Share News

టీచర్‌ అసభ్య ప్రవర్తన

ABN , Publish Date - Aug 28 , 2026 | 01:38 AM

చిన్నారుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గురువారం పీలేరులో చోటుచేసుకుంది. బాలికల ద్వారా ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేయడమేగాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీచర్‌ అసభ్య ప్రవర్తన

పోక్సో కేసు నమోదు

పీలేరు, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): చిన్నారుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గురువారం పీలేరులో చోటుచేసుకుంది. బాలికల ద్వారా ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేయడమేగాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీలేరు అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. పీలేరు మండలం మేళ్లచెరువు గ్రామ పంచాయతీ చెన్నప్పగారిపల్లె మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎర్రప్ప(60) తమపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ముగ్గురు పిల్లలు బుధవారం రాత్రి తల్లిదండ్రులకు తెలిపారు. వారు గురువారం ఉదయం పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని నిలదీశారు. ఈ లోపు గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు ఆయనపై దాడి చేశారు. విషయం తెలుసుకున్న పీలేరు అర్బన్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎంఈవోలు బాబు నాయక్‌, పద్మావతమ్మ చెన్నప్పగారిపల్లెకు చేరుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడితో మాట్లాడారు. ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పీలేరు స్టేషన్‌కు తరలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. పీలేరు ఆర్డీవో విజయలక్ష్మి ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

రాజకీయాలకు బలయ్యారా...!

ఉపాధ్యాయుడు ఎర్రప్ప చెన్నప్పగారిపల్లెలోని రాజకీయాలకు బలయ్యారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన బాధ్యతల గురించి కొంత కాలంగా టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం నడుస్తోందని, తమకు సహకరించడం లేదన్న అక్కసుతో వైసీపీ నాయకులు ఆయనను అసభ్య ప్రవర్తన పేరుతో ఇరికించారని ఆరోపించారు. ప్రభుత్వం మారిన తర్వాత మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి వైసీపీ సానుభూతిపరులను తప్పించి టీడీపీ వారికి అప్పగించడంతో వివాదం మొదలైందని తెలిపారు.

Updated Date - Aug 28 , 2026 | 01:38 AM