Share News

ఆరంభం... బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:57 AM

పెద్ద శేషుడితో మొదలైన వాహన వైభవం సాంస్కృతిక ప్రదర్శనలతో మాడవీధులు కళకళ

ఆరంభం... బ్రహ్మోత్సవం
విష్వక్సేనుడి ఊరేగింపు

తిరుపతి(టీటీడీ)/తిరుమల, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో మంగళవారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందురోజైన సోమవారం ఉత్సవాలకు ఆలయంలో అంకురార్పణను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి విష్వక్సేనులవారు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలు నాటారు. వైఖానస ఆగమెక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని ముగించారు.మంగళవారం సాయంత్రం 6.21 - 6.35 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకబృందం బంగారు ధ్వజస్తంభంపై గరుడపటాన్ని ఎగురవేసి.. సకల దేవతామూర్తులు, అష్టదిక్పాలకులకు ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో పరివట్టం ధరించి తలపై పళ్లెంలో పట్టువస్త్రాలను మోస్తూ మంగళవాయిద్యాల నడుమ బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకుని అర్చక బృందానికి అందజేశారు.అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి పెద్దశేష వాహనంలో నాలుగుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటిని కటాక్షించారు. భక్తులు గ్యాలరీల్లో వేచివుండి స్వామికి కర్పూరనీరాజనాలు సమర్పించి భక్తిప్రపత్తులను చాటుకున్నారు.వాహనసేవకు ముందు అసోం, పుదుచ్చేరి, వారణాసి ప్రాంతాల కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Updated Date - Sep 16 , 2026 | 01:57 AM