అనగనగా ఓ దేవర దున్నపోతు
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:16 AM
జాతరకు బలిస్తున్నారంటూ ఢిల్లీకి ఫిర్యాదు ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరుగు రాత్రంతా జాగారం చేసి బలిని అడ్డుకున్న వైనం
పూతలపట్టు, ఆంధ్రజ్యోతి: అనగనగా ఓ దేవర దున్నపోతు. జాతరకు బలిచ్చేందుకు తీసుకొచ్చారు. ఇంతలో ఈ బలి కథ ఢిల్లీకి చేరింది. అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దళితవాడకు చేరుకున్నారు. రాత్రంతా జాగారం చేసి బలిని అడ్డుకోవడంతో.. ఆ కథ ముగిసింది. పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లి దళితవాడలో 40 కుటుంబాలకుపైగా నివాసం ఉంటున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి అమ్మవారి జాతర చేపట్టారు. మంగళ, బుధవారాల్లో జాతరకు ఏర్పాట్లు చేశారు. ఇక, నడివీధిలో అమ్మవారికి కుంభం పెట్టి దున్నపోతును బలిఇవ్వాలని రూ.50 వేలు ఖర్చుపెట్టి దున్నపోతును కొని.. గ్రామానికి తీసుకొచ్చారు. దీనిని గమనించిన కొందరు స్థానికులు పగలు కట్టేసి ఉన్న దున్నపోతు ఫొటోలు తీసి ఢిల్లీలోని కేంద్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి పొటోలు పంపారు. తిమ్మిరెడ్డిపల్లెలో జాతర పేరిట మూగజీవాలను బలిస్తున్నారని, దానిని అడ్డుకోవాలని మెసేజ్ పెట్టారు. ఈ విషయాలేవీ తెలియని గ్రామస్తులు మంగళవారం అమ్మవార్ల ఆలయాల వద్ద పొంగళ్లు పెట్టారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరకు వచ్చిన బంధువులు, చుట్టుపక్కల గ్రామాల వారితో సందడి నెలకొంది. మంగళవారం రాత్రి మంగళవాయిద్యాల నడుమ పూజలు నిర్వహించాల్సి ఉండగా.. గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ తీగలను కట్ చేయడంతో సరఫరా ఆగింది. దీంతో చీకట్లోనే పూజాకార్యక్రమాలు నిర్వహించారు.
అధికారుల పరుగు
స్థానికుల మెసేజ్‌పై ఢిల్లీలోని పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ బలిని అడ్డుకోవాలంటూ జిల్లా కలెక్టరేట్‌కు ఆదేశాలు పంపారు. ఆ వెంటనే మంగళవారం రాత్రి పూతలపట్టు తహసీల్దార్ ఉదయ సతీ్‌షకి కలెక్టర్ సుమిత్‌కుమార్ ఫోను చేశారు. తిమ్మిరెడ్డిపల్లిలో దున్నపోతును బలి ఇస్తున్నారని, ఆపాలని ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో ఎస్పీ తుషార్ డూడీ కూడా పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు కలిసి మంగళవారం రాత్రి 10.30 గంటలకు తిమ్మిరెడ్డిపల్లెకు చేరుకుని విచారించారు. దేవర దున్నపోతును బలి ఇవ్వనున్నారని తెలిసి.. ఆలయం వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. దున్నపోతు బలి ఆపాలని స్థానికులకు సూచించారు. 40 సంవత్సరాల తర్వాత గ్రామం బాగుపడాలనే ఉద్దేశంతో తాము దున్నపోతును బలివ్వాలని అనుకున్నామని అధికారులకు చెప్పారు. అందరం కలిసి దున్నపోతును రూ.50 వేలకు కొని తీసుకొచ్చామని చెప్పారు. ఏదిఏమైనా బలి ఇవ్వరాదని అధికారులు స్పష్టంచేశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దున్నపోతు బలి ఆపి కుంభం వేసి భక్తులు తమ మొక్కలు తీర్చుకున్నారు. ఏ సమయంలోనైనా దున్నపోతును బలిస్తారనే భావనతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది మంగళవారం రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 7 గంటల వరకు దున్నపోతు వద్ద కాపలాగా ఉన్నారు. బుధవారం ఉదయం తహసిల్దార్ ఉదయ సతీష్ తిమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చేరుకొని జిల్లాస్థాయి అధికారుల ఆదేశాల మేరకు తాము దున్నపోతును స్వాధీనం చేసుకుంటామని గ్రామస్థులతో చెప్పారు. దున్నపోతును తీసుకెళితే తమకు రూ.50వేలు నష్టం వస్తుందని, దానికి ఖర్చుపెట్టిన డబ్బులు ఇచ్చేస్తే తీసుకెళ్లొచ్చని గ్రామస్తులు చెప్పారు. మొత్తమ్మీద దేవర దున్నపోతు బలి కథ ఢిల్లీకి చేరడంతో.. ఆగింది.