Share News

షాక్‌లో కుప్పం టీడీపీ!

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:48 AM

నియోజకవర్గ బాధ్యతలనుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ తొలగింపు కుప్పం టీడీపీని షాక్‌కు గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు.

షాక్‌లో కుప్పం టీడీపీ!
కుప్పం టీడీపీ కార్యాలయం

మంచి రోజులు ముందున్నాయని కార్యకర్తల్లో జోష్‌

అధినేత నిర్ణయంపై సర్వత్రా హర్షం

నియోజకవర్గ బాధ్యతలనుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ తొలగింపు కుప్పం టీడీపీని షాక్‌కు గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల్లో మాత్రం ఫుల్‌ జోష్‌ కనిపిస్తోంది. సమీప భవిష్యత్తులో తమకు మంచి రోజులు రానున్నాయన్న ఆశాభావం వారిలో వ్యక్తమవుతోంది. కంచర్ల తొలగింపు విషయంలో ఒకట్రెండు వ్యతిరేక స్వరాలు బలహీనంగా వినబడకపోలేదు.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

సార్వత్రిక ఎన్నికలకు కాస్త ముందుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ కుప్పంలో అడుగు పెట్టారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాటి అరాచక అధికార వైసీపీ సృష్టించిన ఆటంకాలను ఎదిరించి మరీ విజయం సాధించారాయన. ఈ క్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. వైసీపీతో రాజీ ధోరణిలో పోతున్న, ఏళ్లతరబడి ఉన్న సీనియర్‌ నేతలకు ప్రత్యామ్నాయంగా కంచర్ల కనిపించడంతో అప్పట్లో కేడర్‌ ఆయన వెంట నడిచింది. నాటి అధికార వైసీపీ అరాచకాలు, దౌర్జన్యాలను వ్యతిరేకించే బలమైన గొంతుగా మారిన శ్రీకాంత్‌.. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఎదురొడ్డి నిలిచి, పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. వైసీపీ కుట్రలతో మున్సిపాలిటీని వైసీపీకి కోల్పోవాల్సి వచ్చిందన్నది వేరే విషయం. అయినా వెనకడుగు వేయకుండా 2024 శాసనసభ ఎన్నికల్లో పార్టీ కేడర్‌ను ముందుండి నడిపించారు. చంద్రబాబుకు 48 వేల మెజారిటీ సాధించి పెట్టడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, టీడీపీ ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వచ్చాక.. క్రమేణా కంచర్ల వ్యవహారశైలిపై పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి మొదలైంది. వారికి, ఆయనకు మధ్య సమన్వయం లోపిస్తూ వచ్చింది. నాయక త్రయం కంచర్ల, పీఎ్‌సఎం, డాక్టర్‌ సురేశ్‌బాబు మధ్య తెలియని అడ్డుగోడలు మొలిచాయి. ఇక, అసెంబ్లీ ఎన్నికలను ఉత్సాహంగా ఎదుర్కొన్న కార్యకర్తల్లోనూ ఎందుకో నిర్వేదం అలముకుంది. పార్టీ కార్యాలయంలో కానీ, బయట సభలు, సమావేశాలు జరిగినప్పుడు కానీ.. తమకు సరైన గుర్తింపు, గౌరవం లభించడంలేదన్న ఫిర్యాదులు ఎక్కువవుతూ వచ్చాయి. కుప్పంలో ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఎవరో ఏదో మాట్లాడారని ఆవేశానికి లోనైన కంచర్ల.. ఆ సభలో ఉన్నవారిని, రానివారిని అందరినీ కలిపి ‘ఎవరూ పనిచేయడంలేదం’టూ ఆవేశంగా ఆరోపణలు గుప్పించడం ఆయన మాటతీరుకు అద్దం పట్టే ప్రధాన సన్నివేశంగా మారింది.

కారణాలు ఎన్నో?

కుప్పం బాధ్యతలనుంచి కంచర్లను తొలగించడం వెనుక సూక్ష్మంగా పరిశీలిస్తే.. ఎన్నో సందర్భాలు కనిపిస్తాయి. అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గ పార్టీపై దృష్టి సారించారు. 2024 ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో మెజారిటీ రాకపోవడంపై తొలి సమావేశంలోనే నాయకత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీతో కొద్దిమంది నాయకుల లాలూచీ వ్యవహరాలను నిలదీశారు. తరచూ పార్టీ శ్రేణుల సమావేశాల్లోనూ నాయకుల పనితీరు మెరుగుపడటం లేదంటూ చురకలు అంటిస్తూ వచ్చారు. అమరావతిలో గతంలో జరిగిన సమావేశంలో స్థానిక యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తానని, బయటినుంచి వచ్చిన వారు పార్టీని నడిపించలేకపోతున్నారని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సర్వేలు జరిపిస్తూ, నాయకుల పనితీరును బేరీజు వేస్తూ వచ్చారు. ఎవరికీ అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోవడంతో అసంతృప్తితో రగిలిపోయారు. నియోజకవర్గంలో రూ.వేలకోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నా, సంక్షేమ పథకాలు అమలవుతున్నా, వాటి ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని ఆక్షేపించారు. ఇది చాలదన్నట్లుగా నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌, ఇసుక, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలు యథేచ్ఛగా సాగుతుండటంపై చంద్రబాబు సహించలేక పోయారు. నిజమో కాదో కానీ.. గ్రామస్థాయిలో కొంతమంది చోటా నాయకుల దందాలకు కంచర్ల ఆశీస్సులున్నాయంటూ సాగిన ప్రచారం ప్రజల్లో పార్టీ నాయకత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతూ వచ్చింది. మరోవైపు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యమిచ్చే కడా పీడీ వికాస్‌ మర్మత్‌తో ఆయనకు కొరవడిన సఖ్యత కూడా వ్యతిరేక ప్రభావం చూపింది.

