అదిగదిగో ఫ్లెమింగో..!
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:32 AM
సందర్శకులు, పర్యాటకులతో పులికాట్ సరస్సు పులకించింది. సూళ్లూరుపేట కేంద్రంగా నిర్వహిస్తున్న జరుగుతున్న పక్షుల పండుగ రెండవ రోజు ఆదివారం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెలవుదినం కావడంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.
రెండో రోజు పక్షుల పండుగకు తరలివచ్చిన సందర్శకులు
తడ/సూళ్లూరుపేట/దొరవారిసత్రం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
సందర్శకులు, పర్యాటకులతో పులికాట్ సరస్సు పులకించింది. సూళ్లూరుపేట కేంద్రంగా నిర్వహిస్తున్న జరుగుతున్న పక్షుల పండుగ రెండవ రోజు ఆదివారం జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెలవుదినం కావడంతో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల కేంద్రం వద్ద చలి, ఉదయం 11 గంటల సమయంలో మోస్తరు వర్షం కురవడంతో మధ్యాహ్నం వరకు సందర్శకులు తక్కువగా ఉన్నారు. ఆ తర్వాత భారీగా వచ్చారు. మంచి నీటి చెరువుల్లో విడిదిలో ఉన్న విహంగాలను వీక్షించారు. సినీ నటుడు మంచు విష్ణు కుటుంబంతో సందర్శకులతో కలసిపోయి పక్షులను వీక్షించారు. అదిగదిగో ఫ్లెమింగో, ఆ పక్షులు బాగున్నాయి కదూ అంటూ సందర్శకులు బైనాక్యులర్లతో చూస్తూ మాట్లాడుకున్నారు. సెల్ఫీలు దిగారు.
ఫ తడ మండలం భీములవారిపాళెం పడవలరేవు లో బోటు షికారుకు జనం తరలివచ్చారు. అలల ఉధ్రుతి ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం తర్వాత ఇరకం దీవికి బోట్లు ఆపేశారు. ఇక, వచ్చిన వాళ్లంతా బోటు షికారు చేయలేక నిరాశతో వెనుదిరిగారు.
ఫ అటకానితిప్ప వద్ద పులికాట్ సరస్సులో పక్షుల విన్యాసాలను తిలకించేందుకు జనం పొటీపడ్డారు. ప్రత్యేక బస్సులతోపాటు ఆర్టీసీ సైతం నేలపట్టు, భీములవారిపాళెంలకు బస్సులను నడిపింది. అవీ చాలకపోవడంతో కొంతమంది ఆటోలను ఆశ్రయించారు.
ఫ సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో స్టాళ్ల సందర్శనకు విద్యార్థులు, సందర్శకులు తరలి వచ్చారు. ఉదయం నుంచే మైదానంలో సభా వేదికపై నిర్వహించిన నృత్య ప్రదర్శనలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చిన వాళ్లు చెంగాళమ్మను అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కళాశాల మైదానంలో నిర్వహించిన కబడ్డీ, వాలీబాల్ పోటీలలో విజేతలకు శాప్ చైర్మన్ రవినాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ బహుమతులను ప్రదానం చేశారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు జనం పోటెత్తారు. నటీమణులు డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హాజరై.. కళాకారులతో కలిసి సరదాగా నృత్యాలు చేశారు.
శ్రీసిటీ నుంచి విహంగ వీక్షణం
ఫ్లెమింగో ఫెస్టివల్‌లో శ్రీసిటీ నుంచి హెలిక్యాప్టర్ రైడ్ (విహంగవీక్షణ) ఏర్పాటు చేశారు. శ్రీసిటీ నుంచి బయలుదేరి పులికాట్, శ్రీహరికోట, సూళ్ళూరుపేట, అటకానితిప్ప తదితర ప్రాంతాల మీదుగా శ్రీసిటీకి చేర్చారు. విహంగ వీక్షణకు రూ.4,500 ధర నిర్ణయించినట్లు తెలిసింది. కొన్ని సాంఘి సంక్షేమ హాస్టళ్లలోని కొందరు విద్యార్థులకు హెలికాప్టర్‌లో ఉచిత అవకాశాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ కల్పించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, బీజేపీ నేత వాకాటి నారాయణరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి హెలికాప్టర్ రైడ్‌ను ప్రారంభించారు.