Share News

‘స్థానిక’ ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగరాలి

ABN , Publish Date - Jun 20 , 2026 | 02:30 AM

ఈ రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో జిల్లాకు సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్‌ కాలేజీ ఆవరణలో శుక్రవారం జరిగిన రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

‘స్థానిక’ ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగరాలి
విజయోత్సవ సభలో ప్రసంగిస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, వేదికపై ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, నేతలు తదితరులు రెండేళ్లు.. రూ.4 వేల కోట్లు

ఇదీ జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం

విజయోత్సవ సభలో ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి

చిత్తూరు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఈ రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో జిల్లాకు సంక్షేమం, అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. చిత్తూరు నగరంలోని పీవీకేఎన్‌ కాలేజీ ఆవరణలో శుక్రవారం జరిగిన రెండేళ్ల పాలన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ‘కుప్పానికి కృష్ణాజలాలను తెచ్చిన ఘనత చంద్రబాబుది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగరాలి. వార్డు నుంచి నుంచి జడ్పీ చైర్మన్‌ వరకు అన్ని స్థాయిల్లోనూ గెలిస్తేనే అభివృద్ధికి ఆటంకం లేకుండా ఉంటుంది. ఈ 30 రోజులు అందరూ కష్టపడి ‘సర్‌’ను విజయవంతం చేయండి. జిల్లా అభివృద్ధిలో అధికార యంత్రాంగం కృషికి అభినందనలు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ వల్ల చిత్తూరు సభకు మహిళలు పెద్దఎత్తున వచ్చారు. అన్నమయ్య జిల్లా సభ కంటే ఇక్కడే విజయవంతమైంది’ అని అన్నారు. ‘2019లో ప్రభుత్వం మారడంతోనే అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు చాటి చెబుతూ, ఇది కొనసాగాలంటే మళ్లీ కూటమి గెలవాల్సిన ఆవశ్యకతను వివరించాలి’ అని శ్రేణులకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. మామిడి రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కనుకే సీఎం చంద్రబాబు ఇప్పుడూ రూ.4 ప్రోత్సాహకం ప్రకటించారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ పేర్కొన్నారు. నగరంలోని గాంధీ రోడ్డు తరహాలో హైరోడ్డునూ అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రెండేళ్లలో పూతలపట్టు నియోజకవర్గ అభివృద్ధికి రూ.790 కోట్లు, సంక్షేమానికి రూ.293 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని ఎమ్మెల్యే మురళీమోహన్‌ వివరించారు. వైసీపీ పాలనలో మామిడి రైతులను ఒక్కసారి కూడా ఆదుకోలేదని, కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలవడంతో బంగారుపాళ్యంలోని వైసీపీ నాయకుడైన ఓ మామిడి రైతుకు గతేడాది సబ్సిడీ కింద రూ.6 లక్షలు వచ్చిందని గుర్తుచేశారు. మహిళలకు అనుకూలంగా అన్ని పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని టీడీపీ చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు షణ్ముగరెడ్డి అన్నారు. మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి చొరవ తీసుకుని జిల్లాకు మరిన్ని బస్సులు తేవాలని కోరారు. వైసీపీ హయాంలో మంత్రులు బూతులు మాట్లాడితే.. ఇప్పుడు మంత్రులు తమ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి చెబుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌ అన్నారు. తోతాపురి మామిడి రైతుల పక్షాన సీఎం నిలబడి ఆదుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి అభినందించారు. మహిళలకు చంద్రబాబు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తుంటే, విద్రోహ శక్తులు ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత విమర్శించారు. రూ.4 సబ్సిడీతో మామిడి రైతులకు మేలు కలుగుతుందని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అభిప్రాయపడ్డారు. చేసిన పనులు చెప్పుకోలేక 2019లో ఓడామని, ఇప్పుడా తప్పు చేయకండా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం కోరారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూటమి పార్టీలు కలిసే ఉంటాయని పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేష్‌ తెలిపారు. తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్‌కుమార్‌, మాల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యుగంధర్‌, జనసేన నేత శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడారు.

మెగా చెక్కుల పంపిణీ

విజయోత్సవ సభ అనంతరం డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు మెగా చెక్కులు పంపిణీ చేశారు. వేదిక మీద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. సభకు ముందే మంత్రి సహా ప్రముఖులు స్టాళ్లను పరిశీలించారు. వైద్య శిబిరంలో పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కోఆర్డినేటర్‌ దామచర్ల సత్య, జేసీ ఆదర్శ రాజేంద్రన్‌, టీడీపీ నాయకులు కాజూరు బాలాజీ, వెంకటేష్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌, ఏఎస్‌ మనోహర్‌, ఆర్‌ గాంధీ, కార్జాల అరుణ, త్యాగరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతగా పనిచేశాం

ప్రజల పట్ల, వారి సమస్యల పట్ల ఈ రెండేళ్లు బాధ్యతగా పనిచేశాం. సుమారు 75 వేల అర్జీలు వస్తే చాలావరకు పరిష్కరించాం. ఈ ఏడాది కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా పనిచేస్తాం. జిల్లాలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది.

- కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

నాకు రూ.39 వేలు వచ్చాయి

నా పేరు ప్రియాంక. నాకు ముగ్గురు పిల్లలు. చిత్తూరు గవర్న్‌మెంటు స్కూల్‌లో చదువుకుంటున్న వారికి తల్లికి వందనం కింద రూ.13 వేల చొప్పున రూ.39 వేలు జమయ్యాయి. ఇంకా స్కూల్‌లో మధ్యాహ్న భోజనంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తుండడంతో పిల్లలు బాగా చదువుకుంటున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 02:30 AM