దగ్ధమవుతున్న తలకోన అడ వులు
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:52 AM
వెంకటేశ్వర అభయారణ్యంలో భాగమైన తలకోన అడవులు అగ్నికీలలతో దగ్ధమవుతున్నాయి.అరుదైన జీవులు,జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలకు నెలవైన శేషాచల పర్వతాల్లోని తలకోన అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవ వైవిధ్య అటవీ ప్రాంతం (బయోడైవర్శిటీ ఫారెస్టు)గా గుర్తించాయి.
ఎర్రావారిపాలెం, ఏఫ్రిల్ 26(ఆంధ్రజ్యోతి): వెంకటేశ్వర అభయారణ్యంలో భాగమైన తలకోన అడవులు అగ్నికీలలతో దగ్ధమవుతున్నాయి.అరుదైన జీవులు,జంతువులు, పక్షులు, కీటకాలు, సరీసృపాలకు నెలవైన శేషాచల పర్వతాల్లోని తలకోన అడవులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవ వైవిధ్య అటవీ ప్రాంతం (బయోడైవర్శిటీ ఫారెస్టు)గా గుర్తించాయి. ఈ అటవీ ప్రాంతంలో జన సంచారం నిషేధం. అయినా చెట్లు నరకడం, జంతువుల వేట ఆగడం లేదు.ఈ అటవీ ప్రాంతం ఏటా కాలి బూడిదవుతుంటుంది. నాలుగు రోజులుగా తలకోన అడవుల్లోని మూడవ వంక నుంచి తూర్పుగా వడ్లవానికుంట వరకూ వృక్ష, జంతు సంపద కాలి బూడిదవుతోంది.అడవుల్లో మంటలు ఎగిసిపడినా, దట్టంగా పొగలు అలుముకున్నా శాటిలైట్ ద్వారా వెంటనే ఫారెస్టు అధికారుల ఫోన్లకు సమాచారం అందుతుంది.అయినప్పటికీ ఫారెస్టు అధికారులు అడవుల్లో మంటలను అదుపు చేయలేకపోతున్నారని స్థానికులు పెదవి విరుస్తున్నారు.తిరుపతి శివారు ప్రాంతమైన జీవకోన పైభాగంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిజ్వాలలు కిలోమీటర్లమేర వ్యాపించడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.