Share News

భక్తులకు వసతి కల్పనే లక్ష్యం: మంత్రి

ABN , Publish Date - May 22 , 2026 | 01:35 AM

ఆలయాలకు విచ్చేసే భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. కాణిపాకంలోని వినాయక సదన్‌ వసతి గృహంపై 2, 3 అంతస్తులను గురువారం ఆయన ప్రారంభించారు.

భక్తులకు వసతి కల్పనే లక్ష్యం: మంత్రి
వినాయక సదన్‌లో రెండు,మూడు అంతస్తులను ప్రారంభిస్తున్న మంత్రి ఆనం

ఐరాల(కాణిపాకం), మే 21 (ఆంధ్రజ్యోతి): ఆలయాలకు విచ్చేసే భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వసతి కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. కాణిపాకంలోని వినాయక సదన్‌ వసతి గృహంపై 2, 3 అంతస్తులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.14.74 కోట్లతో వినాయక సదన్‌లో ఆధునాతన వసతులతో భక్తులకు వసతిని అందుబాటులోకి తెచ్చారన్నారు. ఇందులో రూ.2.10 కోట్లతో ఫర్నిచర్‌, పడకలు, సోఫాలు, డైనింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రతి గదిలో స్వామి ఫొటో పెట్టడం బావుందన్నారు. త్వరలో కాణిపాకంలో పుష్కరిణి మార్పిడి పనులకు రూ.3 కోట్లు, బస్టాండ్‌ నిర్మాణానికి రూ.16 కోట్లు, డోనర్‌ గెస్టు హౌస్‌కు రూ.4 కోట్లతో పనులకు త్వరలో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్లు వివరించారు. అర్ధగిరి, మొగిలి ఆలయాలను టూరిజం హబ్‌గా అభివృద్ధి పరచడానికి ప్రణాళికలను అమలు చేస్తామన్నారు. పూతలట్టు నియోజకవర్గంలోని అరగొండ చౌడేశ్వరి ఆలయాన్ని అపోలో, దాతలు, దేవదాయశాఖ సహకారంతో అభివృద్ధి చేయడానికి త్వరలో పనులు చేపడతామన్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయకస్వామిని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, గురజాలజగన్మోహన్‌, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌, జడ్పీటీసీ సుచిత్ర, తిరుపతి ఆర్జేసీ చంద్రశేఖర్‌ఆజాద్‌, కర్నూల్‌ డీసీ గురుప్రసాద్‌, చిత్తూరు ఏసీ చిట్టెమ్మ, బోర్డు సభ్యులు నాగరాజునాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సతీష్‌, నరేష్‌, శివప్రసాద్‌, చంద్రకళ, సంధ్యారాణితో పాటు నేతలు హరిబాబునాయుడు, లత, మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2026 | 01:35 AM