగా మిగిలాయి. పతకాలు కొందరి మెడలో మెరిశాయి..
- అమరావతి ఛాంపియన్‌షి్‌పతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం
ఐదు రోజుల క్రీడా సంబరం ముగిసింది. మైదానాలు మళ్లీ నిశ్శబ్దంగా మారాయి. కానీ అక్కడ కనిపించిన పోరాట స్ఫూర్తి, విజయ కాంక్ష, పట్టుదల మాత్రం విద్యార్థులకు స్ఫూర్తిగా మిగిలాయి. పతకాలు కొందరి మెడలో మెరిశాయి..కానీ క్రీడలపై ఆసక్తి ఎంతోమంది మనసుల్లో మొలకెత్తింది.అందుకే.. అమరావతి ఛాంపియన్‌షి్‌ప సంబరం ముగిసినా..క్రీడాస్ఫూర్తి మాత్రం రగులుతూనే ఉంది!
తిరుపతి సిటీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మైదానాల్లో పరుగులు..విజయమే లక్ష్యంగా దూసుకెళ్లిన క్రీడాకారులు.. గెలిచినప్పుడు కేరింతలు.. ఓడినప్పుడు మరోసారి గెలవాలన్న పట్టుదల..ఐదు రోజుల పాటు తిరుపతి నగరాన్ని క్రీడా సంబరంలో ముంచెత్తిన అమరావతి ఛాంపియన్‌షి్‌ప పోటీలతో రగిలిన క్రీడాస్ఫూర్తి మాత్రం విద్యార్థుల మనసుల్లో మిగిలిపోయింది. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు కేవలం విజేతలను ఎంపిక చేసే వేదికగా కాకుండా విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంచే వేదికగా నిలిచాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన విద్యార్థుల్లో మైదానంలోకి దిగి మన ప్రతిభనూ నిరూపించుకోవాలి అన్న ఆలోచన కలిగింది.ఈ పోటీల నిర్వహణతో తిరుపతిలో క్రీడా వాతావరణం మరింత బలపడింది. పెద్ద స్థాయి పోటీలను నిర్వహించేందుకు నగరంలో ఉన్న అవకాశాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇలాంటి పోటీలు తరచూ నిర్వహిస్తే పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో మరింత మంది క్రీడల వైపు వచ్చే అవకాశం లేకపోలేదు. పోటీల్లో పతకాలు సాధించిన వారు కొందరే కావచ్చు. కానీ ఈ ఐదు రోజుల్లో క్రీడలను చూసి, క్రీడాకారుల ఉత్సాహాన్ని ఆస్వాదించి, తామూ ఏదో ఒక క్రీడలో రాణించాలనుకున్న విద్యార్థుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరుగుతుందని సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది. చదువు, పరీక్షలు, మార్కులకే విద్యార్థి జీవితం పరిమితం కాకూడదని, శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు క్రీడలు దోహదపడతాయనే విషయాన్ని అమరావతి ఛాంపియన్‌షి్‌ప మరోసారి గుర్తుచేసింది.
5 రోజుల సంబరంపై 5 నిమిషాల ఏవీ
అమరావతి ఛాంపియన్ షిప్ బహుమతి ప్రదానోత్సవంలో 5 రోజుల క్రీడా సంబరాలను 5 నిమిషాల ఏవీ (ఆడియో/వీడియో) కళ్లకు కట్టింది.స్పోర్ట్స్ హైలెట్స్ వీడియో క్లిప్పులను ఆకట్టుకునే రీతిలో కూర్పుచేసి ప్రదర్శించారు. అలాగే క్రీడాపోటీలను విజయవంతం చేసేందుకు రెండు నెలల పాటు అహరహం కృషిచేసిన శాప్ ఛైర్మన్ రవి నాయుడిని అందరూ ప్రశంసించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 9,911 మందిని తిరుపతికి తీసుకొచ్చి విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికి తీయడంతో పాటు, వారిలో క్రీడా స్ఫూర్తిని నింపడంలో కీలక పాత్ర పోషించారని అభినందించారు.