పరిషత్ ఎన్నికల్లోనూ కూటమి ప్రతాపం!
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:10 AM
పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రతాపం చూపించాయి.మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని నామమాత్రపు స్థాయికి నెట్టేశాయి. కూటమి, ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి కలిపి మొత్తం 35 జడ్పీటీసీ స్థానాల్లో 29 గెలిచి రికార్డు సృష్టించాయి
డీఎస్సీ2712,2740
పరిషత్ ఎన్నికల్లోనూ
కూటమి ప్రతాపం!
-35 జడ్పీటీసీల్లో కూటమికి 28... వైసీపీకి 6
-గెలిచిన ఇండిపెండెంట్ సైతం టీడీపీ రెబలే
-సీఎం సొంత సెగ్మెంట్లో వైసీపీకి 3 స్థానాలు
444 ఎంపీటీసీలలో కూటమికి 344... వైసీపీకి 86.. ఇతరులకు 14
7 మండలాల్లో కూటమి క్లీన్ స్వీప్
మరో 7 చోట్ల వైసీపీకి సింగిల్ డిజిట్ స్థానాలు
వెంకటగిరి, కేవీబీపురాల్లో టీడీపీ, వైసీపీకి చెరిసగం
పెనగలూరు, పుల్లంపేటల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు
తిరుపతి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):పరిషత్ ఎన్నికల్లో కూటమి పార్టీలు మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రతాపం చూపించాయి.మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని నామమాత్రపు స్థాయికి నెట్టేశాయి. కూటమి, ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు అభ్యర్థి కలిపి మొత్తం 35 జడ్పీటీసీ స్థానాల్లో 29 గెలిచి రికార్డు సృష్టించాయి. 35 స్థానాల్లో తొలుత నామినేషన్ల సమయంలోనే 4 స్థానాలను టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా మిగిలిన 31 స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అందులో టీడీపీ 21, జనసేన 1, బీజేపీ 2 చొప్పున 24 స్థానాలు గెలిచాయి. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 25 స్థానాలను కైవసం చేసుకుంది. ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే 444 స్థానాల్లో 142 ఏకగ్రీవమయ్యాయి. అందులో టీడీపీ 125, జనసేన 9, బీజేపీ 5 చొప్పున కూటమిగా 139 స్థానాలు కైవసం చేసుకున్నాయి. వైసీపీకి కేవలం ఒక్కటే దక్కింది. ఎన్నికలు జరిగిన 302లో కూడా టీడీపీ 185, జనసేన 22, బీజేపీ 5 చొప్పున కూటమి పార్టీలు 205 స్థానాలను దక్కించు కున్నాయి. ఇక్కడ కూడా వైసీపీ 85స్థానాలకు పరిమితమైంది. మొత్తంగా తీసుకుంటే కూటమి పార్టీలు 344 స్థానాలు గెలవగా వైసీపీ 86 వద్దే ఆగిపోయింది. వైసీపీ సీట్ల కంటే కూటమికి నాలుగు రెట్లకు పైగా అధిక స్థానాలు రావడం గమనార్హం.
ఏడు మండలాల్లో కూటమి క్లీన్ స్వీప్
జిల్లాలోని ఏడు మండలాల్లో కూటమి పార్టీలు వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా క్లీన్ స్వీప్ చేయడం విశేషం. నాగలాపురంలో మొత్తం 10, పాకాలలో మొత్తం 16, పుత్తూరులో మొత్తం 7, రేణిగుంటలో మొత్తం 21, శ్రీకాళహస్తిలో మొత్తం 15, తడలో మొత్తం 13, ఏర్పేడులో మొత్తం 16 చొప్పున ఎంపీటీసీ స్థానాలను అన్నింటినీ కూటమి పార్టీలే గెలుచుకుని వైసీపీకి ఉనికి లేకుండా చేశాయి. ఈ మండలాల్లో మండల పరిషత్‌లలో వైసీపీకి సభ్యత్వమే లేకుండా పోయింది.
ఏడు మండలాల్లో వైసీపీకి సింగిల్ డిజిట్
ఏడు మండలాల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. ఎర్రావారిపాలెంలో 8 ఎంపీటీసీలు, తొట్టంబేడులో 12, సూళ్ళూరుపేటలో 9, సత్యవేడులో 15, డక్కిలిలో 12, దొరవారిసత్రంలో 10, బాలాయపల్లిలో 10 చొప్పున ఎంపీటీసీ స్థానాలుండగా ఈ అన్నిచోట్లా వైసీపీ ఒక్కొక్క సీటు మాత్రమే గెలుచుకుని సింగిల్ సీట్లకు పరిమితమైంది.
