Share News

కూటమి హవా

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:42 AM

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు వైసీపీ అభ్యర్థి వాసుదేవ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. తొలి రౌండ్‌ నుంచే జేబీ శ్రీనివాస్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్ళారు. జేబీ శ్రీనివాస్‌ 94937 ఓట్లు పొందగా, వైసీపీ అభ్యర్థి కేవలం 33355 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. జేబీ ఏకంగా 61712 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్నందుకున్నారు.

 కూటమి హవా
నాయుడుపేటలో కౌంటింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

  • మున్సిపల్‌ ఎన్నికల్లో మూడు పార్టీల జయభేరి

  • ఒక ఛైర్మన్‌, 27 వార్డు స్థానాలకే వైసీపీ పరిమితం

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘనవిజయం సాధించాయి. ఒక కార్పొరేషన్‌, నాలుగు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో తిరుపతితో పాటు పుత్తూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి మున్సిపాలిటీలలో భారీ విజయాలతో సత్తా చాటాయి. నాయుడుపేట మున్సిపాలిటీలో మాత్రం టీడీపీ వర్గ విభేదాల కారణంగా ఛైర్మన్‌ స్థానాన్ని కోల్పోయింది. తిరుపతి మేయర్‌, పుత్తూరు, సూళ్ళూరుపేట, పుత్తూరు ఛైర్మన్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యతలు సాధించగా నాయుడుపేటలో వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే అక్కడ వార్డుల్లో మాత్రం కూటమి పట్టు నిలుపుకొంది.

తిరుపతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. మేయర్‌ అభ్యర్థి జేబీ శ్రీనివాస్‌కు వైసీపీ అభ్యర్థి వాసుదేవ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. తొలి రౌండ్‌ నుంచే జేబీ శ్రీనివాస్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్ళారు. జేబీ శ్రీనివాస్‌ 94937 ఓట్లు పొందగా, వైసీపీ అభ్యర్థి కేవలం 33355 ఓట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. జేబీ ఏకంగా 61712 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్నందుకున్నారు. నగరంలో 66 డివిజన్లుండగా 2 టీడీపీకి ఏకగ్రీవమయ్యాయి. మిగతా 64 స్థానాలకు ఎన్నికలు జరగగా టీడీపీ 36, జనసేన 19, బీజేపీ 3 చొప్పున మొత్తం 58 స్థానాలు సాధించాయి. ఏకగ్రీవాలతో కలిపి కూటమి మొత్తం 60 స్థానాలు గెలుచుకుంది. మిగతా 6 డివిజన్లలో వైసీపీ 3గెలుచుకోగా, ఇండిపెండెంట్లు ముగ్గురు గెలిచారు. ఆ ఇండిపెండెంట్లు కూడా టీడీపీ, జనసేన రెబల్సే కావడం విశేషం. దీంతో 66 డివిజన్లున్న తిరుపతిలో వైసీపీ కేవలం 3 డివిజన్లకు పరిమితమైంది. కూటమిలో టీడీపీ 39 డివిజన్లకు పోటీ చేసి 38, జనసేన 22 డివిజన్లకు పోటీచేసి 19, బీజేపీ 5 చోట్ల పోటీచేసి 3 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించాయి. బీజేపీ నుంచీ ఓటమి చవిచూసిన కూటమి అభ్యర్థుల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్‌, జనసేన ముఖ్యనేత ఆకేపాటి సుభాషిణి వంటివారుండడం గమనార్హం.

వెంకటగిరిలో విజయకేతనం!

వెంకటగిరిలో ఛైర్‌పర్సన్‌ స్థానం సహా 32 వార్డులు కూటమి వశమయ్యాయి. ఛైర్‌పర్సన్‌ స్థానానికి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి దొంతు శారదకు 20,256 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి బొలిగల దీవెనకు 9620 ఓట్లు వచ్చాయి.మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులుండగా 32 చోట్ల పోటీ చేసిన టీడీపీ 29 వార్డులు, 2 చోట్ల పోటీ చేసిన జనసేన ఒక వార్డు, 2 చోట్ల బరిలో నిలిచిన బీజేపీ ఆ రెండు వార్డులు చొప్పున గెలుచుకున్నాయి. వైసీపీ కేవలం 4 వార్డులకే పరిమితమైంది. వైసీపీ గెలిచిన నాలుగింటిలో 11 ఓట్ల మెజారిటీతో ఒక వార్డు, 45 ఓట్ల మెజారిటీతో ఒక వార్డు, వంద ఓట్ల మెజారిటీతో మరో వార్డు చొప్పున వున్నాయి. కేవలం ఒక వార్డులోనే 311 ఓట్ల మెజారిటీ వచ్చింది. కాగా 22వ వార్డులో జనసేన అభ్యర్థి రాధమ్మపై వైసీపీ అభ్యర్థి ఇందిరమ్మకు తొలుత 18 ఓట్ల మెజారిటీ వచ్చింది. జనసేన అభ్యర్థి డిమాండ్‌ మేరకు రీ కౌంటింగ్‌ జరపగా వైసీపీ అభ్యర్థి ఆధిక్యత 11 ఓట్లకు తగ్గింది. జనసేన అభ్యర్థి మళ్ళీ రీ కౌంటింగ్‌కు పట్టుబట్టడంతో రెండు సార్లు రీ కౌంటింగ్‌ జరిపారు. మొత్తంగా మూడు సార్లు రీకౌంటింగ్‌ చేసినా ఫలితం మారలేదు. వైసీపీ అభ్యర్థి 11 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడి 36 వార్డులకు గానూ 17వ వార్డులో టీడీపీ అభ్యర్థి నిర్మల అత్యధికంగా 706 ఓట్ల మెజారిటీ సాధించగా 22వ వార్డు వైసీపీ అభ్యర్థి ఇందిరమ్మ 11 ఓట్ల అత్యల్ప మెజారిటీ సాధించారు.

