ఉసురు తీసిన ఉదాశీనత
ABN , Publish Date - May 05 , 2026 | 12:29 AM
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 4గంటలకు జరిగిన ప్రమాదానికి అధికారుల ఉదాశీనతే కారణమన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
శ్రీకాళహస్తి, మే 4 (ఆంధ్రజ్యోతి) : శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం 4గంటలకు జరిగిన ప్రమాదానికి అధికారుల ఉదాశీనతే కారణమన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.ఉబ్బసం వ్యాధితో తీవ్ర ఇబ్బంది పడుతున్న కుటుంబసభ్యుడిని బతికించుకునే ప్రయత్నంలో కోల్‌కాతాకు చెందిన ఓ కుటుంబం బెంగళూరు ఆస్పత్రికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ఏకంగా ముగ్గురిని కోల్పోయి రోడ్డున పడింది.ఇదే ప్రమాదంలో వారిని తీసుకొస్తున్న అంబులెన్స్ డ్రైవరు కూడా ప్రాణాలు కోల్పోయాడు. వేల కిలోమీటర్లు దాటివచ్చిన వారి యాత్ర చివరకు విషాదాంతంగా మారింది.ఊరందూరు వద్ద 20 నెలల క్రితం రోడ్డు ఆరంభమైనప్పటి నుంచీ వరుసగా దుర్ఘటనలు సంభవిస్తూనే ఉన్నాయి.మరీ ఏడాది కాలంగా కనీస నిబంధనలు పాటించకుండా వ్యాపార సంస్థలు యధేచ్చగా వెలుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.ప్రధానంగా సోమవారం ఉదయాత్పూర్వం దుర్ఘటన జరిగిన చోట ఓ భారీ హోటల్‌తో పాటు టీషాప్, కేఫ్ ఏర్పాటయ్యాయి. సాధారణంగా జాతీయ రహదారి పక్కన వ్యాపారసంస్థలు నిర్వహించేందుకు సంబంధితశాఖ అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలి. రహదారి నుంచి సుమారు 50 అడుగుల సర్వీసురోడ్డు భాగాన్ని వదిలి అవతలి పక్కన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసుకోవాలి.అది కూడా సంస్థ తరపున రోడ్డు వద్ద ఒక సెక్యూరిటీ గార్డును 24గంటల పాటు విధులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. ఆ సెక్యూరిటీ గార్డు రహదారి నుంచి వ్యాపార సంస్థలోకి వాహనాల రాకపోకలప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షించాలి. వ్యాపార సంస్థ ఎదుట జాతీయ రహదారిపై ఎలాంటి వాహనాలు ఆపిఉంచేందుకు వీలు లేకుండా నిబంధనలు కఠినంగా అమలుచేయాలి. రహదారిలో వాహనాలు ఆపకుండా ఏర్పేడు వద్ద వాహనాలు విశ్రమించేందుకు 500మీటర్లు ప్రత్యేక ప్రదేశాన్ని కేటాయించారు. అదే చోట వాహనదారులు కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు ఆచరించేందుకు ఉచిత సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడికక్కడ జాతీయ రహదారి పక్కన హోటళ్లు, డాబాలు, కేఫ్‌లు, పెట్రోల్‌బంకులు ఏడాదినుంచీ విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఊరందూరు వద్ద శ్రీకాళహస్తి పట్టణానికి ఆనుకుని రహదారి ఉండడంతో దుకాణాలు , హోటళ్లు ఇబ్బడిముబ్బడిగా వచ్చేశాయి. సోమవారం ప్రమాదం జరిగిన స్థలంలో ఇటీవల వరుస దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా అధికారులు ఉదాశీనంగానే వ్యహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.