Share News

తంబళ్లపల్లెలో ఉద్రిక్తత టీడీపీ, వైసీపీ బాహాబాహీ

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:31 AM

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు పుంగనూరు, రాయచోటిలో చోటుచేసుకున్న తరహాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది

తంబళ్లపల్లెలో ఉద్రిక్తత  టీడీపీ, వైసీపీ బాహాబాహీ
పెద్దమండ్యంలో కాలుతున్న ద్విచక్ర వాహనాలు

అన్నమయ్య, అక్టోబర్‌ 22(ఆంఽఽధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల తొలిరోజు పుంగనూరు, రాయచోటిలో చోటుచేసుకున్న తరహాలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, పీటీఎంలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇరు పార్టీల నేతలు పరస్పరం కవ్వింపు చర్యలకు పాల్పడటం ఘర్షణకు దారితీసింది. టీడీపీ నేతలపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేస్తున్నా పట్టించుకోకుండా చెలరేగిపోయారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల రెండవ రోజైన గురువారం జిల్లాలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే..

- సోమలలో నామినేషన్‌ వేసేందుకు సహకరించాలని పోలీసులను కోరుతూ వైసీపీ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించారు. వైసీసీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌దాఖలు చేసిన సాంబశివయ్యను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.

- చౌడేపల్లె మండలం కొండామర్రి వద్ద వైసీపీ నాయకులు దాడి చేయడంతో బోయకొండకు చెందిన టీడీపీ కార్యకర్తల కారు ధ్వంసమైంది. ప్రతిగా బోయకొండకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ మండలాధ్యక్షుడి ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు.

- తంబళ్లపల్లె మండలం కన్నెమడుగులో వైసీపీ కీలక నేతలు బాబు బ్రదర్స్‌ (రవి శంకర్‌ రెడ్డి, రామకృష్ణా రెడ్డి)ని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అరెస్టు చేసి, ములకలచెరువు పోలీసు స్టేషన్‌కు తరలించారు. తంబళ్లపల్లె నామినేషన్‌ కేంద్రం వద్ద టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేత మధుకర్‌నాయుడు గాయపడ్డారు. నామినే షన్‌ కేంద్రానికి సమీపంలో ఉన్న జనసేన కార్యాలయాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేత పురుషోత్తం ట్రాక్టర్‌కు నిప్పు పెట్టారు. టీడీపీ నేతలు ధనశేఖర్‌, రెడ్డెప్పరెడ్డి, ఆదిరెడ్డి, నాగభూషణం గాయాలయ్యాయి.

- పెద్దతిప్పసముద్రం మండలంలో వైసీపీ నాయకుల రాళ్ల దాడిలో టీడీపీ నేతలు నారాయణ రెడ్డి, ఆనంద్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోల్లో రాళ్లు తీసుకొచ్చి టీడీపీ వాళ్లపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేస్తున్నా దాడి కొనసాగించారు.

- ములకలచెరువులో వైసీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అడ్డుకోవడంతో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. సుమారు రెండు గంటల పాలు ఉద్రిక్తత కొనసాగింది. నామినేషన్‌ కేంద్రం పరిశీలనకు వచ్చిన జాయింట్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మకు తమను నామినేషన్లు వేయనీయడం లేదంటూ వైసీపీ వాళ్లు ఫిర్యాదు చేశారు.

- పెద్దమండ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు.

- చిన్నమండెంకు చెందిన వైసీపీ నేత మండిపల్లి బాబు రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు.

- పీలేరు మాజీ ఎంపీపీ కంభం సతీష్‌ రెడ్డి, వైసీపీ మండలాధ్యక్షుడు దండు జగన్మోహ న్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గాయం మధుసూధన్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు తరలించారు. టీడీపీతో సమానంగా తమకూ నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలంటూ వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించాయి.

- గుర్రంకొండ మండలంలో నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మార్కెట్‌ యార్డు వద్ద జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు గంట పాటు ధర్నా నిర్వహించారు.

Updated Date - Oct 23 , 2026 | 12:31 AM