సూళ్ళూరుపేటలో సునామీ

సూళ్ళూరుపేటలో ఛైర్‌పర్సన్‌ స్థానంతో పాటు 32 వార్డులకు గానూ 29 స్థానాలను కూటమి గెలుపొందింది. వైసీపీ కేవలం 3 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి పిట్ల సుహాసిని వైసీపీ అభ్యర్థి మోడి విమలకుమారిపై 8728 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 32 వార్డుల్లో టీడీపీ ముందే రెండింటిని ఏకగ్రీవం చేసుకోగా ఎన్నికల్లో 24 వార్డులు గెలిచింది.జనసేనకు ఒకటి, బీజేపీకి 2 చొప్పున మొత్తం కూటమి పార్టీలకు 29 వార్డులు దక్కాయి. కూటమి సర్దుబాట్లలో భాగంగా టీడీపీకి 29 వార్డులు కేటాయించగా అందులో 26 గెలుచుకుంది. జనసేన, బీజేపీ తమకు కేటాయించిన మేరకు 1, 2 చొప్పున వార్డుల్లో గెలిచాయి. కాగా ఇక్కడ 9 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు 300 పైగా ఓట్ల మెజారిటీ సాధించడం విశేషం. 13వ వార్డు టీడీపీ అభ్యర్థి చేనిగుంట సురేష్‌ వైసీపీ పేర్నాటి చంద్రశేఖర్‌ మీద 600 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలవగా 1వ వార్డులో టీడీపీ అభ్యర్థి పోలిరెడ్డి శ్రీలక్ష్మి వైసీపీ అభ్యర్థి పూడి సుహాసినిపై 10 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలిచారు.

పుత్తూరులో ఘనవిజయం

పుత్తూరు మున్సిపాలిటీలో ఛైర్మన్‌ స్థానంతో పాటు 36 వార్డుల్లో 32 వార్డులను గెలుచుకోవడం ద్వారా కూటమి పార్టీలు ఘన విజయం సాధించాయి. ఛైర్మన్‌ సీటును కూటమిలో జనసేనకు కేటాయించగా ఆ పార్టీ అభ్యర్థి ఏలుమలై అలియాస్‌ అమ్ములు వైసీపీ అభ్యర్థి జయప్రకాష్‌పై 10,213 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మొత్తం 36 వార్డులుండగా టీడీపీకి 33 సీట్లు కేటాయించారు. ఒక చోట ఏకగ్రీవంగా గెలిచిన టీడీపీ 32 చోట్ల పోటీ చేసి 29 చోట్ల గెలిచింది. మొత్తంగా 30 వార్డులు సాధించింది. జనసేన మూడు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిచింది. కూటమి మొత్తం 32 వార్డులు గెలుచుకోగా వైసీపీ 4 వార్డులకు పరిమితమైంది.

