ఆ పల్లె కన్నీరుపెడుతోంది..
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:53 AM
పేయలవానిపెంటలో ఉపాధి కరువు గ్రామం వదిలి వలసెళ్లిన జనం నేటికి కనీస వసతుల్లేవు శిథిలమైన గృహాలు...బీళ్లుగా భూములు
ములకలచెరువు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): అది మారుమూల గ్రామం... కొండలు, పచ్చని చెట్ల మధ్య ఉన్న అందమైన ఊరు... ఉపాధి లేని గ్రామం... భూములున్నా బోర్లు వేసుకుని సాగుచేసే స్థోమత లేదు... ఫలితంగా భూములన్నీ బీడుగా దర్శనమిస్తున్నాయి... ఉపాధి కరువై సగం ఊరు ఖాళీ అయ్యింది... బతుకు దేవుడా అంటూ పట్టణాలకు వలసెళ్లారు... ఏ వైపు చూసినా శిథిలమైన, తాళాలు పడ్డ ఇళ్లే కనపడుతున్నాయి... ఇళ్ల వద్ద వృద్ధులే అధికంగా ఉన్నారు...పాలకుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఊరు కనుమరుగవుతోంది. ఇదే పేయలవానిపెంట గ్రామ ఘోష..
ములకలచెరువు మండలం దేవళచెరువు పంచాయతీ పేయలవానిపెంట ఊరు రిజర్వు ఫారెస్ట్ అయిన మొతకమల కొండ ప్రాంతంలో ఉంది. గ్రామంలో 50కు పైగా కుటుంబాలు నివాసముండేవి. భూములున్నా బోర్లు వేసుకుని సాగుచేసే స్థోమత లేక అధిక భాగం సమీప గ్రామాల్లోని వ్యవసాయ పనులకు కూలీలుగా వెళ్లేవారు. గతంలో వర్షాధారంగా సాగు చేస్తున్న వేరుశనగ పంటపై అడవి పందులు, జింకలు, నెమళ్లు డాడి చేసి మొత్తం నాశనం చేస్తుండటంతో సాగును నిలిపివేశారు. పంటలు గిట్టుబాటు కాక సాగు తగ్గడం, కూలీకి వెళ్లే గ్రామాల్లో పనులు దొరక్కపోవడం, వర్షాధార పంటలపై అడవి జంతువులు దాడి చేసి నాశనం చేస్తుండటంతో చేసేది లేక ఊరు వలసబాట పట్టింది. బెంగళూరు, మదనపల్లె పట్టణాలకు వలసెళ్లారు. సగానికిపైగా గ్రామం ఖాళీ అయ్యింది. ఈ కారణంగా ఎక్కడ చూసినా పడిపోయిన ఇళ్ల మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. తాళాలు పడ్డ ఇళ్లు కనిపిస్తున్నాయి. పిల్లలు లేక ఊరులోని ప్రభుత్వ బడి మూతపడింది. ఇప్పుడిప్పుడే నలుగురు రైతులు బోర్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. మిగిలిన వారు ఆవులు, గొర్రెలు మేపుకుంటే బతుకుబండిని లాగుతున్నారు. వ్యాధుల బారినపడి ఆవులు, గొర్రెలు మృత్యువాత పడుతుండటంతో గ్రామంలో ఉన్న వారు కూడా వలస వెళ్లే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మారుమూల ప్రాంతం కావడంతో బస్సులు, ఆటోలు రావు. పనుల మీద పంచాయతీ కేంద్రమైన దేవళచెరువుకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు నడుచుకుని వెళ్లాల్సి వస్తోంది. లేదంటే ద్విచక్ర వాహనాలు ఉన్నవారి సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కనీస వసతులు కరువు...ఆగిన ఉపాధి పనులు
గ్రామంలో కనీస వసతులు కరువయ్యాయి. ఏ వీధిలోనూ సిమెంటు రోడ్డు కనిపించదు. వీధుల్లో 40 ఏళ్ల కిందట పరిచిన బండలే నేటికీ దర్శనమిస్తున్నాయి. బండల మీదే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. తాగునీటి బోరు మరమ్మతులకు గురై నెల రోజులు కావస్తున్నా పట్టించుకునే వారులేరు. ఓ రైతు బోరు నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవారు. రెండు నెలలుగా అధికారులు అవీ కల్పించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు, మూడు కుటుంబాలు తప్ప ఊరు మొత్తం ఖాళీ అయ్యే అవకాశం లేకపోలేదు.
ఉపాధి పనులు కల్పిస్తే కొంత ఊరట
ఉపాధి పనులు కల్పిస్తే కొంత ఊరటగా ఉంటుంది. ఊర్లో పనుల్లేక సగం కుటుంబాలు వలస వెళ్లాయి. భూములున్నా సాగు స్థోమత లేదు. గతంలో మాదిరిగా వ్యవసాయ పనులు కూడా లేవు. అధికారులు ఉపాధి పనులు కల్పించాలి.
- మారపరెడ్డి, పేయలవానిపెంట, ములకలచెరువు మండలం