Share News

మార్కు వేయకనే.. ముగుస్తున్న పదవీకాలం

ABN , Publish Date - Mar 11 , 2026 | 02:24 AM

తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చనే కోటి ఆశలతో బాధ్యతలు తీసుకున్న పాలకవర్గాలు తమ ముద్ర వేయలేకపోయారు. వైసీపీ వారికి పదవుల్ని ఇచ్చిందే తప్ప.. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఐదేళ్లపాటు నిస్తేజంగా ఉండిపోవాల్సి వచ్చింది. 2021 మార్చిలో పుర, నగరపాలక సంస్థల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాల పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగియనుండటంతో ముగియడంతో.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకసారి మున్సిపల్‌ పాలకవర్గాల పాలనను గుర్తుచేసుకుంటే..

మార్కు వేయకనే.. ముగుస్తున్న పదవీకాలం
చిత్తూరు కార్పొరేషన్‌ చివరి సమావేశంలో మేయర్‌ అముదను సన్మానిస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌, చుడా చైర్మన్‌ హేమలత, కమిషనరు నరసింహ ప్రసాద్‌

  • ఐదేళ్లలో కనిపించని పాలకవర్గాల ముద్ర

  • మున్సిపాలిటీల్లో 18 నుంచి ప్రత్యేకాధికారుల పాలన

చిత్తూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవచ్చనే కోటి ఆశలతో బాధ్యతలు తీసుకున్న పాలకవర్గాలు తమ ముద్ర వేయలేకపోయారు. వైసీపీ వారికి పదవుల్ని ఇచ్చిందే తప్ప.. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఐదేళ్లపాటు నిస్తేజంగా ఉండిపోవాల్సి వచ్చింది. 2021 మార్చిలో పుర, నగరపాలక సంస్థల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గాల పదవీకాలం ఈనెల 17వ తేదీతో ముగియనుండటంతో ముగియడంతో.. వారి స్థానంలో ప్రత్యేకాధికారుల్ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకసారి మున్సిపల్‌ పాలకవర్గాల పాలనను గుర్తుచేసుకుంటే..

అప్పట్లో అక్రమ ఏకగ్రీవాలు

జిల్లా వ్యాప్తంగా అప్పట్లో అక్రమ ఏకగ్రీవాలు చేసుకుని అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. చిత్తూరులో 50 డివిజన్లు ఉండగా, 37 చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారు. పలమనేరులో 26 వార్డులకు 8, నగరిలో 29కి 22 వార్డుల్లో మాత్రమే ఎన్నికలు జరిపించారు. చిత్తూరులో పోలీసుల్ని రంగంలోకి దించి బెదిరించారు. అభ్యర్థుల్ని కిడ్నాప్‌ చేయించారు. దీంతో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు చిత్తూరుకు వస్తున్న క్రమంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రోజంతా వేచి చూసినా పోలీసులు అనుమతించకుండా వెనక్కి పంపేశారు. మొత్తంగా అప్పటి ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ వైసీపీనే అక్రమంగా పాగా వేసింది.

ఎక్కడా కనీస అభివృద్ధి చేయలేక..

నగరి మున్సిపాలిటీ పాలకవర్గం అప్పట్లో రోజా చేతిలో బొమ్మలా పనిచేసింది. నగరి మున్సిపాలిటీ 15 ఏళ్ల కిందట ఏర్పడినా.. అప్పటి పంచాయతీ కార్యాలయంలోనే మున్సిపల్‌ ఆఫీసు నడుస్తోంది. రవ్వంత అభివృద్ధి కూడా చేయలేకపోయారు. పలమనేరు మున్సిపాలిటీలో ఐదేళ్ల చైర్‌పర్సన్‌ కాలాన్ని పవిత్ర, చాముండేశ్వరి సగం చొప్పున పంచుకున్నారు. ఇక్కడా పాలకవర్గం కనీస మార్కు వేయలేకపోయింది. పుంగనూరులో మంత్రి పెద్డిరెడ్డి ఉన్నా, అక్కడి పాలకవర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చేయలేదు. రూ.50 కోట్లతో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకును ఉపయోగంలోకి తేలేకపోయారు.

చిత్తూరులో మూడేళ్లు నిస్తేజం.. ఆపై ప్రగతికి బీజం

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాలకవర్గం కూడా వైసీపీ ఉన్నంతకాలం నిధుల్లేక మూడేళ్లు నిస్తేజంగా ఉన్నా.. కూటమి వచ్చాక మాత్రం ప్రత్యేక నిధులతో ఇక్కడ ప్రగతికి బీజం పడింది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ చొరవతో ఇక్కడ పాలకవర్గాన్ని టీడీపీలోకి మార్చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చి పాలకవర్గం ద్వారా సుమారు రూ.50 కోట్లతో నగరంలోని పలు రహదారుల్ని అభివృద్ధి చేశారు. అడవిపల్లె రిజర్వాయర్‌ నుంచి చిత్తూరుకు రూ.150 కోట్లతో పైపులైను ఏర్పాటు పనులు చేస్తున్నారు. వైసీపీ హయాంలో ఒక్క పైపూ ఏర్పాటు చేయకపోయినా, ఇప్పుడు పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే మురుగుకాలువలు, వీధి లైట్లు, సీసీ రోడ్లు.. వంటి అభివృద్ధి పనులు జోరుగా చేస్తున్నారు.

ప్రత్యేకాధికారుల నియామకం

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రత్యేకాధికారిగా ఉంటారు. పలమనేరు, నగరి మున్సిపాలిటీలకు అక్కడి ఆర్డీవోలు భవాని, అనుపమ, పుంగనూరుకు మాత్రం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు 2021 మార్చిలో ఎన్నికలు జరగడంతో ఈ ఏడాది 17వ తేదీన వీరి పదవీకాలం ముగియనుంది. 18వ తేది నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానుంది. ఇక, కుప్పంలో మాత్రం ఆ ఏడాది నవంబరులో ఎన్నికలు నిర్వహించారు. దీంతో కుప్పం పాలకవర్గ పదవీకాలం ఐదేళ్లు పూర్తి కాకపోవడంతో ఆ మున్సిపాలిటీకి ప్రత్యేకాధికారిని నియమించలేదు.

Updated Date - Mar 11 , 2026 | 02:24 AM