కూటమి చేజారిన నాయుడుపేట పీఠం

తెలుగుదేశం పార్టీ వర్గపోరు కారణంగా నాయుడుపేట మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని చేజార్చుకుంది. అయితే వార్డుల్లో మాత్రం మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటుకుంది. ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నడుమ హోరాహోరీ పోరు జరిగింది. అయితే టీడీపీలో వర్గ విభేదాలు వైసీపీకి కలసివచ్చాయి. చివరి రౌండ్‌లో వైసీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1445 ఓట్ల ఆధిక్యత వద్ద వుండగా టీడీపీ అభ్యర్థి షేక్‌ షాకీరా అభ్యంతరంతో ఓట్ల లెక్కింపు ఆగిపోయింది. రీ కౌంటింగ్‌తో వైౖసీపీ అభ్యర్థిమెజారిటీ 1295కు తగ్గింది. మిగిలిన 1340 ఓట్లు లెక్కించడంతో వైసీపీ అభ్యర్థికి 1187 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఆ దశలో టీడీపీ అభ్యర్థి, ఏజెంట్లు మొత్తం ఓట్లు రీకౌంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ ద్వారా ఎస్‌ఈసీకి సమాచారం అందడం, రీ కౌంటింగ్‌కు ఎస్‌ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో అధికారులు వైసీపీ అభ్యర్థి గెలుపొందినట్టు ప్రకటించారు. కాగా ఇక్కడ 32 వార్డులుండగా టీడీపీ 27 చోట్ల పోటీ చేసి 14 వార్డులను, బీజేపీ పోటీ చేసిన నాలుగు వార్డులనూ గెలుచుకోవడం ద్వారా కూటమి 18 వార్డులను కైవసం చేసుకుంది. వైసీపీ 13 వార్డుల్లో గెలుపొందగా జనసేన రెబల్‌ ఒక వార్డులో విజయం సాధించారు. కాగా 2వ వార్డు వైసీపీ అభ్యర్థి మాధవి తొలుత 3 ఓట్ల తేడాతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. రీ కౌంటింగ్‌ నిర్వహించగా ఈసారి టీడీపీ అభ్యర్థి పసల వాణి 6 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ మున్సిపాలిటీలో 7వ వార్డులో వైసీపీ మరియమ్మ 418 ఓట్ల అత్యధిక మెజారిటీ సాధించగా 6వ వార్డులో టీడీపీ అభ్యర్థి వంశీకృష్ణ 4 ఓట్ల అత్యల్ప మెజారిటీ సాధించారు. కాగా ఇక్కడ మొత్తం 9 మంది అభ్యర్థులు 50 ఓట్ల లోపు తేడాతో గెలవడం గమనార్హం. 2వ వార్డు టీడీపీ అభ్యర్థి పసల వాణి 6 ఓట్లు, 17వ వార్డు వైసీపీ అభ్యర్థి షేక్‌ షబ్బీర్‌ 11 ఓట్లు, 22వ వార్డు వైసీపీ అభ్యర్థి రవి 27 ఓట్లు, 23వ వార్డు వైసీపీ అభ్యర్థి మురళి 23 ఓట్లు, 25వ వార్డు వైసీపీ అభ్యర్థి మాధవి 28 ఓట్లు, 30వ వార్డు టీడీపీ అభ్యర్థి బబిత 35 ఓట్లు, 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి సువర్ణ 40 ఓట్లు, 15వ వార్డు జనసేన రెబల్‌ సతీష్‌ కుమార్‌ 40 ఓట్లు చొప్పున మెజారిటీలతో విజయం సాధించడం విశేషం.

ఉత్కంఠభరితంగా నాయుడుపేట కౌంటింగ్‌

నాయుడుపేట మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. టీడీపీ, వైసీపీ నడుమ నువ్వా నేనా అన్నతీరులో పోటీ నెలకొంది. మొత్తం 32 వార్డుల్లో 13 వార్డులు వైసీపీ గెలవడం జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మిగిలిన మున్సిపాలిటీలలో టీడీపీ కూటమి పార్టీలు ఏకపక్ష విజయాలు సాధిస్తుంటే నాయుడుపేటలో భిన్నమైన పరిస్థితి నెలకొనడం టీడీపీ వర్గాలకు మింగుడుపడలేదు. ఇక ఛైర్‌పర్సన్‌ స్థానానికి తొలి రెండు రౌండ్లు వైసీపీ అభ్యర్థికి మెజారిటీ రావడం టీడీపీ వర్గీయులను కుంగదీసింది. మూడో రౌండ్‌లో టీడీపీకి స్వల్ప ఆధిక్యత వచ్చినా చివరిదైన నాలుగో రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి 1187 ఓట్ల మెజారిటీతో గెలుపునందుకున్నారు. ఈ మధ్యలో అటు టీడీపీ వర్గీయులు రీ కౌంటింగ్‌కు పట్టుబట్టడం, కౌంటింగ్‌ ఆలస్యం కావడం వంటి పరిణామాలతో వైసీపీ వర్గాల్లో అనుమానాలు తలెత్తాయి. దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సహా పలువురు నేతలు, కార్యకర్తలు కౌంటింగ్‌ సెంటర్‌ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. చివరికి పోలీసులు మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఛైర్మన్‌ పదవిని కోల్పోయినా 32 వార్డుల్లో టీడీపీ 14, బీజేపీ 4 చొప్పున 18 సాధించడం ద్వారా కూటమి ఎంతోకొంత ప్రతిష్టను కాపాడుకున్నట్టయింది.

Updated Date - Nov 04 , 2026 | 02:42 AM