Share News

విషానికి విరుగుడు.. 108లోనే

ABN , Publish Date - Aug 04 , 2026 | 01:04 AM

పాము కాటు.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. విషపూరిత పాము కాటుకు గురయ్యాక సకాలంలో వైద్యం అందక ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

విషానికి విరుగుడు.. 108లోనే

అంబులెన్స్‌లోనే స్నేక్‌ యాంటీ వీనం

గోల్డెన్‌ అవర్‌లో చికిత్స గ్రామీణులకు వరం

అత్యవసర వైద్యంలో ప్రభుత్వం మరో ముందడుగు

పాము కాటు.. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. విషపూరిత పాము కాటుకు గురయ్యాక సకాలంలో వైద్యం అందక ఏటా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆస్పత్రికి వెళ్లేలోపే విలువైన సమయం వృథా కావడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్‌లలో స్నేక్‌ యాంటీ వీనం (పాము కాటు మందు) అందుబాటులోకి తీసుకొచ్చింది.

- చిత్తూరు రూరల్‌, ఆంధ్రజ్యోతి

ఇప్పటి వరకు పాము కాటుకు గురైన వ్యక్తిని 108 అంబులెన్స్‌లో సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించడం వరకే అత్యవసర సేవలు పరిమితమయ్యేవి. ఆస్పత్రికి చేరాకే చికిత్స అందించేవారు. ఈలోపు శరీరమంతా విషం వ్యాపించి పరిస్థితి విషమించే సందర్భాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు 108 అంబులెన్సులలోనే ప్రభుత్వం స్నేక్‌ యాంటీ వీనం (పాము కాటు మందును) అందుబాటులో ఉంచింది. దీంతో పాము కాటు సమాచారంతో వెంటనే బాధితుడి వద్దకు 108 అంబులెన్సు వస్తుంది. బాధితుడి లక్షణాలు, పాము కాటు జరిగిన సమయం, రక్తపోటు, శ్వాస, గుండె స్పందన తదితర వివరాలను సిబ్బంది 108 కాల్‌సెంటర్‌లోని వైద్యులకు తెలియజేస్తారు. వారిచ్చే సూచనల మేరకు బాధితుడికి స్నేక్‌ యాంటీ వీనం ఇవ్వడంతో పాటు ఇతర చికిత్సనూ ప్రారంభిస్తారు. అదే సమయంలో సమీప ప్రభుత్వాస్పత్రికీ తరలిస్తారు. ఇలా గోల్డెన్‌ అవర్‌లో బాధితులకు వైద్యం అందించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు.

జిల్లాకు ఎంతో ఉపయోగం

జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. వర్షాకాలంలో రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు, గ్రామీణ ప్రజలు ఎక్కువగా పాముకాటుకు గురవుతుంటారు. అనేక గ్రామాల నుంచి సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు చేరుకోవడానికి గంటకుపైగా సమయం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంబులెన్సులోనే చికిత్స ప్రారంభం కావడం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని వైద్యులు భావిస్తున్నారు. జిల్లాలో ఏడాదికి సుమారు 531 పాము కాటు ఘటనలు నమోదవుతుండగా.. సుమారు మూడు మరణాలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ‘ఆఫ్‌ది రికార్డు’గా ఇంకొన్ని ఘటనలూ ఉండొచ్చు.

ప్రజల్లో అవగాహన అవసరం

పాము కాటు వేయగానే ప్రజలు మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా వెంటనే 108కు సమాచారం ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. గాయాన్ని కోయడం, విషాన్ని నోటితో పీల్చడం, గట్టిగా తాడు కట్టడం వంటి చర్యలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. బాధితుడిని ప్రశాంతంగా ఉంచి.. వీలైనంత తక్కువ కదిలిస్తూ 108 సిబ్బందికి అప్పగిస్తే సకాలంలో చికిత్స అందే అవకాశం ఉంటుంది.

Updated Date - Aug 04 , 2026 | 01:04 AM