టీడీపీకి నాయుడుపేటలో నగుబాటు
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:03 AM
మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర సాగించింది. చివరికి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత ఊరు పులివెందులలో సైతం జెండా ఎగరేసిన ఆ పార్టీ నాయుడుపేటలో మాత్రం చతికిలబడింది.
-అధినేత సొంత జిల్లాలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన వర్గపోరు
-ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి... స్పందించని పార్టీ నేతలు
తిరుపతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా జైత్రయాత్ర సాగించింది. చివరికి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సొంత ఊరు పులివెందులలో సైతం జెండా ఎగరేసిన ఆ పార్టీ నాయుడుపేటలో మాత్రం చతికిలబడింది. రాష్ట్రమంతా సునామీ తరహాలో మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను విజయంతో ఊడ్చేసిన టీడీపీ అధినేతకు సొంత జిల్లా నాయుడుపేటలో చేదు అనుభవం ఎదురైంది. అయితే ఇంతా చేసి అక్కడ వైసీపీ గెలిచింది సొంత బలంతో కాదు. గెలవగలిగిన స్థితిలో వుండి కూడా టీడీపీ వర్గపోరుతో చేజేతులారా మున్సిపాలిటీని వైసీపీ చేతుల్లో పెట్టింది. ఈ పరిణామమే ఇపుడు పార్టీ శ్రేణులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. నాయుడుపేటలో ఏం జరుగుతోంది? అనే శీర్షికతో పోలింగ్‌కు ముందే హెచ్చరిస్తూ ఆంధ్రజ్యోతి కథనం ఇచ్చింది. అధిష్ఠానం కల్పించుకుంటే తప్ప అక్కడ విజయం సాధించడం కష్టమని కుండబద్దలు కొట్టింది. అయినా ఇటు జిల్లా నేతలు గానీ, అటు పార్టీ పరిశీలకులు గానీ స్పందించలేదు.తీరా ఓట్ల లెక్కింపులో ఫలితాలు వెలువడ్డాక అధికారంలో వుండి, అభివృద్ధి చేసి, పార్టీకి బలం వుండి కూడా ఎన్నికల్లో ఓడిపోవడం పార్టీ శ్రేణులకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. ఇంతకీ అక్కడ జరిగిందేమిటో లోతుగా పరిశీలిస్తే.... నాయుడుపేట మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర వర్గ పోరు కారణంగా నేతలు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. తాము చెప్పిన వారినే అభ్యర్థులుగా ఖరారు చేయాలంటూ ఇరువర్గాలూ పట్టుబట్టాయి. చివరికి ఓ వర్గం నేత అధిష్ఠానాన్ని ఒప్పించి ముస్లిం మైనారిటీ నేత 786 రఫీ సతీమణి షాకీరాకు ఛైర్పర్సన్ టికెట్ ఖరారు చేయించుకున్నారు. రఫీ గతంలో వైసీపీలో వుండడం, గత అసెంబ్లీ ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు టీడీపీలోకి రావడం వంటి కారణాలు చూపి మరో వర్గం వ్యతిరేకించింది. ఈ విషయంలో మాట చెల్లుబాటు కాని వర్గం తామెందుకు పనిచేయాలంటూ స్పీడు తగ్గించింది. ఇంకోవైపు జనరల్ మహిళకు రిజర్వు అయిన సీటును రెండు ప్రదాన సామాజిక వర్గాలు ఆశించాయి. ముస్లిం మహిళకు ఇవ్వడంతో ఆ వర్గాలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. అంతర్గతంగా ప్రత్యర్థి పార్టీవైపు మొగ్గు చూపాయి. అన్ని సామాజికవర్గాలనూ రాజకీయంగా న్యాయం జరిగేది టీడీపీలోనే. అదే కోవలో ముస్లిం మైనారిటీ మహిళకు ఛైర్పర్సన్ టికెట్ ఇవ్వడం బాగుంది. అయితే అలా ఇస్తున్నప్పుడు ఆ పదవిని ఆశించిన ఇతర వర్గాలను సముదాయించి, కలసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవడంలో నియోజకవర్గ ముఖ్యనేతలు విఫలమయ్యారు. ఒంటెద్దు పోకడతో వ్యవహరించి మున్సిపాలిటీని పోగొట్టుకోవడమే కాకుండా అధినేత సొంత జిల్లాలో పార్టీకి తలవంపులు తెచ్చారన్న విమర్శలు శ్రేణుల నుంచీ వినిపిస్తున్నాయి. తాము సిఫారసు చేసిన అభ్యర్థి ఓడిపోతే సొంత పార్టీలోని మరో వర్గాన్ని అధిష్ఠానం ఎదుట నిందితులుగా చూపాలన్న ప్రయత్నమే తప్ప ఆ వర్గాన్ని ఒప్పించి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారానికి దిగాలన్న ప్రయత్నం జరగలేదు. ఛైర్పర్సన్ టికెట్ విషయంలో రాజుకున్న అసంతృప్తి వార్డులపై కూడా పడింది. జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో వైసీపీ గరిష్టంగా గెలిచిన వార్డుల సంఖ్య 4 మాత్రమే. అయితే నాయుడుపేటలో ఏకంగా 13 వార్డులు వైసీపీకి దక్కడం పార్టీని కుదిపేస్తోంది. దీనిపై అధిష్ఠానానికి ఏం సమాధానం చెప్పాలో అంతుబట్టక జిల్లాస్థాయి నేతలు సైతం ఖిన్నులైనట్టు సమాచారం. పోలింగ్‌కు ఒకటి రెండు రోజులు ముందు స్పందించినా ఫలితం ఇలా వుండేది కాదని శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచీ అనంతపురం దాకా క్లీన్ స్వీప్ తరహా విజయాలు అందుకున్న అధినేతకు సొంత జిల్లాలోని నాయుడుపేటలో చేదు అనుభవం ఎదురు కావడం మాత్రం పార్టీ అభిమానులను తీవ్ర మనస్తాపానికి