రెండు చోట్ల సగంసగం
వెంకటగిరిలో 8 ఎంపీటీసీలకు గానూ టీడీపీ నాలుగు, వైసీపీ నాలుగు చొప్పున చెరి సగం సీట్లు గెలుచుకున్నాయి. అలాగే కేవీబీపురం మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలుండగా టీడీపీ 6, వైసీపీ 6 చొప్పున గెలుచుకున్నాయి. ఈ రెండు మండలాల్లో ఎంపీపీ పదవులకు ఎన్నికలు సంక్లిష్టంగా మారనున్నాయి. దీంతో కూటమి పార్టీలు వైసీపీ ఎంపీటీసీలలో ఒకరిద్దరిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. కాగా పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో మాత్రమే వైసీపీ ఎంపీపీ పదవులను దక్కించుకునే స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోగలిగింది. పెనగలూరులో మొత్తం 11 ఎంపీటీసీలకు గానూ ఆ పార్టీ ఏడు స్థానాలు గెలుచుకోగా పుల్లంపేటలో 11 స్థానాలకు గానూ ఆరు స్థానాలు గెలుచుకుంది. ఈ రెండు మండలాల్లో కూటమి పార్టీల నేతలు వైసీపీ ఎంపీటీసీలను తమవైపు తిప్పుకోకుండా చూసేందుకు వైసీపీ నేతలు క్యాంపు రాజకీయాలకు తెర లేపారు.
చంద్రగిరిలో టీడీపీకి చేదు అనుభవం
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో మొత్తం ఆరు మండలాలు వున్నాయి. అందులో చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం జడ్పీటీసీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. మిగిలిన తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం జడ్పీటీసీ స్థానాలు టీడీపీ చేజార్చుకుంది. వీటిలో తిరుపతి రూరల్ స్థానాన్ని కోల్పోవడం పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి పోటీ చేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇక్కడి ఎన్నికల్లో చెవిరెడ్డి కొడుకు స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అలాగే చిన్నగొట్టిగల్లు జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించగా ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి దేవర మనోహర్‌కు టికెట్ దక్కింది. కూటమి పార్టీల నుంచీ సహకారం అందకపోవడం, వైసీపీ అభ్యర్థి బలమైన వ్యక్తి కావడం వంటి కారణాలతోనే ఇక్కడ ఓటమి ఎదురైందని సమాచారం.అలాగే ఎర్రావారిపాలెంలో కూడా వైసీపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది. టీడీపీ వర్గాలు సరైన పోటీ ఇవ్వలేకపోయారు. వాస్తవానికి ఈ మూడు మండలాల్లో కూడా టీడీపీ బలంగా వుంది. ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ విషయం స్పష్టంగా వెల్లడైంది. అయితే జడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే సరికి ఫలితాలు తారుమారయ్యాయి. వైసీపీ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపిన మండలాల్లో వారిని ఎదుర్కొనేందుకు తగిన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే అధినేత సొంత నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలను చేజార్చుకోవడానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. పులివెందులతో సహా రాష్ట్రవ్యాప్తంగా సునామీ తరహా విజయాలను అందుకుంటున్న టీడీపీకి అధినేత సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో అక్కడి టీడీపీ నేతలు వైసీపీకి చేజేతులారా బలమైన ఆయుధాన్ని అందించినట్టయిందని ఆ పార్టీ వర్గాలు వాపోతున్నాయి.
రైల్వేకోడూరులో కూటమికి చేటు తెచ్చిన నిర్ణయాలు
రైల్వే కోడూరులో అభ్యర్థులను ఖరారు చేయడంలో కూటమి తీసుకున్న నిర్ణయాలే దానికి చేటు తెచ్చాయని సమాచారం. ఈ నియోజకవర్గంలో కూడా చంద్రగిరి తరహాలోనే మూడు జడ్పీటీసీ స్థానాలను కూటమి కోల్పోయింది. రైల్వేకోడూరు, చిట్వేలి రెండు జడ్పీటీసీ స్థానాలను కూటమిలో జనసేనకు కేటాయించారు. రైల్వే కోడూరులో జనసేన, వైసీపీ అభ్యర్థులిరువురూ బలిజ సామాజికవర్గానికి చెందిన వారే. అయితే కూటమి అభ్యర్థిపై ఆ వర్గంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని, భారీగా క్రాస్ ఓటింగ్ జరగడంతోనే ఓటమి పాలైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక చిట్వేలి విషయానికొస్తే అక్కడ తొలుత జడ్పీటీసీ స్థానం టీడీపీకి కేటాయించారు. బలమైన నేత రాజుగుంట నరసింహ నామినేషన్ వేశారు. చివరి నిమిషంలో అతడిని కాదని కూటమి ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించింది. దీంతో నరసింహ ఇండిపెండెంట్‌గా పోటీలో కొనసాగి వైసీపీ అభ్యర్థిపై 137 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనసేన అభ్యర్థి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయారు. గెలిచిన ఇండిపెండెంట్ నరసింహకు 6444 ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 6307 ఓట్లు, మరో టీడీపీ రెబెల్‌కు 6070 ఓట్లు చొప్పున రాగా జనసేన అభ్యర్థికి కేవలం 1935 ఓట్లు రావడం గమనార్హం.ఇక పెనగలూరు జడ్పీటీసీ స్థానం విషయానికొస్తే ఆ మండలంలో టీడీపీకి బలమైన నాయకత్వం లేదు. దీంతో వైసీపీ నేతలు మండలాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. ఎన్నికల్లో జడ్పీటీసీ స్థానంతో పాటు మెజారిటీ ఎంపీటీసీ స్థానాలు కూడా గెలుచుకున్నారు.