Share News

డబ్బులిస్తేనే టీసీ బుక్కులు..?

ABN , Publish Date - May 25 , 2026 | 01:04 AM

డీడీ చెల్లించాక అదనంగా డబ్బులిస్తేనే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సిబ్బంది టీసీ బుక్కులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

డబ్బులిస్తేనే టీసీ బుక్కులు..?

- విద్యాశాఖ కార్యాలయంలో సిబ్బంది చేతివాటం

- ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాల ఆరోపణ

తిరుపతి రూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): డీడీ చెల్లించాక అదనంగా డబ్బులిస్తేనే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సిబ్బంది టీసీ బుక్కులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం టీసీ బుక్కులను అందిస్తుంది. దీనికోసం ఒక్కో పుస్తకానికి డీఈవో పేరుపై రూ.300 డీడీ చెల్లించాలి. గతంలో ఇచ్చిన బుక్‌ పూర్తిగా వినియోగించినట్లు, డీవైఈవో నుంచి సిఫారసు లెటర్‌తోపాటు స్కూల్‌ గుర్తింపు ఆర్సీ ఇతరత్రా పత్రాలు జతపరచి విద్యాశాఖ కార్యాలయంలో సమర్పిస్తే కొత్త టీసీ బుక్‌ ఇస్తారు. ఈ సమయంలో రూ.300 డీడీ చెల్లించినా ఒక్కో బుక్‌ కోసం రూ.500 చొప్పున సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నాయని, అదేమని అడిగితే ప్రైవేటు విద్యాసంస్థలవారు ఇవ్వాల్సిందేనంటున్నారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. టీసీ బుక్‌ల ద్వారానే ఏటా రూ.లక్షలాదిగా దండుకుంటున్నారని చెబుతున్నాయి. కాగా, దీనిపై డీఈవో కేవీఎన్‌ కుమార్‌ను వివరణ కోరగా.. డీడీ ఇస్తే సరిపోతుంది.. డబ్బులివ్వాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ కార్యాలయంలోని సిబ్బంది ఎవరైనా తీసుకున్నట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Updated Date - May 25 , 2026 | 01:04 AM