Share News

టీడీపీ ఇన్‌చార్జిగా జేబీ శ్రీనివాస్‌

ABN , Publish Date - Jul 04 , 2026 | 01:23 AM

తిరుపతి నియోజకవర్గ టీడీపీలో ఎట్టకేలకు నాయకత్వ మార్పు సంభవించింది. అధిష్ఠానం ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని హెచ్చరికలు జారీచేసినా అప్రమత్తం కాని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కుటుంబం చేజేతులారా ఇన్‌చార్జి పదవిని పోగొట్టుకున్నారు.

టీడీపీ ఇన్‌చార్జిగా జేబీ శ్రీనివాస్‌

-వైసీపీని దీటుగా ఎదుర్కొనే వ్యూహం

తిరుపతి/తిరుపతి సిటీ , జూలై 3(ఆంధ్రజ్యోతి): తిరుపతి నియోజకవర్గ టీడీపీలో ఎట్టకేలకు నాయకత్వ మార్పు సంభవించింది. అధిష్ఠానం ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎన్ని హెచ్చరికలు జారీచేసినా అప్రమత్తం కాని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కుటుంబం చేజేతులారా ఇన్‌చార్జి పదవిని పోగొట్టుకున్నారు. టీడీపీకి కంట్లో నలుసుగా మారిన తిరుపతి వైసీపీ నేతల దూకుడుకు చెక్‌పెట్టే వ్యూహంతో అధిష్ఠానం జేబీ శ్రీనివా్‌సను ఇన్‌చార్జిగా నియమించింది.ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాలతో జేబీ శ్రీనివా్‌సకు బలమైన అనుచరవర్గం ఉంది. బలిజ సామాజిక వర్గం కావడం ఆయనకు ప్రస్తుతం కలిసొచ్చింది. వీటన్నింటికి మించి తిరుపతి టీడీపీలో నాయకత్వ శూన్యత నెలకొన్న నేపథ్యంలో జేబీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తిరుపతిలో వైసీపీ నేతలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం ఏడాది కిందటి వరకు టీడీపీ నుంచీ ఎవరూ చేయలేదు. భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే కక్షసాధింపు చర్యలకు దిగుతారన్న భయం ఒక కారణమైతే బలమైన అనుచర వర్గాలు లేకపోవడం మరో కారణం. ఈ విషయంలో జేబీ శ్రీనివాస్‌ దూకుడుగా వ్యవహరించారు. వైసీపీ నేత భూమన తన ఇంటి వద్ద సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను రాక్షసులుగా చిత్రీకరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి హోమం నిర్వహిస్తుండగా జేబీ అనుచరులను పంపి భూమన ఇంటి వద్దే వారిని ఢీకొన్నారు. ఇలాంటి ప్రయత్నాలతో అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. రాష్ట్రంలోనే అత్యంత కీలక నియోజకవర్గమైన తిరుపతిలో పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడాన్ని గుర్తించిన అధిష్ఠానం మార్పు చేర్పులపై దృష్టి పెట్టింది.ఆ క్రమంలో జేబీ పేరును శాప్‌ చైర్మన్‌ రవినాయుడు సూచించినట్టు తెలిసింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యప్రసాద్‌ కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో అధిష్ఠానం జేబీ వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. గురువారం రాత్రి శాప్‌ చైర్మన్‌ రవినాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాకలక్ష్మి, జేబీ శ్రీనివా్‌సలతో మాట్లాడిన అధినేత చంద్రబాబు శుక్రవారం ఉదయం మళ్లీ జేబీని పిలిపించుకున్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ వెంటనే అధినేత ఆదేశాల పేరిట పార్టీ కార్యాలయం నుంచి ఆయన్ను ఇన్‌చార్జిగా నియమించినట్టు ప్రకటన వెలువడింది. జేబీ శ్రీనివాస్‌ ఇన్‌చార్జిగా నియమితులు కావడంతో తిరుపతి రాజకీయాలు మారనున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ ఏకపక్ష రాజకీయాలు నడవగా టీడీపీ నేతలు ప్రకటనలకు, ప్రెస్‌మీట్లకు పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో వైసీపీని ఎదుర్కొనే పరిస్థితి లేకపోయింది. అయితే ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీని భౌతికంగా కూడా ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.అయితే దానివల్ల కొంతమేరకు ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు జేబీ శ్రీనివా్‌సపై రౌడీ ముద్ర వేసేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా తనపై అలాంటి ముద్ర పడకుండా బాధ్యతగా వ్యవహరించి అధినేత ఇచ్చిన అవకాశాన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

అవకాశాలను పోగొట్టుకున్న సుగుణమ్మ

తిరుపతి రాజకీయాల్లో సుగుణమ్మ కుటుంబం సుదీర్ఘకాలంగా కొనసాగుతొంది. తొలుత కాంగ్రె్‌సలో తర్వాత టీడీపీలో కూడా ఎమ్మెల్యేలుగా గెలిచిన నేపథ్యం ఆ కుటుంబానికి ఉంది. సుగుణమ్మ, ఆమె భర్త వెంకటరమణ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. నియోజకవర్గ రాజకీయాలపై లోతైన అవగాహన, విస్తృత పరిచయాలు సుగుణమ్మకు ఉన్నాయి. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. అధికారం ఉన్నప్పుడు కూడా బలమైన క్యాడర్‌ను ఏర్పరుచుకోలేకపోయారు. కుటుంబ సభ్యులొకరి తీరుపట్ల నియోజకవర్గ పార్టీ క్యాడర్‌ వ్యతిరేకంగా ఉన్నట్టు స్పష్టమైన సంకేతాలు అందుతున్నా సరిదిద్దుకోలేదని సమాచారం. అధిష్ఠానం నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చినా అప్రమత్తం కాలేదని, నిర్లక్ష్యం వహించినట్టు సమాచారం. ఆమె మనవరాలు కీర్తి టీడీపీలో ఎదిగేందుకు ఆసక్తి చూపినా దానికోసం తగిన విధంగా సన్నద్ధం కాలేదని, ప్రయత్నించలేదని శ్రేణులు చెబుతున్నాయి. దీంతో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, అనుభవం ఉండి కూడా సుగుణమ్మ కుటుంబం చేజేతులారా టీడీపీ ఇన్‌చార్జి పదవిని పోగొట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఆశావహులకు నిరాశ

ఇన్‌ఛార్జి పదవిలో కొనసాగాలని సుగుణమ్మ,పదవికోసం ప్రయత్నం చేసిన మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం, ప్రణీత్‌లతో పాటు మరికొందరు నేతల్లో నిరాశ నెలకొన్నట్టు సమాచారం. శుక్రవారం ఉదయం కలెక్టరేట్‌ వద్ద చంద్రబాబును సుగుణమ్మ వర్గం కలిసి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ...పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని సూచించినట్టు సమాచారం.జేబీకి సహకరించి, మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని మబ్బు దేవనారాయణ రెడ్డికి చెప్పినట్టు తెలిసింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయనకు భరోసా ఇచ్చినట్టు సమాచారం.

సమన్వయంతో పనిచేస్తా

అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జేబీ శ్రీనివాస్‌ తెలిపారు.కూటమిలోని అన్ని పార్టీల నాయకులతో, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ తిరుపతి నియోజకవర్గంలో టీడీపీని మరింత బలోపేతం చేస్తానన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 01:23 AM