Share News

ముగిసిన టీచర్ల సర్దుబాటు

ABN , Publish Date - Jul 13 , 2026 | 12:02 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత బుధవారం మండల స్థాయిలో మొదలైన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఆదివారంతో జిల్లా స్థాయితో ముగిసింది.

ముగిసిన టీచర్ల సర్దుబాటు
టీచర్ల సర్దుబాటు ప్రకియలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది

చిత్తూరు సెంట్రల్‌, జూలై 12(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత బుధవారం మండల స్థాయిలో మొదలైన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఆదివారంతో జిల్లా స్థాయితో ముగిసింది. ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ సూపరింటెండెంట్లు, సిబ్బంది, సాంకేతిక నిపుణుల సహకారంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేశారు. ఏడుగురు హెచ్‌ఎంలు, 8 మంది పీఈటీలకు మినహా మిగులుగా ఉన్న 250 మంది (స్కూల్‌ అసిస్టెంట్లు, సెంకడరీ గ్రేడ్‌ టీచర్లు) టీచర్ల సర్దుబాటు చేశారు. 250 మంది టీచర్లను సర్దుబాటు చేసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 66 మండలాల్లోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాజమాన్యాల కిందనున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఏర్పడిన మొత్తం 859 ఖాళీలను చూపారు. సబ్జెక్టుల వారీగా ఎక్కువ మందిని మండల స్థాయిలో సర్దుబాటు చేయగా, మిగిలిన వారిని ప్రస్తుతం వారు పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు చేశారు. శుక్ర, శనివారాల్లో డివిజన్‌ స్థాయిలో చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, పుత్తూరు డివిజన్లలో సర్దుబాటు జరిగింది. 189 మిగులు టీచర్లను సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాగా 129 మంది ఆమోదం తెలుపకగా, మిగిలిన 60 మంది ‘నాట్‌ విల్లింగ్‌’ ఇచ్చారు. కాగా, ఆదివారం జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సర్దుబాటుకు 44 మంది హాజరు కాగా, కేవలం ముగ్గురే ఆమోదం తెలపగా, మిగిలిన 41 మంది టీచర్లు నాట్‌ విల్లింగ్‌లో ప్రస్తుతం తాము పనిచేస్తున్న పాఠశాలలకే పరిమితమయ్యారు. తుది ప్రక్రియలో చిత్తూరు డీవైఈవో ఇందిర, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 12:02 AM