రాబిన్‌ శర్మ బృందం సర్వేతో ఆటకట్టు

టీడీపీ స్ట్రాటజిస్టు రాబిన్‌ సింగ్‌ బృందం 20 రోజుల క్రితం కుప్పం నియోకవర్గంలో సర్వేకు దిగింది. నాయకుల పనితీరు, ప్రభుత్వ పథకాల పట్ల సంతృప్త స్థాయిలపై గ్రామ, పంచాయతీ, మండల స్థాయిల్లో ఈ బృందం ప్రజలు, పార్టీ కేడర్‌తో మమేకమై అభిప్రాయాలు సేకరించింది. ఈ సర్వే ప్రక్రియ పదీపదిహేను రోజులపాటు కొనసాగింది. సర్వే ముగిసీ ముగియగానే ఆదివారం (7వ తేది) సమావేశానికి పిలవం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇక, శ్రీకాంత్‌కు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించే క్రమంలో కుప్పం బాధ్యతలనుంచి తప్పించారని వాదనలు బలహీనంగా వినిపిస్తున్నా, అందులో వాస్తవమెంతో భవిష్యత్తు మాత్రమే నిర్ణయించగలదు.

సీనియర్‌ నాయకత్వంలో నిర్వేదం!

కంచర్ల తొలగింపు సీనియర్‌ నాయకత్వంలో నిర్వేదం నింపింది. పీఎస్‌ మునిరత్నం, డాక్టర్‌ సురేశ్‌బాబు విషయంలోనూ అధినేత అంత సంతృప్తిగా లేరనేందుకు, ఆదివారం నాటి సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఈ నేపథ్యంలో ఏళ్లతరబడి పాతుకుపోయిన మండలస్థాయి ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ ఎప్పుడేమి జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. పేరుకు పీఎ్‌సఎం, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జే కానీ, ఆ బాధ్యతలనుంచి ఆయన ఎప్పుడో దూరమయ్యారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా, కడా రాజకీయ సలహామండలి అధ్యక్షుడిగా దాదాపు మూడన్నరేళ్లపాటు ఎమ్మెల్సీ కంచర్ల కనుసన్నల్లోనే పార్టీ నడిచింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనను రంగంనుంచి అధినేత తప్పించడంతో నాయకత్వ స్థానంలో అనుకోని శూన్యమేర్పడింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఇది ఆశించదగ్గది కాదు. తన పీఏగా అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌ అనే యువకుడు కుప్పం బాధ్యతలు తీసుకుంటారని, ఆయన సలహాలు, సూచనలను పార్టీ శ్రేణులు పాటించాలని ఆ సమావేశంలో చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ పరిస్థితిని సమీక్షించుకుని, పార్టీపై పట్టు సాధించడానికి శ్రీకాంత్‌కు సమయం పడుతుంది. ఈలోగా సంభవించే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించడానికి కుప్పం టీడీపీ షాక్‌ నుంచి త్వరగా కోలుకోవడమే మార్గం. సీనియర్‌ నాయకత్వం నిర్వేదాన్ని వీడి, బాబు పీఏగా రాబోయే శ్రీకాంత్‌కు సహకరించడానికి మనస్ఫూర్తిగా సిద్ధం కాగలగడం కూడా అత్యంత ప్రధానం. ఇక, ఈ రాజకీయ పరిణామాలపట్ల టీడీపీ కార్యకర్తలు మాత్రం సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇంతకాలం గుర్తింపునకు నోచుకోకుండా అట్టడుగు స్థాయిలోనే మిగిలిపోయిన యువ నాయకత్వంలో జోష్‌ కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పార్టీ జెండా మోసిన అటువంటి యువ నాయకత్వాన్ని గుర్తించి ఎవరి సామర్థ్యానికి తగిన బాధ్యతలు వారికి అప్పగిస్తే ఎన్నికలేవైనా అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం టీడీపీకి అలవాటుగా మారుతుందన్నది కాదనలేని సత్యం.

Updated Date - Jun 09 , 2026 | 01:48 AM