Share News

నిబంధనలు హుష్‌కాకి

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:04 AM

ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాల నిర్వహణ ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు ఓపెన్‌

  నిబంధనలు హుష్‌కాకి
రాత్రి 11 గంటలు దాటినా ఓ మద్యం దుకాణం పర్మిట్‌ రూమ్‌లో మద్యం తాగుతున్న మందుబాబులు

మదనపల్లె టౌన్‌, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వాహకులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తామని లైసెన్సులు పొందినప్పుడే ఎక్సైజ్‌ అధికారులకు అగ్రిమెంట్‌ రాసిచ్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అన్నమయ్య జిల్లాలో 111 మద్యం దుకాణాలకు 2024లో లైసెన్సులు మంజూరు చేశారు. కచ్చితంగా సమయపాలన పాటించాలని, బెల్టు దుకాణాలకు మద్యం విక్రయించరాదని, ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని, కల్తీ చేయరాదని, మైనర్లకు విక్రయించరాదని నిబంధనలు విధించారు. ఉదయం 10గంటలకు తెరచి, రాత్రి 10 గంటలకు మూసివేయాలి. క్షేత్రస్థాయిలో ఇందులో ఏ ఒక్క నిబంధన కూడా అమలు కావడం లేదు.

మచ్చుకైనా కానరాని సమయపాలన

ఉదయం 7 గంటలకే మద్యం దుకాణాల పక్కన చిన్న బంకుల్లో మద్యం ఉంచి విక్రస్తున్నారు. రాత్రిపూట దాదాపు 80శాతం దుకాణాలు 11 గంటల వరకు తెరచి ఉంచి మద్యం విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు మద్యం తాగి గొడవలకు దిగుతున్నారు. మదనపల్లెలో ఇటీవల మద్యం దుకాణాల వద్ద రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి. పది రోజుల క్రితం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక దివ్యాంగుడు ఫూటుగా మద్యం తాగి ఆటో డ్రైవర్‌ను, అతడి స్నేహితుడిని బూతులు తిట్టగా వారు అతన్ని రాళ్లతో కొట్టి హత్య చేశారు.

అమలుకాని ఎమ్మార్పీ..

మదనపల్లెలో మద్యం వ్యాపారులు రాత్రి 10గంటలు దాటగానే ఒక్కో మద్యం బాటిల్‌కు ఎమ్మార్పీ కన్నా రూ.10 ఎక్కువకు విక్రయిస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. ‘ఇష్టముంటే తీసుకోండి లేకుండా వెళ్లండి’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా ఓ మద్యం దుకాణంలో కాలం చెల్లిన బీర్లను విక్రయించగా మద్యం ప్రియుడు బాటిల్‌పై ఉన్న ఎక్స్‌పైరీ తేదీ చూపుతూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశాడు.

లిఫ్టింగ్‌ ఎత్తమని ఎక్సైజ్‌ అధికారుల ఒత్తిడి

జిల్లాలోని 111 మద్యం దుకాణాల్లో ప్రతి నెలా ఎంత లేదన్నా రూ.100కోట్ల మద్యం విక్రయాలు జరపాలని ఎక్సైజ్‌ ఉన్నతాఽధికారుల నుంచి టార్గెట్‌లు వస్తున్నాయి. దీంతో ఆయా సర్కిల్‌ పరిధిలోని మద్యం దుకాణాల నిర్వాహకులను ఎక్సైజ్‌ అధికారులు వెంటపడి మద్యం గోదాముల్లో లిఫ్టింగ్‌ ఎత్తమని ఒత్తిడి చేస్తున్నారు. మదనపల్లె ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో 26 మద్యం దుకాణాలు ఉండగా నెలకు రూ.21కోట్ల వ్యాపారం చేయాలని టార్గెట్‌గా ఉంది. దీంతో అధికారులు చెప్పినట్లు మద్యం డిపోల నుంచి లిఫ్టింగ్‌ ఎత్తుతున్న వ్యాపారులు సమయపాలనలో వెసులుబాటు కల్పించాలని ఎక్సైజ్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు విక్రయిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. కాలం చెల్లిన బీర్ల విక్రయాలపై ఇప్పటికే తమ సిబ్బంది వెళ్లి తనిఖీ చేస్తున్నారు. సమయపాలన పాటించడంపై ఇక నుంచి జిల్లా అంతటా నిఘా పెట్టి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం.

మధుసూదన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, మదనపల్లె.

Updated Date - Apr 28 , 2026 | 01:04 AM