బ్రాహ్మణపట్టులో ఉద్రిక్తత
ABN , Publish Date - May 15 , 2026 | 01:11 AM
తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది.రైతులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బ్రాహ్మణపట్టు, సమీపంలోని చింతకాలువ, కొత్తకండ్రిగ, పచ్చికాలువ (వడమాలపేట మండలం) గ్రామాల పరిధిలోని భూములపై ఎన్నో ఏళ్లుగా రైతులు, టీటీడీ మధ్య వివాదం నడుస్తోంది.
- టీటీడీ సర్వేని అడ్డుకున్న రైతులు
తిరుచానూరు, మే 14 (ఆంధ్రజ్యోతి):తిరుపతి రూరల్ మండలం బ్రాహ్మణపట్టు వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది.రైతులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బ్రాహ్మణపట్టు, సమీపంలోని చింతకాలువ, కొత్తకండ్రిగ, పచ్చికాలువ (వడమాలపేట మండలం) గ్రామాల పరిధిలోని భూములపై ఎన్నో ఏళ్లుగా రైతులు, టీటీడీ మధ్య వివాదం నడుస్తోంది. ఈ నాలుగు గ్రామాల పరిధిలో సుమారు 127 ఎకరాలున్నాయి. ఈ భూములన్నీ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లోని లక్ష్మీనారాయణ టెంపుల్ ట్రస్టు పరిధిలో ఉన్నాయి. ఈ భూములకు పన్ను చెల్లించి దాదాపు 132మంది రైతులు సాగు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ట్రస్టు నుంచి తమకు ఈ భూములు సంక్రమించాయంటూ 1995లో టీటీడీ రంగ ప్రవేశం చేసింది. అప్పటినుంచి రైతులకు, టీటీడీ అధికారులకు మధ్య వివాదం మొదలైంది. ఎందుకంటే అప్పటికే ఈ భూములపై క్రయవిక్రయాలు జరిగాయని కొందరు, బహిరంగ వేలం ద్వారా కూడా కొనుగోలు చేశామని మరికొందరు అడ్డుకున్నారు. గతంలో టీటీడీ చైర్మన్‌గా మొదటిసారి కరుణాకరరెడ్డి వున్నప్పుడు రైతులతో సమావేశమై ఈ 127 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామన్నారు. హక్కు కలిగిన రైతులకు 25శాతం భూమి ఇచ్చి మరికొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ భూముల్లో ఉన్న బావులకు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లకు సంబంధించి చెక్కులు అందజేశారు. చాలా మంది రైతులు పరిహారాన్ని తీసుకోలేదు. మరోవైపు ఇదే భూముల్లో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ప్లాట్లు కూడా చదును చేశారు. దీనిపై కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో గురువారం టీటీడీ ఎస్టేట్ విభాగం రెవెన్యూ తహసీల్దారు లలితాంజలి సిబ్బందితో కలిసి ఈ భూముల వద్దకు వచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేయడానికి సర్వే ప్రారంభించారు. ఎక్స్‌కవేటర్లు తీసుకొచ్చి పనులు ప్రారంభించడంతో న్యాయస్థానం పరిధిలో ఉన్న భూముల్లోకి మీరెలా వస్తారంటూ రైతులు అడ్డుకున్నారు. లలితాంజలి, వారి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సిబ్బంది కూడా రావడంతో రగడ మొదలైంది. బ్రాహ్మణపట్టుకు చెందిన సుబ్రహ్మణ్యంరెడ్డి, చింతకాలువకు చెందిన అఖిల్ పెట్రోల్‌మీద పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.1990లో బహిరంగ వేలంలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన ఈ భూమే తనకు జీవనాధారమని సుబ్రహ్మణ్యంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యాడు.తాతల కాలం నుంచి ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని, ఇపుడు టీటీడీ వచ్చి భూములు తీసుకుంటామంటే తమ పరిస్థితేంటని అఖిల్ విలపించాడు.ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో తిరుచానూరు పోలీసులు రంగ ప్రవేశంచేశారు. రైతుల వద్ద నుంచి క్యాన్లను లాక్కొని, కాపాడారు. వీరిని పద్మావతి అమ్మవారి ఆలయ ఏవీఎస్వో రాధాకృష్ణ, తిరుచానూరు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సముదాయించారు. మీ సమస్యలపై టీటీడీ ఉన్నతాధికారులను కలవాలని రైతులకు సూచించి.. ఎస్టేట్ విభాగం సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోయారు.
తప్పుదోవ పట్టిస్తున్నారన్న టీటీడీ ఎస్టేట్ సిబ్బంది
కలికిరి కొండ ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురావడంతో అక్కడున్న 600కుపైగా గోవులకు డెయిరీ ఫామ్ ఏర్పాటు చేయాల్సివుంది.ఇందుకోసం న్యాయస్థానం పరిధిలో లేని 40 ఎకరాల భూమిలో డెయిరీ ఫామ్ ఏర్పాటుకు సర్వే చేయడానికి వచ్చాం. అయితే కొందరు ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని టీటీడీ ఎస్టేట్ సిబ్బంది తెలిపారు.